Site icon NTV Telugu

ఆమె మంత్రి అయినా వర్గపోరులో మార్పులేదా..?

Mantri

Mantri

కేబినెట్‌లో కొత్తగా చోటు దక్కించుకున్న ఉషశ్రీచరణ్‌కు.. ఎంపీ తలారి రంగయ్య మధ్య మూడేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరి మధ్య వైరం పీక్స్‌కు చేరుకుంది. ఉషశ్రీచరణ్‌ ప్రస్తుతం మంత్రి అయినా.. ఎంపీ తగ్గేదే లేదన్నట్టుగా ముందుకెళ్తున్నారు. మంత్రి పదవి చేపట్టాక జిల్లాకు వచ్చిన ఉషశ్రీచరణ్‌.. జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలందరినీ కలిసి మాట్లాడుతున్నారు. కానీ.. ఎంపీని మాత్రం పలకరించలేదు. మూడేళ్లుగా ఉన్న వైరానికే ఇద్దరూ ప్రాధాన్యం ఇస్తుండటం పార్టీలో చర్చగా మారుతోంది.

కల్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఉషశ్రీచరణ్‌ది కురుబ సామాజికవర్గం. ఎంపీ తలారి రంగయ్యది బోయ సామాజికవర్గం. ఈ సామాజిక సమీకరణాలు కల్యాణదుర్గంలో రెండు వర్గాలను సృష్టించాయి. నియోజకవర్గంలోని బోయ సామాజికవర్గానికి నేతలంతా ఎంపీ దగ్గరకు వెళ్తుండటంతో ఎమ్మెల్యేకు రుచించ లేదు. అలా మొదలైన విభేదాలు పెరుగుతూనే ఉన్నాయి. రెండు బలమైన సామాజికవర్గాలు గ్రూపులుగా ఏర్పడి ద్వేషించుకునే పరిస్థితి వచ్చింది. ఆ ఎఫెక్ట్‌ ఎంపీ, ఎమ్మెల్యేలపైనా ప్రభావం చూపించింది.

ఎంపీని కలిసిన కల్యాణదుర్గం వైసీపీ నేతలంతా ఎమ్మెల్యేకు వ్యతిరేకమనే ప్రచారం గట్టిగానే సాగింది. దీనికితోడు నియోజకవర్గంలో ఉషశ్రీచరణ్‌కు వ్యతిరేకవర్గం తయారు కావడం.. వాళ్లంతా ఎంపీ రంగయ్యను ఆశ్రయించడం సమస్యను శ్రుతిమించేలా చేసింది. ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఇద్దరూ కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న ఉదంతాలు ఈ మూడేళ్లలో లేవన్నది పార్టీ నేతలు చెప్పేమాట. ఇద్దరూ వస్తారు కానీ.. ఒకరినొకరు తారస పడకుండా వచ్చి వెళ్లిపోతారు. ఎంపీకి అనుకూలంగా ఎవరైనా ఫ్లెక్సీలు పెడితే రచ్చే అన్నట్టు ఉండేది. ప్రస్తుతం ఉషశ్రీచరణ్‌ మంత్రి అయ్యారు. మినిస్టర్‌ హోదాలో తొలిసారి ఆమె జిల్లాకు వస్తే భారీ ఊరేగింపు నిర్వహించారు. ఆ కార్యక్రమంలోనూ ఎంపీ రంగయ్య కనిపించలేదు.

ఇటీవల జిల్లా కేంద్రంలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి ఉషశ్రీచరణ్‌ను, ఎంపీలు రంగయ్య, గోరంట్ల మాధవ్‌ను ఆహ్వానించారు. రంగయ్య టైమ్‌కు వచ్చారు కానీ.. మంత్రి రాక ఆలస్యమైంది. దీంతో ఎంత సేపు ఎదురు చూడాలని అనుకున్నారో ఏమో.. అక్కడి నుంచి వెళ్లిపోయారు రంగయ్య. మంత్రి అయితే నాకేంటి అని వెళ్లిపోయారు. కంబదూరులో జరిగిన వాలంటీర్ల సన్మాన సభలో ప్రొటోకాల్‌పై రచ్చ అయింది. ఈ అంశంలో రెండు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకునే పరిస్థితి ఉంది. మొత్తానికి మంత్రి అయ్యాక జిల్లాలో పార్టీ నేతలను.. ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడిన ఉషశ్రీచరణ్‌.. ఎంపీ రంగయ్య విషయంలో గ్యాప్‌ మెయింటైన్‌ చేయడానికే చూస్తున్నారట. ఎంపీ కూడా అదే వైఖరిలో ఉన్నట్టు సమాచారం. కలిసి సాగాలన్న అధిష్ఠానం హితోక్తులను మంత్రి, ఎంపీలు పెడ చెవిని పెట్టడం పార్టీలో చర్చగా మారింది.

Exit mobile version