Site icon NTV Telugu

తిరుపతిలో టీడీపీకి కొత్త తలనొప్పి!

అసలే అంతంత మాత్రంగా పనిచేస్తున్న వేళ.. పదవుల పంపకం కేడర్‌కు ఆగ్రహం తెప్పించిదట. పార్టీ జిల్లా పెద్దలు కూడా వారిని పట్టించుకోలేదని టాక్‌. ఎన్నికల్లో గెలిచిన ఆ ఒక్కరినీ పరిగణనలోకి తీసుకోలేదట. అదే చిత్తూరు జిల్లా టీడీపీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ గొడవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

టీడీపీ కమిటీల కూర్పుపై కేడర్‌ ఫైర్‌!

అనుబంధ సంఘాల పదవుల కేటాయింపు తిరుపతి టీడీపీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. పదవుల భర్తీలో సమతూకం పాటించలేదనే విమర్శలు గుప్పుమన్నాయి. పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు లభించలేదని బహిరంగ విమర్శలకు దిగారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా నాయకులకు భజన చేసే వారికే పదవులు కట్టబెట్టారని మండిపడుతున్నారు తమ్ముళ్లు. అధిష్ఠానంపై ఆరోపణలు చేయడం ఇష్టంలేని మరికొందరు స్తబ్దుగా ఉండిపోయారు. ప్రస్తుతం ప్రకటించిన కమిటీలను రద్దు చేయాలని తిరుపతిలో టీడీపీకి ఏకైక కార్పొరేటర్‌గా ఉన్న నాయకుడు కూడా డిమాండ్‌ చేయడం పార్టీలో చర్చగా మారింది.

రెండేళ్లుగా టీడీపీకి దూరంగా ఉన్నవారికి కమిటీలో చోటు?

చిత్తూరు, తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో తెలుగు యువత, తెలుగు విద్యార్థి, మండల కమిటీలను ప్రకటించారు. పార్టీ కార్యక్రమాల్లో ఏనాడూ కనిపించని ముఖాలకు కమిటీలలో చోటు కల్పించారట. 2019లో టీడీపీ ఓటమి తర్వాత చాలా నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్తబ్దుగా ఉండిపోయారు. రాజకీయ ఒత్తిళ్లతో యాక్టివిటీస్‌ తగ్గించారు మరికొందరు. టీడీపీలో ఉండాలా వద్దా అని ఇంకొందరు ఊగిసలాడుతున్నారట. పార్టీలో పనిచేసేందుకు కొందరు అయిష్టంగా ఉన్నట్టు టాక్‌. ఇలాంటి కేటగిరీల్లో ఉన్నవారందరికీ కమిటీలలో పదవులు ఇచ్చారని కేడర్‌ గుర్రుగా ఉందట.

వైసీపీపై పోరాటం చేస్తున్నవారిని గుర్తించలేదా?

రెండేళ్లుగా వైసీపీపై పోరాటం చేస్తున్నవారిని కమిటీలలోకి తీసుకోలేదట. సీనియర్లుగా చెలామణి అవుతున్న వారిని పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. ఈ ఎంపికలపైనే తమ్ముళ్లు పార్టీ నేతలపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారట. వీరికి తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఉన్న ఏకైక కార్పొరేటర్‌ మునికృష్ణ జత కలిశారట. కష్ట పడేవారికి టీడీపీలో గుర్తింపు లేదా అని ఆయన వేసిన ప్రశ్నలకు సమాధానం లేదట. టీడీపీలో ఉంటూ ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన వారికి పదవులు కట్టబెట్టడంపై నేరుగా చంద్రబాబుకే ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. మరి.. చంద్రబాబు దిద్దుబాటు చేపడతారో లేక కేడర్‌ వేదన ఆరణ్య రోదనగానే మిగిలిపోతుందో చూడాలి.

Exit mobile version