తొందరపడి ఓ కోయిల ముందే కూసిందా? అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటా? పీసీసీ సారథి నియామకం విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న చర్చ ఏంటి? పీసీసీ చీఫ్ ఎంపిక జాప్యానికి ఆ ఇద్దరు నాయకుల భేటీనే కారణమా? ఇంతకీ ఎవరా నాయకులు?
ఇద్దరు నాయకుల భేటీనే కొంప ముంచిందా?
తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ ఎంపిక రోజుకో మలుపు తిరుగుతోంది. ఇదిగో.. అదిగో అంటూ చెప్పుకోవడమే తప్ప.. అయ్యింది లేదు… పోయింది లేదు. ఇక నోట్ రెడీ అవ్వడమే తరువాయి అనుకుంటున్న సమయంలో మళ్లీ కదలికలు లేకుండా పోయాయి. ఇందుకు కారణం ఏంటని ఆరా తీసిన వారికి.. ఢిల్లీలో ఇద్దరు నాయకుల భేటీనే కొంప ముంచిందని తెలిసింది. అదే ఇప్పుడు ఓపెన్ టాక్‌గా మారింది.
లేఖలోని అంశాలను క్రాస్‌చెక్ చేసుకునే పనిలో హైకమాండ్
ఈ నెల 24 సమావేశం తర్వాత కొత్త పీసీసీపై ప్రకటన వచ్చేస్తుంది అనుకున్నారు. కానీ ప్రకటన ఆగిపోయింది. కారణం ఏంటనేది ఎవరికి అంతుచిక్క లేదు. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశం దీనికి కారణమట. ఆ భేటీలో జరిగిన చర్చలు.. బయటకు వచ్చినట్టు సమాచారం. ఆ విషయాలను ప్రస్తావిస్తూ పార్టీ సీనియర్ నాయకులు కొందరు అధిష్ఠానానికి ఐదు పేజీల లేఖ రాసినట్టు చెబుతున్నారు. ఆ లేఖను.. అందులోని అంశాలను చదివిన తర్వాత క్రాస్‌చెక్ చేసుకునే పనిలో పడిందట అధిష్ఠానం. ఇంతకీ ఆ మీటింగ్ ఏంటి? అందులో ప్రస్తావనకు వచ్చిన అంశాలేంటని ఆరా తీస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి.
read more : హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ వ్యూహం ఏంటి?
పీసీసీ చీఫ్ అయితే ఏం చేయాలో చర్చించారట!
తెలంగాణ పీసీసీ చీఫ్ కావాలని ట్రై చేస్తున్న ఇద్దరు నాయకులు.. ఢిల్లీలోనే మకాం వేశారు. మరికొందరు నేతలు కూడా అక్కడే తిష్ట వేశారు. పీసీసీ చీఫ్ పోస్ట్ ఆశిస్తున్న ఇద్దరు నాయకులు ఢిల్లీలో రహస్యంగా సమావేశం అయ్యారట. ఆ సమావేశంలో పీసీసీ చీఫ్ అయితే ఏం చేయాలో చర్చించారట. ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలి.. ఎవరికి ఇవ్వకూడదు? ఇప్పుడు ఉన్న సీనియర్ నాయకులను.. అసెంబ్లీకి కాకుండా.. పార్లమెంట్‌కి పంపించాలి అనే ప్రస్తావన ఆ చర్చలో వచ్చిందట. ఈ అంశాలపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై దాదాపు మూడు నాలుగు గంటలు వారు చర్చించినట్టు సమాచారం.
రేస్‌లో ఉన్న నేతను వ్యతిరేకిస్తున్న వారు అలర్ట్!
ఇలా ఆ ఇద్దరు నాయకులు మాట్లాడుకున్న అంశాలు.. ఆ సమావేశం నుంచే బయటకు లీకైనట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రేస్‌లో ఉన్న నేతను వ్యతిరేకించేవారి చెవిలో అవి పడ్డాయట. సమావేశంలో చర్చించిన అంశాలు అమలైతే అంతా ఇబ్బంది పడతామని భయపడి.. వెంటనే అలర్ట్ అయ్యారట. ఇదే మంచి తరుణం అనుకుని.. ఏకంగా ఐదు పేజీల లేఖను సిద్ధం చేసి.. ఆగమేఘాలపై కాంగ్రెస్ హైకమాండ్‌కు పంపించారట. ఆ లేఖ చూసిన అధిష్ఠానం కూడా.. నిజమో కాదో.. చెక్ చేయాలని అనుకోవడంతో.. కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ఆగినట్టు చెబుతున్నారు.
అనుబంధ సంఘాల ద్వారా లీకైందా?
అయితే ఇద్దరు నాయకుల మధ్య జరిగిన చర్చ బయటకు ఎలా పొక్కింది అన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారిందట. పార్టీ అనుబంధ సంఘాల నాయకుల ద్వారా విషయం పొక్కినట్టు భేటీలో ఉన్న ఒక నాయకుడు చిరునవ్వులు చిందించారట. అలాగే సమావేశంలో జరిగింది ఒకటి.. లేఖలో రాసింది మరొకటి అని అర్థమైందట.
ఖాళీ లెటర్ హెడ్‌లో అనుకూలంగా రాసుకున్న మరో నేత!
కాంగ్రెస్ అనుబంధ సంఘాల నేత ఒకరు.. పీసీసీ రేస్‌లో ఉన్న మరో నేతకు ఖాళీ లెటర్ హెడ్ పేపర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ కాగితంపై ఏదైనా రాసుకోవాలని చెప్పడంతో.. అక్కడే కథ నడిపించినట్టు సమాచారం. కాంగ్రెస్‌లో అనుబంధ సంఘాల మద్దతు కూడా తనకే ఉందని ఆ లేఖ తీసుకున్న వ్యక్తి రాసుకున్నారట. ఈ విషయం తెలిసి అంతా కంగుతిన్నారు. ఢిల్లీ రహస్య సమావేశంలో ఏం జరిగిందో కానీ.. వ్యవహారం మాత్రం చినికి చినికి గాలి వానలా తయారదైంది. ఈ ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్‌లో ఏ ఇద్దరు నాయకులు మాట్లాడుకోవాలన్నా భయపడిపోతున్నారట.
