ఏపీలో జిల్లాల పునర్విభజన తర్వాత నరసాపురం పార్లమెంట్ పరిధి పశ్చిమగోదావరి జిల్లాగా మారింది. కాకపోతే జిల్లా కేంద్రంగా నరసాపురానికి బదులు భీమవరాన్ని చేశారు. ఇదే నరసాపురం అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఆరని చిచ్చుగా మారింది. వివిధ పార్టీల నాయకులు.. ప్రజా సంఘాలు JACగా ఏర్పడి నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఉద్యమించాయి. అప్పట్లో ఈ సెగ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు గట్టిగానే తగిలింది. సొంత పార్టీకి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సైతం ఎమ్మెల్యే తీరును తప్పుపట్టారు. ప్రసాదరాజును ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేశానని చెబుతూ తనను తాను చెప్పుతో కొట్టుకున్నారు సుబ్బారాయుడు. ఈ అంశంపై అధిష్ఠానం కలుగ జేసుకోవడంతో సమస్యకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కానీ.. ఎమ్మెల్యే ప్రసాదరాజు తీరుపై మాత్రం సొంత పార్టీ నాయకులు ఏ మాత్రం మనసు మార్చుకోవడం లేదట. సొంత సామాజికవర్గానికి అనుకూలంగా ఉంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా సాధించలేకపోయారని.. ఎమ్మెల్యేపై ఆయన వ్యతిరేకవర్గం ప్రచారం చేస్తోంది. ప్రజల సెంటిమెంట్‌ను ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నట్టుంది. ఎమ్మెల్యేకి ప్రజాధరణ లేకుంటే సీట్ కొట్టేయవచ్చేనే ఆలోచన కూడా పార్టీలోని ఆయన ప్రత్యర్థివర్గం భావిస్తోందట. అందుకే జిల్లా విభజన జరిగి, జిల్లా కేంద్రంలో కార్యక్రమాలు ప్రారంభమైనా.. వైసీపీలోని ఎమ్మెల్యే వ్యతిరేకులు అదే అంశాన్ని ఇంకా ప్రస్తావిస్తూనే ఉన్నారట. అంతేకాదు.. అది ఎమ్మెల్యేకి.. పార్టీకి మైనస్ అవుతుందనే ప్రచారం చేస్తున్నారట.
నరసాపురంలో ఎప్పటినుంచో కలగా ఉన్న వశిష్ట వారధి, ఫిషింగ్ హార్బర్ నిర్మాణాల విషయంలో ఎమ్మెల్యే ప్రసాదరాజు వైఖరిని తప్పుపడుతోంది ఆయన వ్యతిరేకవర్గం. సొంత సామాజికవర్గానికి లబ్ధి చేకూరేలా నిర్మాణాల్లో మార్పులు చేర్పులు చేశారని ఆరోపిస్తున్నారు. పైగా రానున్న తొమ్మిది నెలలు ఎమ్మెల్యేలంతా జనాల్లోనే ఉండాలని సీఎం జగన్ ఆదేశించడంతో.. ఈ సమస్యలు ప్రసాదరాజుకు సవాల్‌గా నిలుస్తాయని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని గమనించారో ఏమో.. ప్రసాదరాజు సైతం.. ఈ ప్రతికూల పరిస్థితులను ఎలా అధిగమించాలా అని మల్లగుల్లాలు పడుతున్నారట. పార్టీ మాత్రం ప్రసాదరాజుకి చీఫ్‌విప్ పదవి ఇచ్చి పెద్దపీట వేసింది. కేబినెట్‌లో క్షత్రియులకు చోటు కల్పించలేకపోయిన సీఎం జగన్.. దాన్ని భర్తీ చేసేందుకు ప్రసాదరాజుకు చీఫ్‌విప్ పదవి ఇచ్చారు. స్థానికంగా ఎన్ని ప్రచారాలు జరిగినా అధిష్ఠానం మాత్రం తనవైపే ఉందన్న ధీమా ఎమ్మెల్యేలో ఉందట. అయితే మరో రాజు లేక ఆ పదవి వచ్చింది కానీ.. అందులో ప్రసాదరాజు గొప్పేం లేదని.. వచ్చే ఎన్నికల్లోపు నరసాపురంలో రాజకీయంగా మార్పులు ఉంటాయని స్థానికంగా చెవులు కొరుక్కుంటున్నారట.
