Narasaraopeta Telugu Desam Party :
పల్నాడు జిల్లాలో టిడిపి నేతలు సొంత ప్రాపకానికి ప్రాధాన్యం ఇస్తున్నారా? ప్రచార ఆర్భాటం పార్టీ పెద్దల పరువు పోగొట్టిందా? వాస్తవాలు తెలుసుకోకుండా దూకుడుగా వెళ్లి బొక్క బోర్లా పడ్డారా? తాజా ప్రయత్నం ఎందుకు బెడిసి కొట్టింది? పార్టీ పెద్దల రియాక్షన్ ఏంటి?
టీడీపీకి చెందిన మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం పల్నాడు రాజకీయాలను వేడెక్కించింది. అది అధికారపార్టీ నేతల పనే అని టీడీపీ ఆరోపించడంతో రెండు వర్గాలు మధ్య మాటలు.. ట్వీట్లు హోరెత్తాయి. ఈ విషయంలో నరసరావుపేట టీడీపీ నేతలు చేసిన పని రివర్స్ కొట్టడంతో అంతా కంగుతిన్నారట. బాలకోటిరెడ్డిపై దాడి చేసింది సొంత బంధువు కావడం.. అతను కూడా టీడీపీ కార్యకర్తే అవడంతో అందరికీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట. ఈ క్రమంలో జరిగిన పరిణామాలు.. అధినేతల జోక్యం టీడీపీ శిబిరంలోనూ పెద్ద చర్చకు దారితీసినట్టు చెబుతున్నారు.
దాడి గురించి తెలియగానే జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు హడావిడి చేయడంతో పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగింది. అధికారపార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ నాయకులు. కానీ.. అసలు విషయం తెలిసిన తర్వాత ఒకరి ముఖం ఒకరు చూసుకున్న పరిస్థితి. ఈ సమస్యపై టీడీపీలోనూ పోస్టుమార్టం జరుగుతోందట. ఇదంతా సొంత పార్టీలోని వ్యవహారమైతే.. తప్పుదోవ పట్టించింది ఎవరు? ఎందుకు ఇంత హంగామా చేశారు? గోటితో పోయేదాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఎందుకు? అని ఆరా తీస్తున్నారట.
టీడీపీ వ్యూహకర్తగా ఉన్న రాబిన్ సింగ్ సైతం ఫీల్డ్ ఎంట్రీ ఇచ్చినట్టు సమాచారం. ఎక్కడ తప్పు జరిగింది? దానికి కారకులు ఎవరు అనే దానిపై సమాచారం సేకరించి టీడీపీ పెద్దలకు ఆయన నివేదించారట. దెబ్బలు తగిలిన వ్యక్తి స్పృహలో ఉన్నప్పటికీ.. ఆయనతో పార్టీ నేతలు మాట్లాడలేదట. అప్పుడే దాడి చేసింది ఎవరో కోటిరెడ్డిని అడిగి ఉంటే ఇంత జరిగేది కాదని తేల్చారట. కానీ.. టీడీపీ సోషల్ మీడియాలోని కొందరు ప్రతినిధులు.. నరసరావుపేటకు చెందిన టీడీపీ నేతలు మరికొందరు అత్యుత్సాహం ప్రదర్శించారట. అంతా కలిసి జిల్లా నేతలను.. చంద్రబాబును, లోకేష్‌ను తప్పుదోవ పట్టించారని గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.
టీడీపీ అధిష్ఠానం చాలా సీరియస్‌గా ఉందని తెలుసుకున్న తెలుగు తమ్ముళ్లు.. అక్కడ నుంచి తీసుకునే చర్యలపై ఆందోళన చెందుతున్నారట. అందరి నుంచీ సమాచారం సేకరించి.. విషయాలను వడపోసిన తర్వాత బాధ్యులపై క్రమశిక్షణ తీసుకోవాలనే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నారట. ఈ అంశంలో ఫుల్ క్రెడిట్ కొట్టేద్దామని భావించిన పల్నాడు టీడీపీ నేతలు మాత్రం అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని ఆందోళన చెందుతున్నారట. మరి టీడీపీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.