Munugode TRS :
మునుగోడు బై ఎలక్షన్‌ను ప్రధాన రాజకీయ పార్టీలు ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్?అధికార టిఆర్ఎస్ సరికొత్త ప్రయోగానికి మునుగోడును వేదికగా చేసుకోబోతోందా?బీసీ అభ్యర్థిని బరిలోకి దింపితే గెలుపు ఖాయమని భావిస్తోందా?తెరపైకి ఎవరిని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయ్?అభ్యర్థి ఎంపికపై గులాబీ పార్టీ ఎలాంటి కసరత్తు చేస్తోంది?
తెలంగాణలో మునుగోడు పొలిటికల్ హీట్ మొదలైంది. త్వరలోనే ఉపఎన్నిక రాబోతోంది. రాజకీయ పార్టీలు ఇక్కడ తమ అదృష్టం పరీక్షించుకునే పనిలో పడ్డాయి. వచ్చే ఏడాది షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అధికార పార్టీ ఈ ఉప ఎన్నికపై ప్రత్యేక ఫోకస్ పెట్టిందట. 2014లో మునుగోడు ఎమ్మెల్యే స్థానం దక్కించుకుంది టిఆర్ఎస్. 2018 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలైంది. ఓటమికి కారణాలను విశ్లేషించుకున్న టిఆర్ఎస్…ఉపఎన్నికలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందట. మునుగోడును కైవసం చేసుకోవాలనే ప్లాన్‌తో అధికార టీఆర్ఎస్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ దిశగానే గులాబీ పార్టీ అడుగులు వేయడం మొదలెట్టిందని టాక్.
మునుగోడు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిందట టిఆర్ఎస్. ఇప్పుడు అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఫీల్డ్‌లో ఉన్న పరిస్థితులపై ఆరా తీసే పనిలో పడిందని టాక్. మునుగోడు ఉపఎన్నికలో బీసీ నేతను బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే కోణంలో గులాబీ పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ముగ్గురు పేర్లతో టీఆర్ఎస్ మునుగోడు ఓటర్ల అభిప్రాయ సేకరణ చేయిస్తోందని వినికిడి. మొత్తం ముగ్గురు పేర్లు ఉంటే అందులో ఇద్దరు బీసీ నేతలే ఉన్నారట. ఆసక్తికరంగా ఆ ముగ్గురిలోనూ మాజీ ఎంపీ బూరా నరసయ్య గౌడ్ పేరు ఉందని తెలుస్తోంది. గతంలో బూరా నరసయ్య గౌడ్ ఎంపీగా ఉన్న భువనగిరి లోకసభ నియోజకవర్గ పరిధిలోనే ఉంది మునుగోడు. దీంతో బూరా నరసయ్య గౌడ్ పేరును టిఆర్ఎస్ పరిశీలనలోకి తీసుకుందని సమాచారం. అధికార టిఆర్ఎస్….ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేందుకు బీసీ నేతను బరిలోకి దింపితే ఉప ఎన్నికలో ప్లస్ అయ్యే అవకాశాలపై లోతుగా విశ్లేషించే పనిలో పడిందట. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు వచ్చిన తర్వాత అభ్యర్థి ఎంపికపై టిఆర్ఎస్ నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
మునుగోడు అభ్యర్థి ఎంపిక విషయంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుంటోందట టిఆర్ఎస్. ఏ ఒక్క తప్పిదం చేయొద్దనే ఆలోచనతోనే ఉంది. అందులో భాగంగానే మునుగోడుపై అన్ని రకాలుగా సమాచారం తెప్పించుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాతే అభ్యర్థి విషయంలో ఓ నిర్ణయానికి రావాలని భావిస్తోందట టీఆర్ఎస్.