Site icon NTV Telugu

ములుగులో తెరాస నేతలు వర్సెస్ కలెక్టర్

Pechilu Pantalu

Pechilu Pantalu

ఈయన ములుగు జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య. ఈయనేమో అదే జిల్లా జడ్పీ ఛైర్మన్‌ కుసుమ జగదీష్‌. అధికార టీఆర్ఎస్‌ నాయకుడు. జిల్లా అభివృద్ధిలో కలిసి సాగాల్సిన ఈ ఇద్దరి మధ్య ఉప్పు నిప్పులా ఉంది పరిస్థితి. ముఖ్యంగా కలెక్టర్‌ తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్‌ నేతలు. ఈ క్రమంలో రెండు వర్గాల నుంచి పోటాపోటీగా లేఖలు బయటకు వచ్చి దుమారం రేపుతున్నాయి.

ఆ మధ్య జిల్లాలో ప్రతిపక్ష నేతలకు ఇచ్చిన విలువ అధికారపార్టీ నేతలమైన తమకు లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రహస్య సమావేశం నిర్వహించారు. ఆ అంశంపై చర్చ జరుగుతుండగానే.. కలెక్టర్‌పై జడ్పీ ఛైర్మన్‌ జగదీష్‌ ఆరోపణలు అందరిలోనూ అటెన్షన్‌ తీసుకొచ్చాయి. ములుగు ఇంఛార్జ్‌గానే కాకుండా.. జడ్పీ ఛైర్మన్‌గా ఉన్న తనను ఏ కార్యక్రమానికీ కలెక్టర్‌ పిలవడం లేదన్నది జగదీష్‌ ఆరోపణ. ఇటీవల దళితబంధుపై నిర్వహించిన సన్నాహక సమావేశానికి ములుగు, భద్రాచలం ఎమ్మెల్యేలను ఆహ్వానించి.. తనను విస్మరించారని చెబుతూ సీఎంకు ఫిర్యాదు చేశారు జడ్పీ ఛైర్మన్. సమావేశానికి వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీకి చెందినవాళ్లే. పైగా జడ్పీటీసీలు.. ఇతర ప్రజాప్రతినిధులకు కూడా మీటింగ్‌పై సమాచారం లేదన్నది ఆయన వాదన. ఈ అంశం రచ్చగా మారుతుండటంతో కలెక్టర్‌ కార్యాలయం స్పందించింది. ప్రజాప్రతినిధులు అంటే అత్యంత గౌరవం ఉందని.. వారిని కించపరిచే ఉద్దేశం లేదని ప్రకటన విడుదల చేశారు. మీటింగ్‌ సమాచారం ఇచ్చామని ఆ వివరణలో ఉంది.

కలెక్టరేట్‌ స్పందన చూశాక టీఆర్ఎస్‌ నేతలు మరో లేఖను రిలీజ్‌ చేశారు. తమకు ఎవరికీ ఆహ్వానాలు అందలేదని.. ప్రజల్ని తప్పుదోవ పట్టించుకున్నారని ఆరోపించారు. మేడారం జాతర సమయంలో దాదాపు 7 కోట్ల పనుల విషయంలోనూ కలెక్టర్‌పై పలు ఆరోపణలు చేశారు నేతలు. వాటిపై విచారణ చేయాలని కోరుతూ సీఎంకు లేఖ రాశారు. ఈ లేఖల యుద్ధం చూశాక.. కలెక్టర్‌కు.. టీఆర్ఎస్‌ ప్రజాప్రతినిధులకు ఎక్కడ గ్యాప్‌ వచ్చింది అని కొందరు ఆరా తీశారట. ఎప్పటి నుంచో జిల్లాలో తమకు ప్రొటోకాల్‌ పాటించడం లేదని జడ్పీ ఛైర్మన్‌తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే ఇప్పుడు శ్రుతిమించినట్టు సమాచారం. చినికి చినికి గాలి వానగా మారి సమస్య సీఎంవో వరకు చేరినట్టు స్థానికంగా జరుగుతున్న చర్చ. ఇదే సమయంలో ములుగు పరిణామాలపై నిఘా వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయట. మరి.. ఈ ఎపిసోడ్‌కు ఎండ్‌ కార్డు పడుతుందో లేదో చూడాలి.

Exit mobile version