NTV Telugu Site icon

ఆ ఎమ్మెల్సీ డిసైడ్ అయ్యింది ఏంటి..? అస్త్రంగా మార్చుకుందేంటి..? l

Trs Kavith

Trs Kavith

సూటిగా సుత్తి లేకుండా కామెంట్‌ చేసేశారు TRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మూడేళ్ల గ్యాప్‌ తర్వాత పదునైన విమర్శలతో నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై విరుచుకుపడ్డారు. ఇందూరులో పసుపు రాజకీయాన్ని వేడెక్కించడంతోపాటు.. వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు నిజామాబాద్‌లో పొలిటికల్‌ గేర్‌ మార్చినట్టు చెప్పకనే చెప్పేశారు కవిత. 2019 ఎన్నికల తర్వాత అనేక పర్యాయాలు కవిత నిజామాబాద్‌లో పర్యటించినా.. ఎంపీ అరవింద్‌పై ఈ స్థాయిలో విరుచుకుపడింది లేదు. ఈ మాటల తూటాలు చూశాక రాజకీయ వర్గాల్లో ఉన్న అనుమానం ఒక్కటే. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కవిత నిజామాబాద్‌ ఎంపీగా పోటీ చేయడానికి డిసైడ్‌ అయ్యారా? అందుకే పొలిటికల్‌ వాతావరణాన్ని గేరప్‌ చేస్తున్నారా? అనే చర్చ హీటెక్కుతోంది.

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అరవింద్‌.. తాను ఎంపీగా గెలిస్తే ఐదు రోజుల్లో నిజామాబాద్‌కు పసుపు బోర్డు తీసుకొస్తానని రైతులకు బాండ్‌ పేపరు రాసిచ్చారు. అరవింద్‌ ఎంపీగా గెలిచి మూడేళ్లు పూర్తయినా.. పసుపు బోర్డు ఊసే లేదు. పైగా పసుపు బోర్డుకు మించి అంటూ.. స్పైసెస్‌ బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అది స్థానిక రైతులకు కనెక్ట్‌ కాలేదు. తమకు పసుపు బోర్డు మినహా ప్రత్యామ్నాయం ఏదీ అక్కర్లేదని తెగేసి చెబుతున్నారు రైతులు. పోరాటం ఆపలేదు కూడా. నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో పర్యటనకు వచ్చే ఎంపీ అరవింద్‌ను రైతులు అడ్డుకుంటున్న ఉదంతాలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఇదే నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్‌లో 178 రైతులు పోటీ చేసి.. పసుపు బోర్డు డిమాండ్‌ సెగ ఢిల్లీకి తాకేలా చేశారు. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ డిమాండ్‌ ఎగిసిపడుతూనే ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎమ్మెల్సీ కవిత కామెంట్స్‌ చేయడం చర్చగా మారింది.

ఎంపీ అరవింద్‌పై అటాకింగ్‌ విషయంలో ఎమ్మెల్సీ కవిత పక్కా ప్లానింగ్‌తోనే అడుగులు వేసినట్టు కనిపిస్తోంది. సమాచార హక్కు చట్టం ప్రకారం వివరాలు సేకరించి మరీ చాకిరేవు పెట్టేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఏం చేసింది చెబుతూనే.. ఈ మూడేళ్లలో అరవింద్‌ సాధించింది ఇదీ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు కవిత. మీడియా ఎదుటే కాకుండా.. నిజామాబాద్‌లో పలు కార్యక్రమాల్లో చేసిన ప్రసంగాల్లోనూ బీజేపీ ఎంపీని విడిచి పెట్టలేదు. బాండ్‌ పేపరుపై హామీ ఇచ్చిన విధంగా పసుపు బోర్డు తీసుకురావాలని.. లేకపోతే ఎంపీని ప్రతి గ్రామంలోనూ నిలదీస్తామని హెచ్చరించారు కవిత.

బీజేపీ ఎంపీని ఎమ్మెల్సీ కవిత ఉన్నట్టుండి గట్టిగా టార్గెట్‌ చేయడానికి వెనక కారణాలను విశ్లేషించే పనిలో పడ్డాయి పార్టీలు. ఓడిన చోటే గెలవాలని డిసైడై.. పసుపుబోర్డు అంశాన్ని తెరపైకి తెచ్చారనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆమె మరోసారి ఎంపీగా బరిలో దిగుతారని.. గత ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారని చెవులు కొరుక్కుంటున్నాయి గులాబీ శ్రేణులు. వచ్చే రెండేళ్లూ ఇందూరులో పసుపు యుద్ధం తప్పదని లెక్కలేస్తున్నారట. అప్పుడు పసుపు ఓడిస్తే.. ఇప్పుడు అదే పసుపు గెలిపిస్తుందనే లెక్కల్లో ఉన్నారట. మరి.. పసుపు అస్త్రం వచ్చే ఎన్నికలను ఎలా మలుపు తిప్పుతుందో చూడాలి.