Site icon NTV Telugu

వారసుల కోసం జిల్లాలో తలపండిన నేతలు

Plan By

Plan By

వారసులను జనాల్లోకి వదిలేందుకు విజయనగరం జిల్లాలోని సీనియర్ పొలిటీషియన్స్‌ వేయని ఎత్తుగడ లేదు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఇలా పలువురు ప్రజాప్రతినిధులు.. తమ ఇంటి నుంచే భవిష్యత్‌లోనూ పొలిటికల్ యాక్టివిటీస్‌ కొనసాగాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో వారు చేపడుతున్న పనులు.. రచిస్తున్న వ్యూహాలు ఆసక్తిగా ఉంటున్నాయి.

మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్‌.. డాక్టర్‌. సందీప్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బొత్స పెద్ద స్కెచ్చే వేశారట. అయితే తండ్రి స్పీడ్‌ను తనయుడు అందుకోగలడా? బొత్సలా దూకుడుగా వెళ్లగలరా అన్నది తెలియాల్సి ఉంది. ఈ విషయంలో బొత్స వర్గం రకరకాలుగా చెవులు కొరుక్కుంటోందట. గతంలో బొత్స కుమారుడి గురించి జనాలకు పెద్దగా తెలియదు. కానీ.. ఇటీవల మంత్రిగా ఆయన చేపడుతున్న పనులు మాత్రం సందీప్‌ను పొలిటికల్‌ తెరపైకి తీసుకొచ్చేలా ఉన్నాయని టాక్‌. కుమారుడు రాష్ట్రంలో.. తాను కేంద్రంలో చక్రం తిప్పేలా ఒక ప్రణాళికను సిద్ధం చేశారట బొత్స. భవిష్యత్‌లో బొత్స రాజ్యసభకు వెళ్తే.. సందీప్‌ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అనుచరుల్లో చర్చ జరుగుతోందట.

మంత్రి పదవి ఆశించి భంగపడిన ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సైతం తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు నానా తంటాలు పడుతున్నారు. కుమార్తె శ్రావణిని వారసురాలిగా ఎంట్రీ ఇప్పించేశారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆమెను గెలిపించడమే కాకుండా.. డిప్యూటీ మేయర్‌ను చేశారు కోలగట్ల. ప్రస్తుతం విజయనగరంలో ఏ కార్యక్రమం జరిగినా అక్కడ శ్రావణి ఉండాల్సిందేనట. కార్పొరేషన్‌లో ఆమె చెప్పిందే శాసనమట. రేపటి రోజున ఇంకా పెద్ద పదవిలో కుమార్తెను కూర్చొబెట్టే వ్యూహాల్లో ఉన్నారట కోలగట్ల.

ఇదే విధంగా వైసీపీలో నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లు సైతం తమ వారసులను ప్రజలకు పరిచయం చేసే పనిలో బిజీగా ఉన్నారట. నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమం జరిగినా.. వారసులను వెంటబెట్టుకుని తీసుకెళ్తున్నారట. కనిపించిన వాళ్లకు వారిని పనిగట్టుకుని పరిచయం చేస్తున్నారట. భవిష్యత్‌లో మీ ఆశీస్సులు కావాలని ముందే మాట తీసుకుంటున్నట్టు టాక్‌.
ఇక టీడీపీ సీనియర్‌ నేత.. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ప్రస్తుతం అనేక కష్టాల్లో ఈదుతున్నారు. గత మూడేళ్లుగా పడిన చిక్కుముళ్లను విప్పుకోవడానికే ఆయనకు సమయం సరిపోతోంది. జిల్లాలో టీడీపీకి ఆయనే పెద్ద దిక్కు. అశోక్‌ గజపతి వేరే పనుల్లో బిజీ కావడంతో టీడీపీ కేడర్‌ను పట్టించుకునే వాళ్లు కరువయ్యారు. ఆయన వారసురాలిగా గత ఎన్నికల్లోనే ఎంట్రీ ఇచ్చిన అదితి గజపతిరాజు రానున్న రోజుల్లో ఏం చేస్తారన్నది పార్టీ వర్గాల్లోనే ఒక ప్రశ్న. 2019 ఎన్నికల్లో విజయనగరంలో ఓడిపోయారు అదితి. నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్నప్పటికీ.. ఇప్పటికీ తండ్రి చాటు బిడ్డగానే అదితిపై ముద్ర ఉంది. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం లేదని పార్టీలో వినిపిస్తున్న మాట. ట్రస్ట్‌ వ్యవహారాలు కొలిక్కి వస్తేకానీ.. కుమార్తె రాజకీయ భవిష్యత్‌ను రాజుగారు తీర్చిదిద్దుతారో లేదో తెలియదు. మొత్తానికి వారసుల కోసం విజయనగరం జిల్లాలో ఉద్దండులైన నాయకుల ప్రయత్నాలు ఆసక్తిగా మారాయి. ఈ విషయంలో ఎవరు సక్సెస్‌ అవుతారో.. ఎవరు వెనకపడతారో చూడాలి.

 

Exit mobile version