తెలంగాణలో మరింత విస్తరించాలని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ఢిల్లీ నాయకత్వం పదే పదే రాష్ట్ర నాయకులకు చెబుతూ వస్తోంది. ప్రజా సమస్యలు.. రాజకీయ అంశాలపై అటెన్షన్ తీసుకొస్తూనే.. క్షేత్రస్థాయిలో పార్టీ బలం పెరగడానికి వివిధ పార్టీల్లో శక్తికేంద్రాలుగా ఉన్న నాయకులకు కాషాయ కండువా కప్పాలని స్పష్టంగా సూచిస్తున్నారు. దాంతో బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. కానీ.. ఆ స్థాయిలో జాయినింగ్స్ లేవు. హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితం తర్వాత వలసలు భారీగా ఉంటాయని ఆశించారు నాయకులు. ఆ ఆశలు అడియాశలే అయ్యాయి.
హుజురాబాద్ ఎపిసోడ్ కిక్కు ఇవ్వకపోయినా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలంగాణలో బీజేపీకి మరింత ఊపు నిస్తాయని కమలనాథులు అంచనా వేశారు. ఇందుకోసమే బీజేపీలో ప్రత్యేకంగా చేరికల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ చేరికల కమిటీకి ఇంద్రసేనారెడ్డి ఛైర్మన్. వివిధ పార్టీల నుంచి చేరే నాయకుల వివరాలతో జాబితా సిద్ధం చేశారని ప్రచారం జరిగింది. అయితే ఇతర పార్టీల నుంచి ఒక్క పెద్ద తలకాయ కూడా కాషాయ కండువా కప్పుకోలేదు.
తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉన్నా.. ఇతర పార్టీల నాయకులు ఎందుకు చేరడం లేదు? బీజేపీపై ఎందుకు భరోసా కల్పించలేకపోతున్నాం? ఆసక్తితో ఉన్న నాయకుల అనుమానాలేంటి? ఇలా వివిధ అంశాలపై ప్రస్తుతం కాషాయ శిబిరంలో చర్చ జరుగుతోంది. అయితే లోపం పార్టీలోనే ఉందని బీజేపీలో గట్టిగా చెవులు కొరుక్కుంటున్నారట. బీజేపీలో చేరికలు లేకపోవడానికి కొందరు పార్టీ నేతల తీరే కారణమని విశ్లేషిస్తున్నారట. దానికితోడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ చేసిన కామెంట్స్‌ను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
బీజేపీలో తాము నలుగురుమే ఉంటామంటే కుదరబోదని.. ఆయా సందర్భాలలో జేపీ నడ్డా.. బీఎల్ సంతోష్‌లు తెలంగాణ కమలనాథులకు స్పష్టం చేశారు. కొత్తవారిని ఆహ్వానించాలని ఆదేశించారు. బీజేపీలోకి వచ్చే వాళ్లకు డోర్లు తెరిచే ఉంచాలని.. మీకంటే బలమైన నాయకులను బీజేపీలోకి ఆహ్వానించాలని హితవు పలికారు. అయితే కొత్తవారు కాషాయ కండువా కప్పుకోవడానికి సుముఖంగా ఉన్నా.. రాష్ట్ర బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని స్పష్టమైన రిపోర్ట్ వాళ్ల దగ్గర ఉందట. అందుకే అలాంటి వ్యాఖ్యలు చేశారని చర్చ సాగింది.
చేరికలను అడ్డుకుంటున్న వారిపై ప్రస్తుతం బీజేపీలోనూ గట్టిగా చర్చ జరుగుతోందట. జేపీ నడ్డా, బీఎల్ సంతోష్‌లు కరెక్ట్‌గానే చెప్పారని.. కొందరు కాషాయ కండువా కప్పుకొంటే.. తమ సీటుకు ఎసరొస్తుందనే భయంతో చేరికలను అడ్డుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారట. పైగా ఎవరైనా పార్టీలో చేరితే ఆ క్రెడిట్ తమకు కాకుండా వేరొకరి దక్కుతుందని ఆందోళన చెందుతున్నారట. అందుకే ఎవరైనా నాయకుడు బీజేపీలో చేరుతున్నారని చెబితే.. వెంటనే ఇంకొకరు వద్దని ఆపేస్తున్నారట. మొత్తానికి భయాలు.. ఇగోలు.. బీజేపీలో చేరికలను ఆపేస్తున్నాయని.. ఇదే వైఖరి కొనసాగితే పార్టీలో మళ్లీ ఆ నలుగురే మిగులుతారని చెవులు కొరుక్కుంటున్నాయట కాషాయ వర్గాలు.