Site icon NTV Telugu

Annavaram : దేవుడికి శఠగోపం పెడుతున్న వారిని కదిలించడం కష్టమేనా.?

Annavaram employees transfers

Annavaram employees transfers

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం సత్యదేవుని ఆలయంలో ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఏటా 120 కోట్ల ఆదాయం వచ్చే ఈ పుణ్య క్షేత్రంలో 238 మంది పని చేస్తున్నారు. ఆలయంలో ఐదేళ్లు పైబడి ఒకేచోట తిష్ఠవేసిన ఉద్యోగులను బదిలీ చేయాలని అనుకుంటున్నారు. ఆ జాబితాలో 80 మందిని గుర్తించారట. నెలాఖరులోగా ఆ ప్రక్రియ కొలిక్కి వస్తుందని అనుకుంటున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచీ ఏళ్ల తరబడి అన్నవరం ఆలయంలోనే పాతుకుపోయిన వారిలో గుబులు రేగుతోందట.

బదిలీ అయినా ఆరు నెలల్లో తిరిగి అన్నవరం ఆలయానికి వచ్చేసేలా పరస్పర ఒప్పందాలు చేసుకోవడానికి రాజకీయ పైరవీలు మొదలుపెట్టేశారట ఇక్కడి ఉద్యోగులు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల లేఖలతో దేవాదాయశాఖ ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు పెంచేశారట. అన్నవరం నుంచి వెళ్లిపోతే అక్రమార్జనకు గండి పడుతుందనే ఆందోళనతో నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారట. వాస్తవానికి అన్నవరం ఆలయంలో పనిచేసే కొందరు ఉద్యోగులపై ఎప్పటి నుంచో తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. వారికి చెక్‌ పెట్టాలని ఎప్పటికప్పుడు అనుకుంటున్నా కాగితం ముందుకు కదలడం లేదు. ఈ దఫా మాత్రం 80 మంది కదులుతారని చెప్పడంతో పెద్ద చర్చే జరుగుతోంది.

రాష్ట్రంలోని ప్రధాన దేవస్థానాలకు చెందిన సిబ్బంది నివేదికను వెంటనే ఇవ్వాలని సంబంధిత ఆలయాల ఈవోలకు కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బదిలీ చేయడానికే ఆ ఆదేశాలు ఇచ్చినట్టు ఉద్యోగులు భావిస్తున్నారట. 2016 నుంచి అన్నవరం ఆలయంలో బదిలీలు లేవు. ఆ ఏడాది 24 మందిని ట్రాన్స్‌ఫర్‌ చేశారు. వారిలో ఒకరిద్దరు మినహా మిగతావారంతా ఏడాది లోపే తిరిగి అన్నవరం ఆలయానికి వచ్చేశారు. 2021లోనూ బదిలీలకు కసరత్తు చేసినా.. కోవిడ్‌ వల్ల ఆ ప్రయత్నాలు విరమించారు. అన్నవరం గుడిలోని ఇంజనీరింగ్‌.. ఎలక్ట్రికల్‌ విభాగాల్లో పనిచేసే కొందరు ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా బదిలీ కాలేదని చెబుతారు.

ఇప్పుడు జాబితాలో ఉన్నారని చెబుతున్న 80 మంది కూడా.. తాము బదిలీ అయినా పెద్దగా ఇబ్బంది లేదని.. రాజకీయ సిఫారసులతో ఆరు నెలల్లో వచ్చేస్తామని సహచరుల దగ్గర చెబుతున్నారట. అయితే అవినీతి ఆరోపణలు ఉన్నవారి చిట్టా ఏసీబీకి కూడా చేరినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే బదిలీ చేసినా కామ్‌గా వెళ్లి.. కొత్తచోట కొన్నాళ్లు పనిచేసుకుందామని అనుకుంటున్నారట. ఆ మధ్య సీఎం జగన్‌ ఆదేశాలతో అన్నవరం కొండపై రెండు దఫాలుగా విజిలెన్స్‌ అధికారులూ తనిఖీలు చేపట్టారు. ఈ తరుణంలో అన్నవరం ఆలయంలో బదిలీలపై దేవాదాయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. మరి.. కొండపై తిట్టవేసిన కట్టలపాములను సాగనంపుతారో.. లేక ఎప్పటిలా 6 నెలల్లో తిరిగి పుట్టల్లోకి అవినీతిపరులు చేరుకుంటారో చూడాలి.

 

Exit mobile version