ఆ ఇద్దరూ గతంలో ఒకరిపై ఒకరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ సమయంలో రాజకీయం ఓ రేంజ్‌లో సాగేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ యుద్ధానికి కొంత విరామం వచ్చింది. ఇప్పుడు ఇద్దరూ ఒకే సభలో సభ్యులు. వారి మధ్య పాత పొలిటికల్ వార్ మళ్లీ మొదలవుతుందా?
ఇద్దరి మధ్య పాత పొలిటికల్ వార్ కొత్తగా మొదలవుతుందా?
ఎల్. రమణ. మొన్నటి వరకు టీడీపీ తెలంగాణ చీఫ్. హుజురాబాద్ ఉపఎన్నిక ముందు సైకిల్ దిగి.. టీఆర్‌ఎస్ కండువా కప్పుకొన్న రమణ.. ఇప్పుడు అధికారపార్టీలో ఎమ్మెల్సీ. మరోనేత జీవన్‌రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ. ఇద్దరూ మాజీ మంత్రులే. జగిత్యాలలో సీనియర్ నాయకులు. గతంలో అసెంబ్లీ పోరులో ఒకరిపై ఒకరు పోటీపడ్డవారే. గెలుపోటములు ఎలా ఉన్నా.. రాజకీయంగా ఒకరిపైఒకరు పైచెయ్యి సాధించినవాళ్లే. ఇప్పుడు ఇద్దరూ తెలంగాణ శాసనమండలిలో సభ్యులు. దీంతో రమణ, జీవన్‌రెడ్డి మధ్య పాత పొలిటికల్ వార్ కొత్తగా మొదలవుతుందనే చర్చ నడుస్తోంది.
ఎమ్మెల్సీలుగా ఉన్న వీళ్ల మధ్య పాత జ్ఞాపకాలు సెగలు రాజేస్తాయా?
ఎన్నికల ప్రచారంలో ఓ రేంజ్‌లో కత్తులు దూసుకునే జీవన్‌రెడ్డి, రమణ ఎదురుపడితే అందరి దృష్టీ వీళ్ల మాటలపైనే ఉంటుంది. ఇప్పుడు శాసనమండలిలో ఏం చేస్తారు? సీనియర్ నాయకుల మధ్య పాత జ్ఞాపకాలు సెగలు రాజేస్తాయా? ఒకరినొకరు విమర్శలు చేసుకుంటారా? జగిత్యాల సమరం శాసనమండలిలో రిపీట్ అవుతుందా? రాజకీయ వర్గాల్లో ఈ ప్రశ్నలపైనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. జీవన్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు సవాల్ ఎదురైంది టీడీపీ అభ్యర్థి ఎల్ రమణ నుంచే. దాదాపు రెండు దశాబ్దాలపాటు వీరి రాజకీయ వైరం కొనసాగింది. రమణపై జీవన్‌రెడ్డి రెండుసార్లు గెలిస్తే.. జీవన్‌రెడ్డిపై రమణ కూడా రెండుసార్లు పైచెయ్యి సాధించారు. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు వీరిద్దరి మధ్య ఇదే రాజకీయ యుద్ధం కొనసాగింది.
రాజకీయ వైరానికి ముగింపు పడిందని అనుకుంటున్న సమయంలో ట్విస్ట్..!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీలోనే కొనసాగిన ఎల్ రమణ రాజకీయంగా కొంత వెనకపడ్డారు. 2014, 2018 ఎన్నికల్లో టీడీపీ కొన్ని సీట్లు గెలిచినా.. రమణకు ఓటమే ఎదురైంది. మూడోస్థానానికి పడిపోయారు. ఆ రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చింది కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డే. ఆ ఎన్నికల తర్వాత వీళ్ల మధ్య రాజకీయ వైరానికి ముగింపు పడిందని అనుకున్నారు. కానీ.. ఇద్దరూ ఎమ్మెల్సీలుగా ఎన్నికై ఒకే చట్ట సభలో ఉన్నారు. పార్టీలు కూడా వేర్వేరు. రమణ అధికారపార్టీ అయితే.. జీవన్‌రెడ్డి కాంగ్రెస్. రెండు పార్టీల మధ్య గట్టి సెగే ఉంది. ఆ సెగ జగిత్యాలకు చెందిన మాజీ మంత్రులకు కూడా తాకుతుందా? లేక.. పదవికి తగ్గట్టుగా పెద్ద మనుషులుగానే ఉండిపోతారో చూడాలి.
