Site icon NTV Telugu

కుప్పంలో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ రచ్చ..!

కుప్పంలో ప్రస్తుతం ఎన్నికలు లేవు. రాజకీయ సభలు.. సమావేశాలు లేవు. కానీ.. జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానుల తీరు మరోసారి అక్కడ చర్చగా మారింది. నేరుగా టీడీపీ నేతలకే వార్నింగ్‌ ఇవ్వడంతో కలకలం రేగుతోంది. ఇంతకీ కుప్పంలో ఏం జరుగుతోంది?

కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ వార్నింగ్స్‌..!

కుప్పం మరోసారి పొలిటికల్‌ సర్కిళ్లలో హాట్‌ టాపిక్‌. టీడీపీ- జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య గ్యాప్‌ పెరుగుతుందా అనేట్టుగా అక్కడ పరిణామాలు చర్చకు దారితీస్తున్నాయి. తమ హీరోతో టీడీపీ నేతల వ్యవహారం అభిమానులకు నచ్చడం లేదట. దీంతో కుప్పం వేదికగా మీటింగ్‌లు.. వార్నింగ్‌లు తాజా ఎపిసోడ్‌లో బయటకొచ్చాయి.

టీడీపీ శ్రేణులు సోషల్‌ మీడియా వేదిక విమర్శలు..!

2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి.. తర్వాత పార్టీ కార్యక్రమాలలో కనిపించారు జూనియర్‌ ఎన్టీఆర్‌. తర్వాత సినిమాలపైనే పూర్తస్థాయిలో ఫోకస్‌ పెట్టారు. ఇటీవల చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు దుమారం రేపాయి. మీడియా సమావేశంలో చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. నందమూరి కుటుంబం సీరియస్‌గా స్పందించింది. జూనియర్‌ ఎన్టీఆర్ ఆలస్యంగా స్పందించడతో టీడీపీ శ్రేణులు సోషల్‌ మీడియా వేదికగా తారక్‌ను తప్పుపట్టాయి.

సింహాద్రి.. ఆదిలా స్పందించలేదని టీడీపీ నేతల కామెంట్స్‌..!

ఆ వివాదంపై ఒక వీడియో సందేశం ద్వారా తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు జూనియర్ ఎన్టీఆర్‌. ఆ స్టేట్‌మెంట్‌లో చంద్రబాబు దంపతుల పేర్లను ప్రస్తావించలేదు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్లను ఉటంకించలేదు. జూనియర్‌ ఎన్టీఆర్ చేసిన ఈ ప్రకటనపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. పార్టీ నాయకులు వర్ల రామయ్య, బుద్దా వెంకన్న లాంటివాళ్లు నేరుగా జూనియర్‌ ఎన్టీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ కొన్ని కామెంట్స్‌ పాస్‌ చేశారు. సింహాద్రి, ఆదిలా వస్తారనుకుంటే.. ప్రవచనాలు చెప్పారని మండిపడ్డారు వర్ల అండ్‌ బ్యాచ్‌. ఇదే టైమ్‌లో మంత్రి కొడాలి నాని సైతం.. తాము గతంలో జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి ఉన్నా.. ఆయన తమను కంట్రోల్‌ చేయడం ఏంటని ప్రశ్నలు సంధించారు. దీంతో టీడీపీ నేతలకు జూనియర్ ఎన్టీఆర్‌ మరింత టార్గెట్‌ అయ్యారు.

కుప్పంలో ప్రత్యేకంగా జూనియర్‌ ఎన్టీఆర్ అభిమానులు భేటీ..!

ఈ పరిణామాలు రుచించని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కుప్పంలో ప్రత్యేకంగా భేటీ అయ్యి చర్చించారట. వందల మంది అభిమానులు కుప్పంలో ఒకచోట మీటింగ్‌ పెట్టుకున్నారు. ఆ తర్వాత జై లవకుశ సినిమా స్పెషల్‌ షో వేయించుకున్నారట. టీడీపీ నేతలు తమ అభిమాన హీరోపై విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫాన్స్‌. తమ హీరోనే కాబోయే ముఖ్యమంత్రిగా చెప్పిన అభిమానులు.. ఆయన్ని ఎలా టార్గెట్‌ చేస్తారని టీడీపీ నేతలను ప్రశ్నించారు. ఇలాంటి వైఖరి కారణంగానే గత ఎన్నికల్లో టీడీపీకి సరిగా పనిచేయలేదని.. ఇదే వైఖరి కొనసాగిస్తే భవిష్యత్‌లో ప్రచారానికి దూరంగా ఉంటామని హెచ్చరించారు.

గతంలో బాబు ఎదుటే జూనియర్‌ అభిమానులు నినాదాలు..!

జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు రాష్ట్రంలో ఇంకెక్కడైనా మీటింగ్‌ పెట్టుకుంటే ఇంత ప్రచారం వచ్చేదో లేదోకానీ.. కుప్పంను వేదికగా చేసుకుని వార్నింగ్‌లు ఇవ్వడమే ఉత్కంఠగా మారింది. గతంలో కూడా చంద్రబాబు కుప్పం వస్తే… జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమనులు ఫ్లెక్సీలు.. బ్యానర్లు ప్రదర్శించారు. బాబు ఎదుటే నినాదాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అసలు కుప్పంలోనే ఈ స్థాయిలో జూనియర్‌ ఎన్టీఆర్ అభిమానులు జెండాలను, ఫ్లెక్సీలను పెట్టి హంగామా చేయడం వెనక ఎవరు ఉన్నారు? ఇది కేవలం అభిమానంతో చేస్తున్నారా లేక కుప్పంలో ఒక వర్గం ఆడుతున్న గేమా అన్నది టీడీపీ వర్గాలకు అంతుచిక్కడం లేదట. ఇదంతా లోకల్‌ వైసీపీ ఆడుతున్న ఆటగా కొట్టిపారేసినా.. ప్రతీసారీ వాళ్లెందుకు ఇలా చేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి.. చెవిలో జోరీగలా మారిన ఈ అంశానికి కుప్పంలో టీడీపీ వర్గాలు ఎలా చెక్‌ పెడతాయో చూడాలి.

Exit mobile version