Site icon NTV Telugu

ప్రసాదరావు అభినందన సభకు రాని కృష్ణదాస్, తమ్మినేని..!

Kandaradu Ante

Kandaradu Ante

ప్రసాదరావు అభినందన సభకు రాని కృష్ణదాస్‌, తమ్మినేని..!

శ్రీకాకుళం జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు మొదటి నుంచీ ఉన్నాయ్‌. ధర్మాన‌ సోదరుల మధ్యే సఖ్యత లేదు. తాజా మంత్రివర్గ విస్తరణతో నేతల మధ్య ఆ అంతరం ఇంకా పెరిగిందట. మంత్రిగా ప్రమాణం చేసి జిల్లాకు వచ్చిన ధర్మాన ప్రసాదరావు అభినందన‌ సభకు అందరినీ రావాలని ఆహ్వానించారు. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల నేతలకు ధర్మాన కీలక‌ అనుచరులు ఫోన్లు చేశారు. అయితే ఆ సమావేశానికి నరసన్నపేట.. ఆమదాలవలస నియోజకవర్గాల నాయకులు హాజరుకాలేదు. గత మూడేళ్లుగా పార్టీ.. ప్రభుత్వ పరంగా నిర్వహించిన ప్రతి చిన్న కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌.. స్పీకర్ తమ్మినేని సీతారామ్‌లు ప్రసాదరావు అభినందన సభకు రాలేదు. ఈ నాయకులు ఏవో కారణాలతో రాలేకపోయినా.. కనీసం వాళ్ల ‌కుటుంబసభ్యులు.. అనుచరులను ఎందుకు పంపించలేదనేది ప్రశ్న.

సీఎం జగన్‌ను.. మంత్రి ప్రసాదరావును కొందరు నాయకులు అభినందన సభలో ఆకాశానికి ఎత్తేశారు. తాజా మాజీ అయిన ధర్మాన కృష్ణదాస్‌ ఊసు సభలో ఎక్కడా.. ఎవరి మాటల్లోనూ లేదు. అంతేకాదు.. అన్న నిర్వహించిన రెవెన్యూ శాఖలో అవినీతి ఉందని ప్రసాదరావు మాట్లాడటంతో నరసన్నపేట నేతలు నొచ్చుకున్నారట. ఈ సభకు ధర్మాన కృష్ణదాస్‌ అనుచరుడిగా ముద్రపడ్డ DCCB అధ్యక్షుడు కరిమి రాజేశ్వరరావు వచ్చారు. వేదికపైకి పిలుస్తారేమోనని చాలాసేపు ఆయన కింద వెయిట్‌ చేశారు. కానీ.. ఎంతకూ పైకి పిలవకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు కరిమి. ఇక ఆమదాలవలసలో తమ్మినేని వ్యతిరేకవర్గం యాక్టివ్‌ అయ్యింది. సోషల్ మీడియాలో పోస్టింగ్‌లతో ఊదరగొడుతోంది. జిల్లాకు దశ దిశ లేని నాయకత్వం కాదు.. సత్తా కలిగిన నేత వచ్చారంటూ పోస్టింగ్‌లు పెడుతున్నారు. వీటిని చూసిన పార్టీ కేడర్‌లో మరో చర్చ జరుగుతోంది. రాజుగారి రెండో భార్య మంచిదన్న సామెతను గుర్తు చేసుకుంటున్నారట.

ఈ పరిణామాలను చూసిన పార్టీ వర్గాలు మాత్రం.. మంత్రివర్గంలో మార్పులు కొత్త సమస్యను తీసుకొచ్చాయని చెవులు కొరుక్కుంటున్నారు. వైసీపీ అధిష్ఠానం చెప్పినదానికి భిన్నంగా వెళ్తుండటం పార్టీ శ్రేణులకు అర్థం కావడం లేదట. దాంతో మా నాయకుల తీరు మారబోదని కామెంట్స్‌ చేస్తున్నారు. అంతర్గత విభేదాలు ఎప్పుడు సమసిపోతాయో వేచి చూడటంలోనే మూడేళ్లు గడిచిపోయింది. అలాగే వచ్చే రెండేళ్లు సాగిపోతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. అధినేత జగన్‌ అంటే అభిమానం.. ప్రేమ చూపించే నేతలు.. అదే అధినేత ఎంపిక చేసుకున్న మంత్రి ధర్మాన ప్రసాదరావును లైట్‌ తీసుకుంటున్నారు. ఈ విభేదాలు రానున్న రోజుల్లో ఎలాంటి సిత్రాలకు వేదిక అవుతాయో చూడాలి.

 

Exit mobile version