Site icon NTV Telugu

Konda and Pilot Rohit Reddy.. Off The Record: కొండా, పైలట్.. గురుశిష్యుల మధ్య వైరం?

konda vs pilot

Maxresdefault (2)

వారిద్దరిదీ ఒకప్పుడు ఒకే పార్టీ. ఆ తర్వాత ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు. పైగా గురుశిష్యులు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండబోరన్న నానుడి వారి విషయంలోనూ రుజువు కాబోతుందా? ప్రత్యర్థులుగా మారబోతున్నారా? ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా కథా?

తాండూరు అసెంబ్లీకి కొండా పోటీ చేస్తారా?
వికారాబాద్ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒక పార్టీలో ఉన్న నేతలు సంవత్సరం తిరగక ముందే మరో కండువాతో కనిపిస్తున్నారు. ఒకప్పుడు టీఆర్ఎస్‌లో ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వరరెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. బీజేపీలో చేరినప్పటి నుంచీ జాతీయ రాజకీయాల్లో చురుగ్గా ఉండటంతోపాటు తాండూరు నియోజకవర్గంలోనూ చురుకుగా కదులుతున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో ఆయన తాండూరు అసెంబ్లీకి పోటీ చేస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయట. దీనికితోడు బీజేపీ కార్యక్రమాలు, సమావేశాలు తాండూరులో నిర్వహిస్తూ పొలిటికల్‌ హీట్‌ రాజేస్తున్నారు కొండా.

 

‘పల్లెపల్లెకు పైలెట్‌’ పేరుతో జనాల్లోకి రోహిత్‌రెడ్డి
ఇదే సమయంలో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి తాండూరులో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పల్లెపల్లెకు పైలెట్ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెరమీదకు వచ్చిన తర్వాత సుమారు నెల రోజులు పైలెట్‌ నియోజకవర్గానికి రాలేదు. ఆ తర్వాత వంద కోట్లపైగా అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్‌తో మంజూరు చేయించుకుని సొంతగడ్డపై అడుగు పెట్టారు. గతంలో వార్డు వార్డుకు పైలెట్ పేరుతో చేపట్టిన కార్యక్రమానికి ఆశించినస్థాయిలో స్పందన రాకపోవడంతో మమ అనిపించారు. ఆ తర్వాత అనేక మలుపులు తిరిగిన జిల్లా రాజకీయాలు ప్రస్తుతం ఓ కొలిక్కి వచ్చాయి. తాండూరులో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పైలెటే పోటీలో ఉంటారనే టాక్‌ నడుస్తోంది. దీంతో ఇతర నేతలు రేసు నుంచి పక్కకు జరిగినట్టే అనే చర్చ సాగుతోంది.

గురువు దూకుడుగా వెళ్తుండటంతో శిష్యుడు అలెర్ట్‌
కొండా.. పైలెట్‌ కదలికలు చూశాక.. తాండూరులో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ నెలకొంది. గతంలో ఇద్దరూ గురుశిష్యులు. గురువు కొండా విశ్వేశ్వరరెడ్డి తాండూరు బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహారిస్తుండటంతో ముందస్తుగానే పైలెట్ అలెర్ట్ అయ్యారట. కొండా ఊరూరు తిరిగి ప్రచారం చేస్తే.. రాజకీయంగా తనకు ప్రతికూలంగా మారుతుందని సందేహించారో ఏమో.. పైలెట్‌ సైతం క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సిద్ధ పడ్డారు. అంతేకాదు.. తాండూరుకు కోట్ల రూపాయల నిధులు తెప్పించి హడావుడిగా పనులు మొదలు పెట్టేస్తున్నారు. గ్రౌండ్‌ లెవల్లో ఈ పోటీ చూశాక.. ఇప్పటి వరకు గురుశిష్యుల మధ్య ఆరోగ్యకరమైన రాజకీయ పోటీ నెలకొందని.. రాబోయే రోజుల్లో ఆ వాతావరణం ఎలా ఉంటుందో అని చర్చ జరుగుతోంది. మరి.. తాండూరులో గురుశిష్యుల ఆరాటం.. పోరాటంగా మారుతుందో లేదో చూడాలి.

Exit mobile version