NTV Telugu Site icon

Off The Record: తణుకులో కాపు కాసేది ఎవరికి?

Kapu1

Kapu1

గత ఎన్నికల్లో ట్రయాంగిల్‌ ఫైట్‌.. ఆ నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. కాపు ఫ్యాక్టర్‌తో గెలుపోటములు కీలకంగా మారాయి. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈసారి ఏం జరుగుతుంది? కాపు కాసేది ఎవరికి?

వచ్చే ఎన్నికల్లో తణుకులో జనసేన ఏం చేస్తుంది?
పశ్చిమగోదావరి జిల్లా తణుకు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి కారుమూరి నాగేశ్వరరావు గెలిచి.. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఇదే నియోజకవర్గంలో 2009లో ఆయన కాంగ్రెస్‌ నుంచి కూడా గెలిచారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తన సీటును పదిలం చేసుకోవడానికి నిమగ్నం అయ్యారు కారుమూరి. తణుకులో 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. అప్పట్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి బరిలో దిగాయి. 2019లో ఈ మూడు పార్టీలు చేరో దారిని ఎంచుకోవడంతో ఓట్లలో చీలిక వచ్చింది. జనసేనకు పడిన ఓట్ల వల్ల టీడీపీ ఓడిపోయిందని అనుకున్నారు. ముచ్చటగా మూడోసారి బరిలో దిగేందుకు కారుమూరి.. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చూస్తున్న తరుణంలో జనసేన ఏం చేస్తుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.

2,195 ఓట్ల మెజారిటీతో గెలిచిన కారుమూరి
2019 ఎన్నికల్లో తణుకు నుంచి జనసేన అభ్యర్ధిగా పోటిచేసిన పసుపులేటి రామారావు దాదాపు 32వేల ఓట్లు సాధించారు. జనసేన కారణంగా టిడిపి స్పల్ప తేడాతో ఓడిపోయింది. వైసీపీ అభ్యర్థి కారుమూరి 2,195 ఓట్లతో గెలిచి బయటపడ్డారు. పసుపులేటి రామారావు ఎన్నికల తర్వాత బిజేపిలో చేరిపోవడంతో రామచంద్రరావు నియోజకవర్గ JSP ఇంఛార్జీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కమ్మసామాజిక వర్గానికి చెందిన రామచంద్రరావు జనసేన తరపున బరిలో ఉంటే అటు తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనసేన తణుకులో మరింత పుంజుకోవడంతో అక్కడ జనసేన ఓటింగ్ శాతం మెరుగైందట. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన విడిగా పోటిచేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడం, ఆప్రభావం తమపై పడి 2019 పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని టిడిపి శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి.

కాపులను ప్రసన్నం చేసుకునే పనిలో మంత్రి కారుమూరి
గత ఎన్నికల్లో తనను ఓటమి అంచుల వరకు తీసుకు వెళ్లిన కాపు ఓటర్లను, కాపు నాయకులకు దగ్గరగా ఉంటూ వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు మంత్రి కారుమూరి. ఒకవేళ జనసేన విడిగా పోటీ చేసినా ఆ ప్రభావం తనపై పడకుండా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారట. ఇక ఎటొచ్చీ నియోజకవర్గంలో కాపు ఓటర్లు టీడీపీకి ఎంత వరకు మద్దతు పలుకుతారనేది ప్రశ్న. తణుకులో కాపు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రెండు పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఎలా ఉన్నాయో ఇటీవల రంగా విగ్రహావిష్కరణ చేసిన సమయంలో బయట పడింది. మంత్రి కారుమూరి, మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి మధ్య బహిరంగంగానే మాటల యుద్ధం నడిచింది. ఒకే వేదికపై ఇద్దరూ సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకున్నారు. టిడిపి హయాంలో వంగవీటి రంగా విగ్రహన్ని తొలగించారని, వైసిపి హయాంలో రంగా విగ్రహ ఏర్పాటు జరిగిందని మంత్రి చెప్పడం రాజకీయ కాకను పెంచింది. దీనిపై మాజీ ఎమ్మెల్యే ప్రతిదాడికి దిగడంతో అక్కడి వాతావరణాన్ని వేడేక్కించింది.

టీడీపీ, జనసేన కలిసినా ఇబ్బంది లేకుండా వైసీపీ ప్లాన్‌
జనసేన నేరుగా పోటీలో ఉంటే ఒక లెక్క.. టిడిపితో కలిస్తే మరోలెక్క అన్నట్టుగా ఉంది స్థానిక రాజకీయం. దీనికి తగ్గట్టుగానే వైసిపి పావులు కదుపుతోంది. జనసేన పోటిలో ఉంటే టెన్షన్ టిడిపికే తప్ప తమకేమి నష్టం ఉండబోదని భావిస్తోంది వైసీపీ. వారిద్దరు కలిసొచ్చినా గెలిచేందుకు అమలు చేయాల్సిన యాక్షన్ ప్లాన్ పై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టిందట. మరి.. తణుకులో కాపు సామాజికవర్గం ఏ పార్టీకి కాపు కాస్తుందో .. ఏమో..!