Site icon NTV Telugu

Off The Record: ఆయన జనసేనలో చేరడం గ్యారంటీనా ?

Sddefault (4)

Sddefault (4)

ఆ నేత జనసేనలో చేరడం ఖాయమైనట్లేనా..? సస్పెన్షన్ వేటుకోసమే మళ్లీ నోరు విప్పారా..! | OTR | Ntv

కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరడం ఖాయమైనట్టేనా? అందుకే సోము వీర్రాజుపై కన్నా బహిరంగంగా కామెంట్లు చేస్తున్నారా? బీజేపీకి మిత్రపక్షమైన జనసేనలోకి వెళ్లాలంటే సస్పెన్షన్‌ చేయించుకోవడం ఒక్కటే మార్గమని కన్నా స్కెచ్‌ వేసుకున్నారా? ప్రస్తుతం ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇలాగే కనిపిస్తోందా?

కన్నా జనసేనలోకి జంప్‌ అవుతున్నారా?
ఏపీలో బీజేపీ-జనసేన మిత్రపక్షాలుగా ఉన్నా.. ఈ రెండు పార్టీల మధ్యన పూడ్చలేని ఆగాధం పెరిగినట్టే కన్పిస్తోంది. ఈ బంధం భవిష్యత్‌లో ఉంటుందో లేదో కూడా ఎవరికీ తెలియదు. దీంతో పక్కదారులు చూసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోందట. జనసేన లేకుండా పోయినసారిలా ఒంటరిగా పోటీ చేయాలనే కాన్సెప్ట్‌ చాలా మందికి నచ్చడం లేదట. ఈ క్రమంలో కొందరు నేతలు పక్కపార్టీలకు దారులు వెతుక్కుంటున్నారు. ఈ లైనులోనే బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు.. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ ఉన్నట్టు టాక్‌. గతంలో కన్నా నివాసానికి జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వెళ్లినప్పుడే.. కన్నా జనసేనలోకి జంప్‌ అని దాదాపు అందరికీ అర్థమైంది. కన్నాతో నాదెండ్ల భేటీ కావడానికి ముందే సోము వీర్రాజుపై కన్నా గతంలో ఓసారి విరుచుకుపడ్డారు. ఆ తర్వాత కన్నా-నాదెండ్ల భేటీ జరగడంతో అప్పటి వరకు టీడీపీలోకి వెళ్తారని కన్నా గురించి లెక్కలు వేసుకున్న వారు.. వారి ఆలోచనలను మార్చుకుని జనసేనకు వెళ్తారనే క్లారిటీకి వచ్చారు.

బీజేపీలో సోము వీర్రాజుతో పడని కన్నా..!
సోము వీర్రాజుతో కన్నాకు పడటం లేదు. పైగా జనసేనతో పొత్తు చివరకు ఏం అవుతుందో తెలియదు. ఇంకోపక్క జనసేననాని నుంచి ఆహ్వానం.. ఇవన్నీ చూసిన కన్నా.. బీజేపీ సేఫ్‌ కాదనే ఫీలింగ్‌లో ఉన్నారట. ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయిన కన్నా.. మరోసారి ఓడటానికి సిద్ధంగా లేరట. అందుకే ఈసారి కచ్చితంగా గెలిచే పార్టీనే చూసుకోవాలనే ప్రయత్నంలో కన్నా ఉన్నారట. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బీజేపీ-జనసేన మిత్రపక్షాలుగా ఉండటంతో.. ఆ రెండు పార్టీల మధ్య చేరికల వ్యవహరం సరికాదనే చర్చ ఉంది. మిత్రపక్షమైన బీజేపీ నుంచి సీనియర్ నేత కన్నాను చేర్చుకోవాలంటే నైతికంగా జనసేన ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే బీజేపీనే కన్నాను బయటకు పంపేస్తే.. ఏ పార్టీలో లేని ఆయన్ను చేర్చుకోవడానికి జనసేనకూ ఇబ్బంది ఉండదు. అందుకే కన్నా నేరుగా బీజేపీ ఏపీ చీఫ్‌నే టార్గెట్‌ చేస్తున్నారట. వారిని వీరిని కాకుండా.. నేరుగా పెద్దాయన మీదే బాణం ఎక్కుపెట్టి తీవ్ర విమర్శలు.. ఆరోపణలు చేస్తున్నారు.

కాపు ఓట్ల చీలికకు వీర్రాజు సహకరిస్తున్నారని కన్నా ఆరోపణ
సోము వీర్రాజు పనితీరును.. వ్యవహరశైలిని తప్పు పట్టడమే కాకుండా.. బీఆర్‌ఎస్‌ పార్టీలోకి సోము వీర్రాజు తన వియ్యంకుడిని పంపారని.. ఏపీలో కాపు ఓట్లల్లో చీలిక తెచ్చేందుకు ఓవైపు కేసీఆర్‌కు.. మరోవైపు సీఎం జగన్‌కు సహకరిస్తున్నారనే కామెంట్లు చేశారు కన్నా. ఇదే సందర్భంలో మరో ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. తాను పవన్‌ కళ్యాణ్‌కు అండగా నిలుస్తానని అన్నారు. పవన్‌కు సహకరిస్తానని కామెంట్‌ చేస్తున్నారంటే కచ్చితంగా జనసేనలోకి కన్నా జంప్‌ కావడం లాంఛనమేననే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కన్నా ఇంటికి స్వయంగా నాదెండ్ల వెళ్లడమే కాదు.. కాపుల ఓట్లు.. బీఆర్‌ఎస్ పార్టీ గురించి కన్నా ఏ కామెంట్లైతే చేశారో.. సరిగ్గా అదే తరహా కామెంట్లు నాదెండ్ల మనోహర్‌ కూడా చేస్తున్నారు. దీని బట్టి వీరి వేవ్‌ లెంగ్త్‌ ఏంటో క్లారిటీ వచ్చేసిందని అంటున్నారు.

కన్నాను సాగనంపడం ఖాయమంటున్న సోమువర్గం
కన్నా కోరుకున్నట్టు ఆయన్ను సాగనంపడం ఖాయం అయ్యిందని సోము వర్గం అంటోంది. వెళ్లిపోవడానికి సిద్ధమయ్యే కన్నా రెచ్చిపోతున్నారని పార్టీ గుర్తించిందట. అయితే ఆ పని మనం చేయడం కంటే.. ఆయనకై ఆయనే వెళ్లిపోనివ్వమని హైకమాండ్‌ చెప్పిందట. కానీ.. కన్నాకు కావాల్సింది అది కాదు… అలా కాదు. బయటకు పంపించుకోవాలి.. సస్పెన్షన్‌ వేటు వేయించుకోవాలి. అందుకే మళ్లీ నోరు విప్పారు. సోమును టార్గెట్‌ చేశారట. ఆ దాడిని సోము వీర్రాజు తట్టుకోలేక మళ్లీ ఢిల్లీకి ఫిర్యాదు చేశారట. దీంతో ఇక కన్నాను సాగనంపాలనే నిర్ణయానికి వచ్చారట. ఈ నెల 16, 17న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలున్నాయి. ఆ సమావేశాల తర్వాతో.. ఆ సమావేశాల నాటికో దీనిపై క్లారిటీ వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. అప్పటికి టార్గెట్‌ ఫినిష్‌ కాదు అని అనుమానం వస్తే.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముందే సోము వీర్రాజు టార్గెట్‌గా కన్నా లక్ష్మీనారాయణ ఇంకొన్ని ఘాటైన విమర్శలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అనుకుంటున్నారు.

Exit mobile version