NTV Telugu Site icon

Kamalapuram Seat Sentiment.. Off The Record: కమలాపురంలో ఆ సెంటిమెంట్?

kdp kamala

Maxresdefault (1)

గత చరిత్ర.. గెలుపోటముల జాబితా.. అక్కడి రాజకీయాలను వేడెక్కిస్తున్నాయా? సెంటిమెంట్‌ను ఆ ఎమ్మెల్యే అధిగమిస్తారా.. లేక కొత్త ఎత్తుగడ వేస్తారా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఎవరా ఎమ్మెల్యే?

వరుసగా రెండుసార్లు గెలిచినవాళ్లు మూడోసారి ఓడిపోతారా?
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం. రాజకీయంగా ఈ సెగ్మెంట్‌కు ఎంతో చరిత్ర ఉంది. అంతే సెంటిమెంట్‌ కూడా కమలాపురంతో ముడిపడి ఉంది. వరసగా రెండుసార్లు గెలిచిన వ్యక్తి.. మూడోసారి ఓడిపోతారనే వాదన స్థానికంగా బలంగా వినిపిస్తుంటుంది. గతంలో జరిగింది అదే… అని గుర్తు చేస్తూ.. భవిష్యత్‌లోనూ రిపీట్‌ అవుతుందా అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు జనం. ఆ క్రమంలోనే సీఎం జగన్‌ మేనమామ.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి చుట్టు అధికార పార్టీలో చర్చించుకుంటున్న పరిస్థితి ఉందట.

2014, 2019లో కమలాపురంలో రవీంద్రనాథ్‌రెడ్డి గెలుపు
2014, 2019 ఎన్నికల్లో వరుసగా కమలాపురం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు రవీంద్రనాథ్‌రెడ్డి. వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారని అనుకుంటున్నా.. ఈ నియోజకవర్గానికి ఉన్న సెంటిమెంట్‌ కొత్త చర్చకు ఆస్కారం కల్పిస్తోంది. గతంలో ఇదే కమలాపురం నుంచి మాజీ హోంమంత్రి మైసూరారెడ్డి రెండుసార్లు వరుసగా గెలిచి మూడోసారి ఓడిపోయారు. మైసూరాపై గెలిచిన వీరశివారెడ్డిది సైతం అదే చరిత్ర. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి సైతం వరుసగా మూడుసార్లు పోటీచేసి ఓడిపోయారు. నాలుగోసారి బరిలో ఉండాలని పుత్తా భావిస్తున్నా.. ఆయనకు టీడీపీ టికెట్‌ ఇస్తుందా అనే సందేహాలు ఉన్నాయి. ఈ లెక్కలన్నీ చూసిన తర్వాత సిట్టింగ్‌ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పునరాలోచనలో పడ్డారనే వాళ్లూ ఉన్నారు. పాత సెంటిమెంట్‌ వచ్చే ఎన్నికల్లో రిపీటైతే పరిస్థితి ఏంటనే సందేహం లోకల్‌ వైసీపీ నేతల్లోనూ ఉందట. ప్రస్తుతం కమలాపురం వైసీపీకి కంచుకోటగా ఉన్నప్పటికీ.. సెంటిమెంటే వారిని కలవర పెడుతోందట.

కమలాపురంలో కుమారుడిని బరిలో దించుతారా?
ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సెంటమెంట్లను ఎక్కువగానే విశ్వసిస్తారని టాక్‌. ఏ పని మొదలు పెట్టాలన్నా మంచిచెడ్డలు ఆరా తీస్తారట. ముహూర్తాలు చూసుకుంటారట. అందుకే అధికారపార్టీ శ్రేణుల్లోనూ చర్చ నడుస్తోంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో తన కుమారుడు నరేన్‌ రామాంజులరెడ్డిని సీకేదిన్నె జడ్పీటీసీగా రాజకీయ ప్రవేశం చేయించారు రవీంద్రనాథ్‌రెడ్డి. ఆ మధ్య కుమారుడి పుట్టిన రోజు వేడుకల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అని ఫ్లెక్సీలు వేశారు. ఇప్పుడు సెంటిమెంట్‌ అడ్డొస్తే.. రామాంజులరెడ్డిని కమలాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దించొచ్చని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆ లెక్కలు కుదరకపోతే.. జిల్లాలోనే మరోచోట నుంచి రవీంద్రనాథ్‌రెడ్డి పోటీ చేయొచ్చనే టాక్‌ నడుస్తోందట. సెంటిమెంట్‌ అలాగే.. నియోజకవర్గ మార్పుపై రవీంద్రనాథ్‌రెడ్డి స్పందించకపోయినా.. ఆయన కేంద్రంగా కమలాపురం వైసీపీలో చర్చ అయితే జరిగిపోతోంది. మరి.. ఎమ్మెల్యే ఏం చేస్తారో కాలమే చెప్పాలి.