ఓవైపు ముంచుకొస్తున్న మున్సిపల్ ఎన్నికలు… మరోవైపు ఫిరాయింపుల పితలాటకం… కలగలిసి ఇన్నాళ్లు లోకల్‌గా జరుగుతున్న పంచాయితీ ఇప్పుడు గాంధీభవన్ గుమ్మాన్ని తాకింది. పార్టీ పెద్దల సమక్షంలోనే జరిగిన ఆ లొల్లి ఎటు దారి తీయబోతోంది? పార్టీ మారిన ఎమ్మెల్యేకి, ఐదు దశాబ్దాల అనుభవమున్న ఆ నాయకుడి మధ్య వ్యవహారాన్ని పీసీసీ ఎలా తేల్చబోతోంది? ఎవరా ఇద్దరు? కొత్తగా మొదలైన గొడవేంటి?
జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి, పార్టీ మారి వచ్చిన MLA సంజయ్ మధ్య వివాదం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే అదో ఆరని జ్వాల అన్నది కేడర్ అభిప్రాయం. ఇన్నాళ్ళు నియోజక వర్గంలో జరుగుతున్న లొల్లి ఎలా ఉన్నా… ఇప్పుడది డైరెక్ట్‌గా గాంధీభవన్‌ను టచ్ చేసింది. ఏకంగా PCC చీఫ్ మహేష్ గౌడ్ ఎదురుగానే వివాదం రేగడం పార్టీకి తలనొప్పిగా మారుతోంది. గాంధీభవన్ మీటింగ్‌లో లాజికల్‌గా కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు జీవన్‌రెడ్డి. ఎమ్మెల్యే సంజయ్ బీఆర్‌ఎస్ తరపున గెలిచిన కాంగ్రెస్‌లోకి వచ్చారు. కానీ… స్పీకర్ దగ్గర విచారణలో నేను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని వాదించారు. అలాంటి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకి గాంధీభవన్‌లో జరుగుతున్న అంతర్గత సమావేశాలతో పనేంటంటూ లాజిక్ లాగి పార్టీ అధిష్టానాన్ని ఇరకాటంలో పడేశారు మాజీ మంత్రి. దీనికి సంజయ్ సమాధానం ఇచ్చుకునే పరిస్థితి కూడా లేదంటున్నారు పరిశీలకులు.
Also Read:Dhulipalla Narendra Kumar: అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చా.. ఉచిత వైద్యానికి నేను వ్యతిరేకం!
నేను గాంధీ భవన్ కి వేరే పని మీద వచ్చానని చెప్పుకోవడమే ఆయనకు మిగిలి ఉందని అంటున్నారు. ఇప్పటికే జగిత్యాల కాంగ్రెస్ నిలువునా చీలిపోయి ఉంది. మాజీ మంత్రి జీవన్‌రెడ్డిది ఒకవర్గం కాగా…. ఎమ్మెల్యే సంజయ్‌ది మరో వర్గం. వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరుతో కేడర్ తీవ్రంగా దెబ్బతింటోందన్న ఆందోళనలు సైతంవ్యక్తం అవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల ముందు ఇలాంటి గొడవలు ఎటు దారి తీస్తాయోనన్న భయాలు సైతం పెరుగుతున్నాయి ద్వితీయ శ్రేణిలో. ఈ ఉప్పు నిప్పు వ్యవహారంతో ప్రత్యర్థులు లాభపడతారన్నది జగిత్యాల కాంగ్రెస్ కేడర్ వాయిస్. గాంధీభవన్ ఎపిసోడ్‌కంటే ముందు నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి మరీ…మున్సిపల్ ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్లు తానే ఇస్తానని ప్రకటించారు జీవన్‌రెడ్డి. ఆ సందర్భంలోనే…. రావణాసురుడు, నరుకుడు, చంపుడు లాంటి మాటలు వచ్చినా… ఇటు ఎమ్మెల్యేగానీ, అటు పార్టీ పెద్దలుగానీ పట్టించుకోకపోవడంతో నేరుగా ప్రభుత్వంపైనే విమర్శలు స్టార్ట్ చేశారాయన. నియోజకవర్గ అభివృద్ది కోసమే సీఎంకి దగ్గరయ్యానని సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అభివృద్ది అంటే శంఖుస్థాపనలు కాదు, ప్రారంభోత్సవాలంటూ డైరెక్ట్‌గా ప్రభుత్వాన్నే ఇరుకున పెట్టేలా మాజీ మంత్రి మాట్లాడ్డం సంచలనంగా మారింది. 400 కోట్ల నిధులతో చేసిన శంఖుస్థాపనల గురించి అధికార పార్టీ గొప్పగా చెబుతుంటే… సొంతపార్టీ నేత, అదీ పార్టీ అడ్వైజరీ కమిటీ మెంబర్ సర్కార్ గాలితీసేలా మాట్లాడ్డం ఏంటన్న చర్చలు జరుగుతున్నాయి జగిత్యాల కాంగ్రెస్‌లో.
Also Read:Telangana: ఆ ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ ఎప్పుడు..?
మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తన పట్టు కోల్పోకుండా ఉండాలంటే ఎక్కువ టిక్కెట్లు తన వర్గానికి వచ్చేలా చూసుకునేందుకే జీవన్ ఈ స్టెప్ తీసుకున్నారన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా బలహీన పడి కాంగ్రెస్‌కు ఎదురే లేదనకుంటన్న టైంలో జీవన్‌రెడ్డి ఇలా మాట్లాడ్డం హస్తం శిబిరంలో కలకలం రేపోతోంది. దీంతో ఓ సినిమా డైలాగ్‌ను మార్చి….. శత్రువులు ఎక్కడో ఉండరు…. సీనియర్స్ రూపంలో మనలోనే, మనతోనే ఉంటారని మాట్లాడుకుంటున్నారు లోకల్ కాంగ్రెస్ నాయకులు. జగిత్యాల టౌన్‌లో మొత్తం 50 వార్డులు ఉండగా… 30 సంజయ్‌కి.. 20 జీవన్‌రెడ్డి వర్గానికి ఇస్తామని ప్రతిపాదించారట పార్టీ పెద్దలు. దానికి ససేమిరా అన్న జీవన్‌రెడ్డి… సంజయ్ వర్గానికి ఒక్క వార్డ్ ఇచ్చినా ఊరుకోబోనని చెప్పేశారట. ఆ వివాదం కొనసాగుతుండగానే… ఏకంగా గాంధీభవన్‌లోనే, పీసీసీ అధ్యక్షుడి సమక్షంలోనే వివాదం రేగడం సంచలనమైంది. సమావేశం నడుస్తుండగానే బయటకు వచ్చిన జీవన్‌రెడ్డి… బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ సమావేశానికి ఎలా వస్తారంటూ ప్రశ్నించడం కాక రేపింది. మొత్తం మీద.. రెండేళ్ళ నుంచి రగులుతున్న వ్యవహారం మున్సిపల్ ఎన్నికలకు ముందు పీక్స్‌కు చేరడం కాంగ్రెస్ వర్గాలను కలవరపెడుతోంది.
