NTV Telugu Site icon

వరంగల్ ల్యాండ్ పూలింగ్ జీవో నిలిపివేత వెనుక ఎమ్మెల్యేల ఒత్తిడి ఉందా?

Trs Warangal

Trs Warangal

గ్రేటర్ వరంగల్ చుట్టూ ఇప్పటికే కొంత ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగింది. మిగతా రింగ్ రోడ్డును నిర్మించేందుకు కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ఈ రింగ్ రోడ్డు చుట్టూ ల్యాండ్ పూలింగ్​కి ప్లాన్ చేసింది. వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో కలిపి మొత్తం 27 గ్రామాల్లో 21,517 ఎకరాలను సేకరించేందుకు సిద్ధమైంది. వరంగల్​ రింగ్​రోడ్డు వెంట, 27 గ్రామాల్లో భారీ భూ సేకరణకు జీవోను కూడా విడుదల చేసింది. ఆఫీసర్లు సర్వే కూడా ప్రారంభించడంతో ఆయా సర్వే నెంబర్లలో, భూములున్న రైతులు ఆందోళనలకు దిగారు. పచ్చని పొలాల్లో వెంచర్ల ఏర్పటును వ్యతిరేకించారు. ఏటా రెండు, మూడు పంటలు పండే భూములను రియల్ ఎస్టేట్​దందా కోసం ఇవ్వబోమని, గ్రామాల్లో నిరసన దీక్షలకు దిగారు. గ్రామగ్రామాల్లో ధర్నాలు నిరసనలకు రైతులు దిగడంతో, కేయూడీఏ కూడా వెనక్కి తగ్గింది. రైతుల ప్రతిఘటన, ఆగ్రహానికి వెనక్కి తగ్గిన అధికారులు ప్రస్తుతానికి ల్యాండ్ పూలింగ్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు, ల్యాండ్ పూలింగ్ నిరసనల ఎఫెక్ట్ అటు తిరిగి ఇటు తిరిగి స్థానిక ప్రజాప్రతినిధులపై పడింది.

పరకాల వర్ధన్నపేట, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేలపైన ఒత్తిడి పెడగడంతో, ల్యాండ్ పూలింగ్ అంశం పైనా అధికార పార్టీ నేతలు వెనకకు తగ్గక తప్పలేదు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రతిపక్షాలు , రైతులు సంధిస్తున్న ప్రశ్న, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెనుదుమారం రేపుతోంది. నోటిఫికేషన్ జారీ చేసిన తమ భూముల చెంతనే, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల, ఇతర నాయకుల భూములున్నా, వాటిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎందుకు సేకరించడం లేదని నిలదీస్తున్నారు రైతులు. అన్నదాతల భూములతో రియల్ వ్యాపారం చేయాలనుకుంటున్నారా? టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల, వారి అనుచరుల భూముల ఎందుకు కనిపించడం లేదనేది విపక్షాల వేస్తున్న ప్రశ్నలు, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.

ఎమ్మెల్యేలు వారి అనుచర వర్గం భూముల రేట్లను పెంచుకునేందుకు రైతుల భూములను టార్గెట్ చేశారనే వాదన, వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు వరంగల్ రింగు రోడ్డు చుట్టూ రెవెన్యూ శాఖకు చెందిన కొందరు అధికారులను భాగస్వామ్యం చేసుకొని, అధికార పార్టీ నేతలు ఇటీవల పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారనే విమర్శలు పెరిగాయి. ముఖ్యంగా హసన్ పర్తి, ఐనవోలు, దామెర, ఆత్మకూరు మండలాల్లో రింగు రోడ్డు సమీపంలో రెవెన్యూ అధికారులను అడ్డుపెట్టుకోని కొందరు నేతలు బినామిలతో ముందు జాగ్రత్తగా భూములు కొనుగోలు చేశారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

వరంగల్ మహానగర రింగు రోడ్డు చుట్టూ భూసేకరణ అంశంలో ముందస్తుగా భూమిని కొనుగోలు చేశారనే ప్రచారం ఎందుకు తెరమీదకు వచ్చిందన్న ప్రశ్నకు అనేక సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల భారీస్థాయిలో భూములు కొనుగోలు చేశారనే ప్రచారం జరగడంలో నిజమెంత అనేది వెలికి తీయాలని రైతులు..విపక్షాలు ఒత్తిడి చేయడం జిల్లాలో కాకరేపింది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు అంశంలో రైతుల్లో పెరిగిన వ్యతిరేకతకు తోడు, ల్యాండ్ పూలింగ్ అంశంలోనూ రైతుల ఆగ్రహం, నష్టం జరుగుతుందని గుర్తించిన ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, అరూరి రమేష్, అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారట. అధికారులపైనా ఒత్తిడి తెచ్చి ల్యాండ్ పూలింగ్ జీవో ను రద్దు చేయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇంత చేసిన ఎమ్మెల్యేలు, స్థానిక నేతలపై, రైతుల్లో కోపం తగ్గలేదట. ముందస్తుగా భూములుకొని, మాకు అన్యాయం చేస్తున్నారనే భావనతోనే రైతులు ఉండటం, స్థానిక ప్రజా ప్రతినిధులను కలవరానికి గురి చేస్తోందట. అకునున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటిని ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారట.