NTV Telugu Site icon

TRS : టీఆర్ఎస్ లో గ్రూప్ వార్ కి చెక్ పడినట్టేనా?

Check Matey

Check Matey

ఉమ్మడి నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం టీఆర్ఎస్‌లో కొన్నాళ్లుగా వర్గపోరు తగ్గేదే లేదన్నట్టుగా సాగుతోంది.ఉపఎన్నిక తర్వాత అది మరీ ఎక్కువైందనే అభిప్రాయం ఉంది. ఎమ్మెల్యే నోముల భగత్‌, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి వర్గాలకు అస్సలు పడటం లేదు. పలు అంశాల్లో రెండు వర్గాలు ఆధిపత్యపోరు ప్రదర్శించిన ఉదంతాలు ఉన్నాయి. ఇదే సమయంలో టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నాగార్జున సాగర్‌ పర్యటన గ్రూప్‌ వార్‌కు చెక్‌ పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆయన చేసిన కామెంట్స్‌పై ఎవరికి వారుగా విశ్లేషణ చేసుకుంటున్నారు.

ఎమ్మెల్యే భగత్‌కు నియోజకవర్గ అభివృద్ధి తప్ప మరో ఆలోచన లేదని కేటీఆర్‌ చెప్పడంతో.. వైరివర్గంలో చర్చ మొదలైందట. పైగా భగత్‌కే అందరూ అండగా ఉండాలని.. సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదాలు ఎమ్మెల్యేకే ఉన్నాయని కేటీఆర్ స్పష్టంగా చెప్పడంతో ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గానికి అస్సలు రుచించలేదట. వాస్తవానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాలు నాగార్జున సాగర్‌లో పట్టు సాధించేందుకు చేయని ప్రయత్నాలు లేవు. ఇలాంటి తరుణంలో కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌తో ఎమ్మెల్సీ శిబిరం కంగుతిందట.

అదే వేదిక నుంచి పార్టీ అగ్రనేత చేసిన మరికొన్ని కామెంట్స్‌ చూట్టూ ప్రస్తుతం చర్చ నడుస్తోంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చామని కేటీఆర్ గుర్తు చేశారు. ఇలా భగత్‌, కోటిరెడ్డిల విషయంలో ఎవరి పరిధి ఏంటో.. ఎవరు ఏ గీత లోపల పనిచేయాలో స్పష్టంగా చెప్పడంతో వర్గపోరుకు ముగిసినట్టేనని కేడర్‌ చెవులు కొరుక్కుంటోంది. అంతేకాదు.. సాగర్‌లో టికెట్‌పై కన్నేసిన మరికొందరికి కూడా సమాధానం చెప్పేశారని అనుకుంటున్నారు. మరి.. ఇదే విధంగా హద్దుల్లో ఉండి.. కలిసి పార్టీ కోసం పనిచేస్తారో.. లేక కలిసి మెలిసి తిరుగుతూ.. తెరవెనక కత్తులు దూసుకుంటారో చూడాలి.