NTV Telugu Site icon

తెలంగాణ కాంగ్రెస్‌లో అజారుద్దీన్ ఎక్స్‌ట్రా ప్లేయరేనా…?

తెలంగాణ కాంగ్రెస్‌లో ఆయన ఎక్స్‌ట్రా ప్లేయరేనా? పదవి ఇవ్వాలి కాబట్టి.. ఇచ్చారా..? దీనివల్ల పార్టీకి కలిగే ప్రయోజనాలేంటి? కేడర్‌లో జరుగుతున్న చర్చ ఏంటి?

యూపీ కోటాలో.. ప్రియాంకా సిఫారసుతో తెలంగాణలో పదవి?

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరికీ పదవి గ్యారెంటీ లేకున్నా.. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌కు పక్కా. సొంత రాష్ట్రంలో పరిస్థితి ఏంటో తెలియదు కానీ.. మరో రాష్ట్రంలో కోటాలో ఆయనకు ఇక్కడ పదవి ఖాయం. ఇదేంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఉత్తరప్రదేశ్‌ కోటా.. ప్రియాంకా గాంధీ సిఫారసు అని టక్కున అనేస్తారు. పదవుల వరకు బాగానే ఉన్నా.. ఆయన వల్ల కలిసొచ్చింది ఏంటో పార్టీలో ఎవరికీ తెలియదు. క్రికెట్‌ టీమ్‌లో ఎక్స్‌ట్రా ప్లేయర్‌లా.. కాంగ్రెస్‌లోనూ ఎక్స్‌ట్రా ప్లేయర్‌ అయిపోయారు. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయ్యాక.. కొత్తలో పార్టీ సభలు.. సమావేశాలు జరిగితే అజారుద్దీన్‌ వచ్చేవారు. లేదంటే లేదు. ఈ మధ్య పార్టీలో సభలు లేవు.. సమావేశాలు లేవు. అజారుద్దీన్‌ కనిపించడం లేదు. పార్టీ మీటింగ్స్‌కూ అజార్‌ రావడం లేదట.

సభలకు గెస్ట్‌గా రావడమే తప్ప చేసేది ఏం లేదా?

మైనారిటీ కోటాలో అజార్‌కు పదవి ఇవ్వడంతో ఆ వర్గం నుంచి సానుకూల వాతావరణం వస్తుందని పార్టీ నేతలు లెక్కలు వేస్తారు. ఆయన మాత్రం రాజకీయ వ్యవహారాలకంటే క్రికెట్‌.. అసోసియేషన్‌ గొడవల్లోనే ఎక్కువ సమయం గడిపేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముస్లిం సామాజికవర్గాన్ని కాంగ్రెస్‌ చేరువ చేయడానికి అజార్‌ చొరవ తీసుకోవచ్చన్నది పార్టీ నేతల అభిప్రాయం. అయినప్పటికీ అజార్‌ ఆ ప్రయత్నమే చేయడంలేదట. కాంగ్రెస్‌ సభలకు గెస్ట్‌గా రావడం తప్పితే.. చేసేది ఏం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

జహీరాబాద్‌ లోకసభకు ఇంఛార్జ్‌గా ఉన్నా.. చప్పుడు లేదా?

తెలంగాణ కాంగ్రెస్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్‌లకు పని విభజన చేశారు. ఆ విధంగా అజారుద్దీన్‌కు జహీరాబాద్‌ లోక్‌సభకు ఇంఛార్జ్‌ పని అప్పగించారు. అక్కడ కూడా ఆయన ఆశించిన స్థాయిలో వర్క్‌ లేదనే చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. ఒక్క అజారే కాదు.. పని విభజన జరిగిన ఇతర వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌ కూడా చురుకుగా పనిచేస్తున్న పరిస్థితి లేదట. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా వచ్చాక మొదట్లో వారానికో సభ పెట్టి కాంగ్రెస్‌ హడావిడి చేసింది. ఆ సభలో అజారుద్దీన్‌తోపాటు ఇతర వర్కింగ్‌ ప్రెసిడెంట్లు సందడి చేసేవారు. ఇప్పుడు సభలు లేకపోవడంతో ఎక్కడివారు అక్కడే గప్‌చుప్‌.

యూపీలో కలిసొస్తుందని తెలంగాణలో పదవి ఇచ్చారా?

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితిని మెరుగు పర్చాలన్నది హైకమాండ్‌ ఆలోచన. ఈ సందర్భంగా తీసుకుంటున్న నిర్ణయాలే కేడర్‌కు రుచించడం లేదట. ఎక్కడో ఉత్తరప్రదేశ్‌లో కలిసి వస్తుందని.. అజారుద్దీన్‌కు తెలంగాణలో పదవులు ఇస్తే ఎలా అన్నది కొందరి ప్రశ్న. అలా అయితే తెలంగాణలో పార్టీ కోసం పనిచేయడానికి ఎవరు ముందుకొస్తారు? అని నిలదీస్తున్నారట. అందుకే పీసీసీలో అజారుద్దీన్‌ను ఎక్స్‌ట్రా ప్లేయర్‌గా చెవులు కొరుక్కుంటాయి గాంధీభవన్‌ వర్గాలు. ఆయన క్రీజ్‌లోకి వస్తే చూడాలని కళ్లు కాయలు కాచేలా ఎదురుచేసే పరిస్థితి ఉందట.