OTR: మహబూబాబాద్ కాంగ్రెస్‌లో ముసలం.. ఎమ్మెల్యే మురళీ నాయక్‌పై సొంత పార్టీ నేతల గుర్రు!

  • మహబూబాబాద్‌ ఎమ్మెల్యే వైఖరిపై కాంగ్రెస్‌ వర్గాల్లో అసంతృప్తి..
  • మురళీ నాయక్‌ ద్వితీయ శ్రేణిని అస్సలు పట్టించుకోవడం లేదన్న టాక్‌..
  • రాష్ట్ర స్థాయిలోని ఒక పెద్దనేత అండదండలుంటే చాలనుకుంటున్నారా?
Manukota

Manukota

అక్కడ హస్తం పార్టీలో మంటలు అంటుకుంటున్నాయా? ఎమ్మెల్యే వైఖరి ఏకంగా చీలికలకు కారణం అవుతోందా? గత ఎన్నికల్లో తాము దగ్గరుండి గెలిపించిన నాయకుడి మీదే… ఇప్పుడు ద్వితీయ శ్రేణి తీవ్రంగా రగిలిపోతోందా? ఎవరా శాసనసభ్యుడు? సొంతోళ్ళే రివర్స్‌ అయ్యేందుకు దారితీసిన పరిస్థితులేంటి?

మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్‌తో పాటు ఆయన భార్య, డీసీసీ అధ్యక్షురాలు భూక్యా ఉమ వ్యవహార శైలిపై కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి తీవ్రంగా రగిలిపోతోందట. నియోజకవర్గ ముఖ్య నాయకులను ఎవర్నీ పట్టించుకోకుండా భార్యాభర్తలిద్దరూ సర్వం మేమే అన్నట్టుగా ఉంటున్నారని స్థానిక ద్వితీయ శ్రేణి నాయకులు నొచ్చుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఒకవైపు సీనియర్ నేతలకు సరైన ప్రాధాన్యత లేకపోవడం, మరోవైపు జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదవులు ఉన్నవాళ్లకి కనీసం ప్రోటోకాల్ ప్రకారం గౌరవం కూడా ఇవ్వడం లేదంటూ అధికార పార్టీ నాయకులు అసంతృప్తిగా ఉన్నారట.

రాష్ట్రస్థాయిలో ఉన్న ఒక్క పెద్ద నాయకుడి అండదండలుంటే చాలు… ఇక లోకల్‌గా ఎవ్వరితో అవసరం లేదన్నట్టుగా ఎమ్మెల్యే ఉంటున్నారన్న గుసగుసలు పెరుగుతున్నాయి. సీఎంకు అత్యంత సన్నిహితుడని చెప్పుకునే ఓ నేత అండదండలతోనే మురళీ నాయక్‌ అలా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు సైతం ఉన్నాయట. ఎమ్మెల్యే వైఖరితో విసిగిపోయి… తమ నామినేటెడ్ పదవులకు రాజీనామా చేసేందుకు కూడా ఒకరిద్దరు నాయకులు సిద్ధపడటం ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో కష్టపడిన నాయకులకు తగిన గుర్తింపు లేకపోవడం, పదవులు దక్కకపోవడంతో పాటు వారిని సమన్వయం పర్చడంలో కొరవడిన చొరవే అసంతృప్తికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్యే భార్య ఉన్నా… అందర్నీ కలుపుకొని వెళ్ళే ప్రయత్నం జరక్కపోవడం ఏంటన్నది సెకండ్‌ కేడర్‌ క్వశ్చన్‌. ఇటీవల కేసముద్రంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ… జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాలకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు కనీసం ఆహ్వానం కూడా అందలేదట. ఫ్లెక్సీల్లోనూ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి ఫోటోలు పెట్టడం లేదని, కనీసం ప్రోటోకాల్ ప్రకారం వేదికల మీదికి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వడం లేదన్న అసంతృప్తి ఆ వర్గంలో ఉందట. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాల టైంలో మేం గుర్తుకు వస్తున్నాంగానీ… అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల టైంలో ఎందుకు గుర్తుకు వారడం లేదంటూ నిలదీస్తున్నారు. ఒక్క జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మనే కాదు…. జిల్లా సీనియర్ నాయకులు చాలా మంది ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు.

ST కమిషన్ మెంబర్ ​నూనావత్ రాధా పరిస్థితి అదేనట. ​రాష్ట్ర స్థాయిలో ST కమిషన్ మెంబర్ పదవి వచ్చినప్పటికీ, నియోజకవర్గ అభివృద్ధి నిర్ణయాల్లో ఎమ్మెల్యే తమను కలుపుకొనిపోవడం లేదనే అభిప్రాయం ఉంది. ​మరో కీలక నేత ​భరత్ చందర్ రెడ్డి సైతం తీవ్ర సంతృప్తిగా ఉన్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ​ఎమ్మెల్యే తన వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ పార్టీ కోసం, కష్టపడ్డ నేతలను పక్కనబెడుతున్నారని గుర్రుగా ఉన్నారట. ​పార్టీకి అండగా నిలిచిన ద్వితీయ శ్రేణి నేతలలో ఒకరైన, దేవర ప్రకాష్ పేరును నామినేటెడ్ పదవుల పంపిణీలో పరిగణనలోకి తీసుకోలేదన్న అసంతృప్తి ఉందట. ఇలా… నియోజకవర్గంలో చాలామంది నేతలు ఎమ్మెల్యే వైఖరిపై అసంతృప్తిగా ఉండటంతో… రేపు ఎంపీటీసీ..జెడ్పీటీసీ ఎన్నికల టైంలో ఎంత మంది కలిసి వస్తారోనన్న ఆందోళన కేడర్‌లో పెరుగుతోందట.