Site icon NTV Telugu

Husnabad Congress : ఆ మాజీ ఎమ్మెల్యే చేరికతో రాజుకున్న చిచ్చు సెగలు రేపుతోందా.? లోకల్ లీడర్లు విడిపోయారా.?

Telangana Congress

Telangana Congress

Husnabad Congress :

ఆ మాజీ ఎమ్మెల్యే చేరికతో రాజుకున్న చిచ్చు సెగలు రేపుతోందా? తాడో పేడో తేల్చుకోవాలని చూస్తోంది ఎవరు? లోకల్‌ లీడర్లు సామాజికవర్గాలుగా విడిపోయారా? ఎవరా నేతలు.. ఏమా పార్టీ? ఏంటా నియోజకవర్గం? లెట్స్‌ వాచ్‌..!

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ఆపరేషన్ ఆకర్ష్ అగ్గి రాజేస్తుంది. కొంతకాలంగా టి ఆర్ యస్ లో సైలెంట్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే అరిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. కాంగ్రెస్‌ రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జన్ ఖార్గే సమక్షంలో ఘర్‌ వాపసీ అయ్యారు. ఆ సమయంలో పిసిసి చీఫ్‌ రేవంత్ రెడ్డి, సమన్వయ కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ అక్కడే ఉన్నారు. దీంతో హుస్నాబాద్‌ కాంగ్రెస్ ఇంచార్జ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పరిస్థితి ఎంటనే ప్రశ్న జోరందుకుంది.

ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం జరిగిన సమయంలోనే హుస్నాబాద్‌లో కొందరు కాంగ్రెస్‌ నాయకులు ప్రత్యేక సమావేశం పెట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యే చేరికపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏకంగా తీర్మానం చేశారు. స్థానిక నేతలకు.. జిల్లా నాయకత్వానికి తెలియకుండా ప్రవీణ్ రెడ్డి ని ఎలా చేర్చుకుంటారని విమర్శలు గుప్పించారు కొందరు. తాజా పరిణామాలతో అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు నేతలంతా సిద్ధం అవుతున్నారట. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు రెడ్డి సామాజికవర్గ నేతల అండతోనే ప్రవీణ్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారని ప్రచారం జరుగుతోంది.

హుస్నాబాద్‌ కాంగ్రెస్‌లోని బీసీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నట్టు సమాచారం. బీసీ నేతలను పక్కన పెట్టేందుకే ప్రవీణ్‌రెడ్డిని తీసుకొచ్చారని ఫైర్‌ అవుతున్నారట. 50 ఏళ్లుగా బొమ్మ కుటుంబం కాంగ్రెస్‌ కోసం పనిచేస్తోందని.. ఆ కుటుంబానికి చెందిన శ్రీరామ్ చక్రవర్తికి మెండిచెయ్యి ఇచ్చేలా చేస్తున్నారని అనుమానిస్తున్నారట. వారంతా సహాయ నిరాకరణకు యోచిస్తున్నట్టు సమాచారం.

నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్న బొమ్మ శ్రీరామ్ కు టికెట్‌పై స్పష్టత ఇవ్వకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేసారట. ప్రవీణ్ రెడ్డి మాత్రం టికెట్ హామీతోనే కాంగ్రెస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం హుస్నాబాద్‌ కాంగ్రెస్‌ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎవరు పార్టీలో ఉంటారో ఎవరు జంప్‌ చేస్తారో అర్థంకాని పరిస్థితి ఉందట. రానున్న రోజుల్లో కీలక పరిణామాలు తప్పవని అనుకుంటున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version