Site icon NTV Telugu

విశాఖ వైసీపీలో వైవీ మార్క్ ఎలా ఉండబోతోంది?

Mark Chpena

Mark Chpena

వైవీ సుబ్బారెడ్డి రాకతో కలిగే ప్రయోజనాలపై చర్చ.ఉత్తరాంధ్ర రాజకీయాలకు గేట్‌ వే విశాఖపట్నం. ప్రధాన రాజకీయపార్టీలకు ఆయువుపట్టు. ఇక్కడ ఫలితాలు పార్టీల పటిష్టత, భవిష్యత్‌ను నిర్ధేశిస్తాయి. అందుకే అందరి దృష్టీ ఎప్పుడూ విశాఖపై ఉంటుంది. వచ్చే రెండేళ్లూ ఎన్నికల సీజన్ కావడంతో ఈ ఫోకస్ మరింత పెరిగింది. ఈ క్రమంలో వైసీపీ సంస్థాగతంగా కీలకమైన మార్పులు చేసింది. ఉమ్మడి విశాఖజిల్లా సమన్వయకర్త బాధ్యతలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భుజాలపై పెట్టింది అధికార పార్టీ. కొత్త బాస్‌రాకతో పార్టీకి కలిగే అదనపు ప్రయోజనాలపైనే విస్త్రతంగా చర్చ జరుగుతోంది.

వైవీ సుబ్బారెడ్డికి విశాఖజిల్లాకు సుదీర్ఘ అనుబంధం వుంది. ఇక్కడ రాజకీయ నాయకులు, వ్యాపారులతో విస్త్రతమైన పరిచయాలు వున్నాయి. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా వున్నప్పటి నుంచి స్ధానిక నాయకత్వానికి దగ్గరయ్యారు వైవీ. వైసీపీ ఆవిర్భవించినప్పటి నుంచి చాలా కాలంపాటు పర్యవేక్షణ బాధ్యతలు ఆయనే చూశారు. ఆయనకంటూ ఇక్కడ ప్రత్యేక వర్గం వుందనేది అధికారపార్టీలో అంతర్గత సమాచారం. ఇప్పుడు కో ఆర్డినేటర్ గా ఆయనే వస్తున్నందున కీలకమైన నాయకత్వం యాక్టివేట్ అవుతోంది. సుబ్బారెడ్డితో నేరుగా మాట్లాడి తమ సమస్యలను, పార్టీ పరిస్ధితులను చర్చించే అవకాశం ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ముఖ్యనాయకత్వానికి కలగనుందనే అంచనాలు మొదలయ్యాయి.

పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పార్టీ కార్యకలాపాల్లో తనదైన మార్కు వేసుకోవాలనేది వైవీ ఆలోచనగా చెబుతున్నారు. ప్రభుత్వ వ్యవహారాలతో ముడిపెట్టకుండా పూర్తిగా పార్టీ పటిష్టత, నాయకత్వ సమస్యలపైనే ఆయన అధికంగా ఫోకస్ చేస్తారని సన్నిహిత వర్గాల సమాచారం. విశాఖలో వున్నంత సేపు పార్టీ కార్యాలయం వేదికగానే వ్యవహారాలు అన్నీ సాగించాలని వైవీ భావిస్తున్నారని భోగట్టా. తద్వారా నాయకత్వం ఎప్పుడూ అందుబాటులోనే వుంటుందనే సంకేతాలు పంపించాలని చూస్తున్నారట. అదే సమయంలో ఎదురయ్యే రాజకీయ సమీకరణలు, పార్టీ పటిష్టత కోసం ఫోకస్ పెంచడం వంటివి కీలకం కానున్నాయి.

అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలతో పోలిస్తే గ్రేటర్ విశాఖ నగర పరిధిలో వైసీపీ బలహీనంగా వుంది. 2019ఎన్నికల్లో ఇక్కడ నాలుగు చోట్ల టీడీపీ విజయం సాధించింది. గ్రేటర్ విశాఖ ఎన్నికల్లోనూ ఈ ప్రభావం కనిపించింది. దీంతో సుబ్బారెడ్డి ఎక్కువ శాతం పార్టీ బలోపేతంపైనే దృష్టిపెట్టే అవకాశాలు వున్నాయి. ఈ దిశగా ఆయనకు ఉన్న విస్తృతమైన పరిచయాలు కలిసివస్తాయనే అభిప్రాయం వుంది. పార్టీని సమన్వయం చేసే దిశగా కొన్ని సవాళ్లు వైవీ ముందు ఉంటాయి. టీడీపీ నుంచి గెలిచిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ పంచన చేరారు. పార్టీలోకి వచ్చినప్పుడు దూకుడుగా వ్యవహరించిన ఆయన తర్వాత కాలంలో స్తబ్ధత పాటిస్తున్నారు.

మాజీమంత్రి అవంతి శ్రీనివాస్‍ గత మూడేళ్లు పార్టీ పరంగా అంటీముట్టనట్టుగానే వ్యవహరించాల్సి వచ్చింది. కీలక నిర్ణయాల్లో వీరి ప్రమేయం తక్కువగా వుండటం ప్రధాన కారణంగా చెప్పుకునే వారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతంలో కొంత మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు పరిమితమయ్యారు. ఇప్పుడు సంస్ధాగత మార్పుల్లో భాగంగా సుబ్బా రెడ్డికి డ్రీమ్ టీం లభించింది. అనకాపల్లి బాధ్యతలు ధర్మశ్రీకి, విశాఖ జిల్లా అధ్యక్ష పీఠం అవంతి శ్రీనివాస్ కు, అల్లూరి సీతారమరాజు జిల్లా బాధ్యతలు భాగ్యలక్ష్మికి అప్పగించింది. కోఆర్డినేటర్ మార్పు తర్వాత వీరందరి యాక్టివిటీస్ బాగా పెరిగే అవకాశాలు వున్నాయి. మాజీ మంత్రి అవంతికి వైవీతో చాలా కాలంగా అనుబంధం వుంది. ఆయన అనకాపల్లి ఎంపీగా పనిచేసిన సమయంలో వైవీకి కొలీగ్. ఇవన్నీ ద్ర్రష్టిలో పెట్టుకు ని కొత్త నాయకత్వం సమర్ధవంతంగా పార్టీని నడిపిస్తుందనే అంచనాలు వున్నాయి. పైగా అన్ని వర్గాలతో.. కులాలతో సుబ్బారెడ్డికి ఉన్న స్నేహ బంధాలు కలిసి వస్తాయని లెక్కలు వేస్తున్నారు. అందరినీ కలుపుకొని వెళ్తారని.. పాత పరిచయాలు అక్కరకు వస్తాయని వైసీపీ వర్గాలు ఖుషీగా ఉన్నాయి.

Watch Here : https://youtu.be/APgQXfUAJQo

Exit mobile version