ఉపఎన్నిక జరిగే హుజురాబాద్‌లో కాంగ్రెస్ వ్యూహం కొలిక్కి రావడం లేదు. బరిలో దిగే అభ్యర్థిపై క్లారిటీ ఉన్నా.. ప్రకటన చేయడానికి జంకుతున్నారు. వేచి చూద్దాం అనుకుంటున్నారో లేక ఇంకేదైనా వ్యూహం ఉందో కానీ నాన్చడానికే ప్రాధాన్యం ఇస్తున్నారట. దీంతో ఏమైందో గాంధీభవన్ వర్గాలకు అర్థం కావడం లేదట.
రావిర్యాల సభలోనే హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటించాలని అనుకున్నారా?
హుజూరాబాద్ ఎన్నికపై ఆచి తూచి వ్యవహారం నడిపిస్తుంది తెలంగాణ కాంగ్రెస్. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేయాలన్నది పార్టీ ఆలోచనగా ఉంది. అక్కడేం జరుగుతుందో అంచనా వేయకుండా.. దూకుడు ప్రదర్శిస్తే అసలుకే ఎసరొస్తుందనేది కాంగ్రెస్ ఫీలింగ్. ప్రస్తుతం పార్టీ స్పీడ్‌గా వెళ్లే స్థితి లేదు. అక్కడి పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడమే అజెండా. ఇందుకోసం బలమైన అభ్యర్థిని బరిలో దించాలని చూస్తున్నారు నాయకులు. మాజీ మంత్రి కొండా సురేఖను పోటీకి దింపాలని అనుకున్నారు కూడా. రావిర్యాలలో జరిగిన కాంగ్రెస్ దళిత గిరిజన సభలోనే అభ్యర్థిపై ప్రకటన చేస్తారని భావించారు. కొండా సురేఖ కూడా ఆ సభకి హాజరయ్యారు. కాంగ్రెస్‌లో పీసీసీస్థాయిలోనే అభ్యర్ధి ఎంపిక ఉండదు. అందుకే ఆలస్యమైనట్టు పార్టీవర్గాలు భావించాయి. అదే విషయాన్ని సురేఖకు కూడా చెప్పారట.
అభ్యర్థి ప్రకటనపై తొందరపడొద్దని తాజా వ్యూహం!
ఎన్నికల షెడ్యూలు ఇప్పట్లో వచ్చేలా లేదు. ఒకవేళ షెడ్యూల్ వస్తుందన్న సంకేతాలు ఉంటే.. గేరప్ చేయాలనే చర్చ కాంగ్రెస్‌లో ఉందట. అప్పుడైతే జనాల్లోకి వెళ్తే ఉపయోగం ఉంటుందని కాంగ్రెస్ వర్గాల అంచనా. షెడ్యూల్ మీదే క్లారిటీ లేనప్పుడు ఎంత బలమైన అభ్యర్ధి అయినా.. ఎన్నికలు జరిగే వరకు పార్టీ టెంపో మెయింటైన్ చేయాలంటే ఇబ్బందే. ఆర్ధికంగా కూడా అభ్యర్ధి ఇబ్బంది పడతారని పార్టీ వర్గాల్లో చర్చ జరగిందట. అందుకే అభ్యర్థి ప్రకటనపై తొందరపడొద్దనే స్ట్రాటజీని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
హుజురాబాద్ అభ్యర్థి ప్రకటనపై ఆచితూచి నిర్ణయం?
ఇప్పుడు ఉపఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థే రేపొచ్చే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. పార్టీ కూడా ఆ మేరకు మాట ఇచ్చినట్టు సమాచారం. ఈ ఉపఎన్నికను పార్టీ పునాదిని బలోపేతం చేసుకోవడానికి చూస్తున్నారట. పైగా హుజురాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ హోరాహరీగా ప్రచారం చేస్తున్నాయి. వారి మధ్యలోకి ఇప్పటికిప్పుడు ఎంట్రీ ఇచ్చి పోలింగ్ వరకు ఆ హీట్ కొనసాగించడం నేతలకు కత్తిమీద సాముగా మారుతుంది. ఈ అంశాలపైనే ఇటీవల పీసీసీలో చర్చ జరిగిందట. ఆ తర్వాతే అభ్యర్థి ప్రకటనపై తొందర పడకూడదని.. ఆచితూచి అడుగులు వేయాలని అనుకుంటున్నారట. అయితే కాంగ్రెస్‌లో ఏదైనా సాధ్యమే. పైకి ఈ విషయం చెబుతున్నా.. రేపటి రోజున ఇంకేదైనా సమీకరణాలు తెరపైకి రావొచ్చు. ఇప్పటికైతే ఇదే. మరి.. షెడ్యూల్ ప్రకటన వరకు ఇదే ఆలోచనతో ఉంటారో.. ఇంకేదైనా వాదన తెరపైకి తెస్తారో చూడాలి.
