Site icon NTV Telugu

గుంటూరు టీడీపీలో గడబిడ..ప్రచార యావతో తమ్ముళ్ల కుమ్ములాట

Gunturulo Gadabida

Gunturulo Gadabida

నోటితో నవ్వుతూ.. నొసటితో వెక్కిరించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు గుంటూరు టీడీపీ నేతలు. పైగా ప్రచార యావ పెరిగిపోవడంతో.. వ్యక్తిగతంగా హైలైట్‌ కావడానికే చూస్తున్నారట. ఏ కార్యక్రమం చేసినా ఫొటోలు దిగడం.. గ్రూపులు కట్టుకోవడమే సరిపోతున్నట్టు తమ్ముళ్ల వాదన. ఈ పోకడలు కార్యకర్తల్లో కనిపిస్తే పెద్దగా పట్టించుకోరు కానీ.. నియోజకవర్గంలో పార్టీని నడిపించాల్సిన నాయకులే ఈ తరహాలో వింత పోకడలకు పోవడం ఆశ్చర్యం కలిగిస్తోందట.

గుంటూరు నగరంలో గుంటూరు తూర్పు..గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలు ఉన్నాయి. గుంటూరు నగర టీడీపీ అధ్యక్షుడిగా డేగల ప్రభాకర్ కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో తూర్పు సెగ్మెంట్‌ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిన నసీర్‌ అహ్మదే .. అక్కడ పార్టీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. నసీర్‌ అహ్మద్‌కు డేగల ప్రభాకర్‌కు అస్సలు పడటం లేదట. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేంతగా విభేదాలు వచ్చినట్టు చెబుతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. కొంతకాలంగా సొంత ప్రచారం కోసం ఇద్దరూ పోటీ పడుతున్నారు. ఆ క్రమంలోనే గ్రూపులు పుట్టుకొచ్చాయి.

ఆ మధ్య టీడీపీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా.. గుంటూరులో చేపట్టిన పార్టీ కార్యక్రమాలు ఇద్దరి మధ్య ఆధితప్య పోరుకు దారితీశాయి. ఏకంగా ఫోన్లు చేసుకుని నువ్వెంత అంటే నువ్వెంత అని దూషించుకున్నారట. నా ఏరియాలో నీ ఫొటోకానీ.. ఫ్లెక్సీ కానీ కనిపిస్తే మర్యాద దక్కదు అని వార్నింగ్‌ ఇచ్చుకున్నారట. ఆ తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో నసీర్‌ అహ్మద్‌, డేగల ప్రభాకర్‌ కలిసి పాల్గొన్నా.. వాళ్ల మధ్య సఖ్యత లేదని తెలుగు తమ్ముళ్లు ఇట్టే కనిపెట్టేస్తున్నారట.

తూర్పు ఇంఛార్జ్‌ నసీర్‌ అహ్మద్‌ తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని.. కరివేపాకులా తీసి పడేస్తున్నారని రగలిపోతున్నారట డేగల ప్రభాకర్‌. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని అనుకున్నారో ఏమో.. సమస్యను తేల్చాలని టీడీపీ పెద్దల దగ్గర పంచాయితీ పెట్టారట ప్రభాకర్‌. తూర్పులో చేపట్టే పార్టీ కార్యక్రమాలకు తాను హాజరు కాబోనని కీలక నాయకులకు చెప్పేశారట సిటీ టీడీపీ ప్రెసిడెంట్‌. ఈ విషయం తెలిసిన వెంటనే నసీర్‌ అహ్మద్‌ కూడా కౌంటర్లు మొదలుపెట్టారు. ప్రభాకర్‌ చేపట్టే కార్యక్రమాలకు ఎవరూ వెళ్లొద్దని తన వర్గానికి స్పష్టం చేశారట. కానీ.. పార్టీ కోసం పని చేసే తెలుగు తమ్ముళ్లు మాత్రం.. ఎవరి మాట వినాలో.. ఎవరి దగ్గరకు వెళ్తే ఏమౌతుందో అనే ఆందోళనలో ఉన్నారట. అసలే అధికారానికి దూరమై అష్టకష్టాలు పడుతున్న తరుణంలో ఈ గ్రూప్‌ ఫైట్‌ ఏంటని ప్రశ్నలు సంధిస్తున్నారట. చంద్రబాబు ఏమన్నా వీళ్లిద్దరికి ఆస్తులు పంచినట్టుగా గుంటూరును పంచారా? ఫ్లెక్సీల కోసం పార్టీ పరువు తీయడం ఏంటీ అని కేడర్‌ కూడా టీడీపీ పెద్దలకు కంప్లయింట్ చేశారట.

సమస్య తీవ్రతను గుర్తించిన టీడీపీ పెద్దలు ఇద్దరు నాయకులకు వార్నింగ్‌ ఇచ్చినా.. ఉపయోగం లేకుండా పోయిందనేది తాజా టాక్‌. దీంతో కీలక నగరంలో పార్టీని గాడిలో పెట్టేందుకు టీడీపీ పెద్దలు ఎప్పుడు చొరవ తీసుకుంటారో అని ఎదురు చూస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.

Exit mobile version