NTV Telugu Site icon

ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ లో గ్రూప్ వార్..ఎమ్మెల్యేకు సీనియర్లు చెక్ ?

Whatsapp Image 2022 05 14 At 10.35.06 Am (3)

Whatsapp Image 2022 05 14 At 10.35.06 Am (3)

బోథ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ కు వ్యతిరేఖవర్గం ఈమధ్య యాక్టివిటీ బాగా పెంచేసిందంటా..చోటా మోటా లీడర్లను ముందు పెట్టి టికెట్ ఆశించే నేతలు పెద్ద గేమ్ మొదలెట్టారన్న చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా పలానా అభివృద్ది లేదా మంజూరు మాజీ ఎంపీ వల్లనే అయిందంటూ పోస్టులు టిఆర్ఎస్ పార్టీ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుండగా, ఎమ్మెల్యే వర్గం దానికి కౌంటరిస్తోంది. అంతేకాదు ఫోటోలు ,దానికింద ఇంత మ్యాటర్ సైతం పెట్టేస్తున్నారు. ఇలాంటివన్నీ అక్కడ నిత్యకృత్యమే. బోథ్ ఎంపిపీ అయితే ఎమ్మెల్యే,ఆయన వర్గంపై బాహాటంగానే కామెంట్స్ చేస్తుండడం రచ్చ రాజేస్తోంది. ఇక్కడ మాజీ ఎంపి నగేష్ ముందు నుంచి గ్రూప్ వార్ ప్రోత్సహిస్తున్నారు. నియోజకవర్గంలో ఎవ్వరికి వారే యమునా తీరే అన్నట్టుగా పార్టీ ముఠా గొడవలతో గుదిబండగా మారిందనే చర్చ క్యాడర్ లోసాగుతోంది. ఆ వర్గంకు టికెట్ ఈసారి డౌటే అంటూ ప్రచారం ఎక్కువ చేస్తుండగా సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గం రివర్స్ కౌంటరిస్తోంది. ఇక్కడ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అధికార పార్టీలోని సొంత నియోజకవర్గంతోపాటు జిల్లాలోని సీనియర్ నాయకులు సైతం ఒక్కటౌతున్నారన్న మాటలు వినపడుతున్నాయి.

ఇక ఆదిలాబాద్ నియోజకవర్గంలో సైతం రెండు మూడు గ్రూప్ లు. కొంతమంది అయితే సర్వేల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రాఫ్ తగ్గిందనే ప్రచారం సైతం వైరల్ చేస్తున్నారు. పలానా నేత అక్రమాలు…అధికార పార్టీలో కొందరి గుత్తపెత్తనంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు సొంత పార్టీ నేతలు. దీనికి తోడు టికెట్ తమకే అంటూ ఓ వర్గం ఇప్పటికే నియోజకవర్గం చుట్టేసి వస్తోంది. లోపాలు, లేదా తప్పులు మరీ లేదంటే అధికార పార్టీ నేతల అక్రమాలపై ప్రతిపక్షాలు కాస్త ప్రశ్నిస్తున్నా.. సొంత పార్టీ వాళ్లే కొంతమంది విపక్షం తరహాలో చిట్టా విప్పుతున్నారు

ఇక ఖానాపూర్ ,ఆసిఫాబాద్ నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వు నియోజకవర్గాలు కాగా, మేమున్నామంటూ కొత్తకొత్త వ్యక్తులు ప్రచారం షురు చేస్తున్నారు. ఆసిఫాభాద్ లో ఆదినుంచి జడ్పీ చైర్మన్ కోవా లక్ష్మి వర్సెస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుగా మారిపోగా, తనకు సైతం టికెట్ వస్తోందంటూ రవాణా శాఖలో పనిచేసే ఓ అధికారి, ఏకంగా విందు రాజకీయాలకు తెరలేపారు. నియోజకవర్గంలో విసృతంగా పర్యటిస్తూ మేమున్నాం..బరిలో ఉంటామంటూ చెప్పుకొంటున్నారు. ఖానాపూర్ లో సైతం జడ్పి చైర్మన్ రాథోడ్ జనార్థన్ ,ఎమ్మెల్యే రేఖానాయక్ మద్య ఆధిపత్య పోరు పీక్స్ కు చేరిందన్న మాటలు వినిపిస్తున్నాయి..

నిర్మల్ ,మంచిర్యాల,బెల్లంపల్లి,సిర్పూర్ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీ నేతలతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నువ్వానేనా అన్నట్టుగా ఉంటే, మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం సొంత పార్టీ నేతల పర్యటనలు,ప్రచారాలు రచ్చ రాజేస్తున్నాయి. ఏది ఏమైనా స్వపక్షంలో విపక్షంతో ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ఈ ముఠా తగాదాలపై అధిష్టానం ఓ కన్నేసిందన్న పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఆఖరికి వీరి మద్య వైరం పార్టీకి నష్టమే గాక, పక్కపార్టీలకు లాభం చేకూరేలా ఉందనే అభిప్రాయాలు లేకపోలేదని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. హైకమాండ్ రంగంలోకి దిగేలోపు, వీరి పోరు ఎటు టర్న్ తీసుకుంటుందో చూడాలి.