Site icon NTV Telugu

GHMC బీజేపీ కార్పొరేటర్ల ఓవర్ యాక్షన్..డబ్బు కోసం బెదిరింపులు

Over Action

Over Action

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో బీజేపీ నుంచి 48 కార్పొరేటర్లు గెలిచారు. గతంతో పోల్చితే ఈ సంఖ్య ఎక్కువే. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా.. ఆనాడు టికెట్లు ఇచ్చింది పార్టీ. అప్పుడు కొత్తగా బీజేపీ కండువా కప్పుకొన్నవాళ్లూ GHMC ఎన్నికల్లో కార్పొరేటర్లు అయ్యారు. దీంతో హైదరాబాద్‌లో బీజేపీ బలపడటానికి అవకాశాలు ఉన్నాయని కమలనాథులు లెక్కలేసుకుంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కొందరు కార్పొరేటర్లు చేస్తున్న పనులు అసలుకే ఎసరు పెట్టేలా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారట నాయకులు.

వాస్తవానికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంటే ఇటీవల కాలంలో అర్థం మారిపోయింది. చిన్న చిన్న పనులకు కూడా కొందరు డబ్బులు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. కొన్నిచోట్ల ఇలాంటి ఘటనలు రచ్చ అవుతున్నాయి కూడా. ఏదైనా పర్మిషన్‌ కావాలంటే అక్కడి కౌన్సిలర్‌ లేదా కార్పొరేటర్‌కు ఎంతో కొంత సమర్పించుకోవాలని కథలు కథలుగా చెప్పుకొంటారు లోకల్‌ జనం. ఈ జాబితాలో బీజేపీ కార్పొరేటర్లు కూడా చేరడంతో ఉలిక్కి పడుతున్నారట పార్టీ నేతలు. నగరంలో కొత్త భవన నిర్మాణాలు జరుగుతుంటే కార్పొరేటర్లో.. లేక వారి మనుషులో అక్కడ వాలిపోతున్నారట. వాటిపై పార్టీ ఆఫీసుకు ఫిర్యాదులు వస్తున్నాయట. ఇలాగే ఉపేక్షిస్తే క్షేత్రస్థాయిలో బీజేపీ డ్యామేజీ తప్పదని.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం పడుతుందని టెన్షన్‌ పడుతున్నారట నాయకులు.

ఇటీవల GHMCకి చెందిన బీజేపీ కార్పొరేటర్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో సమావేశం అయ్యారు. అప్పటికే కొందరు కార్పొరేటర్ల చిలక్కొట్టుడుపై సమాచారం అందడంతో.. మీటింగ్‌లో సీరియస్‌ అయ్యారట కిషన్‌రెడ్డి. ఎవరో ఇల్లు కట్టుకుంటుంటే అక్కడికి వెళ్లి ఎందుకు డబ్బులు అడుగుతున్నారని నేరుగా ప్రశ్నించారట. మీతోపాటు.. పార్టీ కూడా బద్నాం అవుతుందని.. ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయని కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారట. పద్ధతి మార్చుకోవాలని.. గట్టిగానే తలంటినట్టు సమాచారం.

ఇన్నాళ్లూ బీజేపీ కార్పొరేటర్లకు ఎలా చెప్పాలా అని పార్టీ నేతలు తలపట్టుకున్నారట. ఇప్పుడు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డే ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని.. ప్రస్తావించడంతో కొంత రిలాక్స్‌ అయ్యారట నాయకులు. అయితే కిషన్‌రెడ్డి హెచ్చరికలు కార్పొరేటర్లపై పనిచేస్తాయా? వారిలో మార్పు వస్తుందా అన్నది అనుమానంగానే ఉందట. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తేనే రాజకీయ క్షేత్రంలో నిలుస్తామని మరికొందరు నేతలు హితవు పలుకుతున్నారట. ఇక్కడ ఇంకో గమ్మత్తు ఉంది. GHMC ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పోటీ చేసిన వారిని.. ఆ తర్వాత గెలిచిన వాళ్లతోనూ అవినీతికి పాల్పడబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రమాణం చేయించారు. అయినప్పటికీ.. కొందరు బీజేపీ కార్పొరేటర్లు చిలక్కొట్టుడు షురూ చేయడం చర్చగా మారింది.

Exit mobile version