Site icon NTV Telugu

Singareni : కమ్యూనిస్టులతో ఫ్రెండ్ షిప్ కుదిరిందా..? సింగరేణిలో ఎర్ర గులాబీలు విరబూస్తాయా..?

Singareni

Singareni

మునుగోడు ఉపఎన్నిక వేళ కమ్యూనిస్ట్‌లతో అధికారపార్టీకి దోస్తీ కుదిరింది. ఈ ఫ్రెండ్‌షిప్‌ ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుందా? కీలకమైన సింగరేణి బెల్ట్‌లో ఎర్రగులాబీలు విరబూస్తాయా? గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కీలక పరిణామాలు తప్పవా?

సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. నిన్నటి వరకు టీఆర్ఎస్‌ అనుబంధ TBGKSపై సీపీఐకి చెందిన AITUC తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేసింది. కానీ.. మునుగోడు ఉపఎన్నిక బ్యాక్‌డ్రాప్‌లో TRSకు CPI మద్దతు ప్రకటించింది. దాంతో ఆ ఎఫెక్ట్‌ సింగరేణి కార్మిక ఎన్నికలపైనా ప్రభావం చూపిస్తుందని టాక్‌. సింగరేణి ఎన్నికల వేడి దాదాపు ఐదు జిల్లాల్లోని 12 నియోజకవర్గాలపై ఉంటుంది. అక్కడ సాధారణ ఎన్నికల్లోనూ పొత్తులు.. ఎత్తులు కీలకంగా మారతాయి. అందుకే మారిన పరిణామాలు ఎటు దారితీస్తాయోననే చర్చ సాగుతోంది.

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను TBGKS నెరవేర్చలేదని ఇతర సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. సమయం గడిచిపోయినా ఎన్నికలు జరపడం లేదని విరుచుకుపడుతున్నాయి. అయితే బీజేపీని అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌తో భవిష్యత్‌లోనూ మైత్రి ఉంటుందని CPI చెప్పడంతో AITUC కూడా ఆ లైన్‌లో వెళ్తుందనే వాదన ఉంది. సింగరేణిలో పొత్తులపై రెండు పక్షాలు ప్రకటించకపోయినా.. మునుగోడు పొత్తుల సీనే ఉంటుందని కార్మికులు అభిప్రాయపడుతున్నారట. గత రెండు దఫాలుగా TBGKS గెలుస్తుంటే.. ప్రధాన ప్రత్యర్థిగా AITUC నిలుస్తోంది. 2017లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున TBGKSకు మద్దతుగా ప్రచారం చేశాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కీలక పాత్ర పోషించారు.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల పరిధిలోని 11 సింగరేణి డివిజన్లలో 9 చోట్ల TBGKS, రెండుచోట్ల AITUC గెలుచుకున్నాయి. ఇంకోవైపు సింగరేణిలో పాగా వేయాలని బీజేపీ, కాంగ్రెస్‌ అనుబంధ కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నాయి. ఈ తరుణంలో కోల్‌ బెల్ట్‌లో టీఆర్ఎస్‌, కమ్యూనిస్ట్‌లు ఐక్యంగా పోటీ చేయడం సాధ్యమేనా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. సింగరేణిలో ఇప్పటి వరకు ఆరుసార్లు ఎన్నికలు జరిగితే అందులో మూడుసార్లు AITUC, రెండుసార్లు TBGKS పాగా వేశాయి. ఒకసారి INTUC గెలిచింది.

మారిన రాజకీయ పరిస్థితుల్లో ఏ క్షణంలోనైనా సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతాయని అనుకుంటున్నారు. రెండు పక్షాలకు చెందిన పార్టీ నేతలు ఒక మాట అనుకుని కలిసి సాగితే సింగరేణి ఎన్నికలు ఏకపక్షమే అన్నది కోల్‌బెల్ట్‌లో వినిపిస్తున్న మాట. అయితే అధికార పార్టీ అనుబంధ సంఘంపై కార్మికుల్లో వ్యతిరేకత ఉందని భయపడుతున్న AITUC తమపై కూడా ప్రభావం పడుతుందనే ఆందోళనలో ఉందట. అందుకే కొంత తటపటాయిస్తున్నట్టు సమాచారం. మరి.. పొత్తుల దిశగా రెండు పార్టీల ఆలోచనలు ఆచరణలోకి వస్తాయో లేదో చూడాలి.

Exit mobile version