Site icon NTV Telugu

టీడీపీలోకి మాజీ మంత్రి రావెల రీఎంట్రీ ?

Raramani

Raramani

ప్రత్తిపాడులో టీడీపీకి ఇంఛార్జ్‌ కరువు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఐదు ఎన్నికల్లో టీడీపీ నుంచి మాకినేని పెదరత్తయ్య గెలిచారు. 2009లో ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్డ్‌గా మారింది. ప్రస్తుతం ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన మేకతోటి సుచరిత ఉన్నారు. టీడీపీ ఓడినా ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది. నియోజకవర్గంలోని కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో తమ్ముళ్లదే హవా. ప్రత్తిపాడు మండలంలో వైసీపీ నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉంది. గుంటూరు రూరల్‌లోనే టీడీపీ బలహీనం. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌.. తర్వాత వైసీపీలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ప్రత్తిపాడు టీడీపీ నాయకుడి లేని నియోజకవర్గంగా మారిపోయింది.

ఇంఛార్జ్‌ నియామకంపై టీడీపీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. ఏకాభిప్రాయం రాకపోవడంతో ఎంపిక కొలిక్కి రావడం లేదట. దీంతో మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్యను సమన్వయకర్తగా నియమించారు. అయితే ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం కావడంతో ముందుగానే ఇంఛార్జ్‌ను నియమిస్తే ఎన్నికల నాటికి పార్టీ బలం పుంజుకుంటుందనేది కేడర్‌ వాదన. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంఛార్జ్‌ లేకపోయినా కార్యకర్తలు వైసీపీకి గట్టిపోటీనే ఇచ్చారు. గతంలో ప్రత్తిపాడులో పోటీ చేసిన కందుకూరి వీరయ్య పేరుపై చర్చ జరిగిందట. అయితే వీరయ్య తన ఆర్ధిక పరిస్థితి గురించి నాయకులకు చెప్పినట్టు సమాచారం. పార్టీ సహకరిస్తే పోటీ చెయ్యడానికి సిద్దమని ఆయన చెప్పారట.

రావెల మళ్లీ టీడీపీలోకి వస్తారని ప్రచారం చంద్రబాబుతో రావెల భేటీ?2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి మంత్రిగా చేసిన రావెల కిశోర్‌బాబు పేరు సడెన్‌గా పార్టీలో చర్చకు వస్తోంది. గతంలో జిల్లా టీడీపీ నేతలతో విబేధాలు రావడంతో ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ కండువా కప్పుకొన్నారు. అయితే రావెల మళ్లీ టీడీపీలోకి వస్తారన్న ప్రచారం జోరందకుంది. కొంతమంది టీడీపీ నేతలతో రావెల టచ్‌లో ఉన్నట్టు సమాచారం. నియోజకవర్గంలోని కొందరు మండలస్థాయి టీడీపీ నేతలు కూడా రావెల రీఎంట్రీకి సానుకూలంగా ఉన్నారట. వ్యతిరేకత కూడా ఉందట. ఇదే సమయంలో చంద్రబాబుతో రావెల భేటీ అయినట్టు ప్రచారం గుప్పుమంది. ప్రత్తిపాడు నేతలు రావెల విషయాన్ని చంద్రబాబు దగ్గర ప్రస్తావించినప్పుడు ఆయన చూద్దామని సమాధానం ఇచ్చారట. రావెల రీఎంట్రీ ఖాయమైతే ఆయనే ప్రత్తిపాడు ఇంఛార్జ్‌గా రావొచ్చని చెవులు కొరుక్కుంటున్నారట తమ్ముళ్లు.

Exit mobile version