NTV Telugu Site icon

ఉరవకొండలో ఫ్లెక్సీల రగడ..వివాదాల్లో పోలీసులు

Teragabada Bomma

Teragabada Bomma

అనంతపురం జిల్లా రాజకీయాల్లో తరచూ హైటెన్షన్ ఏర్పడే నియోజకవర్గాల్లో ఉరవకొండ కూడా ఒకటి. అదేదో ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య వార్‌తోనే కాదు. అధికార వైసీపీలో ఉన్న గ్రూపులతోనే తరచూ ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుంటాయి. కానీ ఈసారి సీన్ మారింది. ఒక చిన్న ఫ్లెక్సీ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మధ్య పెద్ద వార్‌కు దారితీసింది. కాకపోతే ఇక్కడ ఫ్లెక్సీలు కట్టింది వైసీపీ నేతలు. ఆ ఫ్లెక్సీలలో ఉన్నది వైసీపీ నేతలే. మాజీ ఎమ్మెల్యే విశ్వ కుమారుడు ప్రణయ్‌రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఫ్రైజ్ డిస్ట్రిబ్యూషన్‌కు ఎస్పీ ఫకీరప్పను ఆహ్వానించారు.

అసలు సినిమా ఆ తర్వాతే స్టార్ట్ అయింది. తమ నాయకుని దృష్టిలో పడేందుకు కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రణయ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వ ఫొటోలతో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి ఎస్పీ వస్తుండటంతో వైసీపీ నేతలతోపాటు పోలీసుల ఫొటోలు కలగలిపి ఫ్లెక్సీలు పెట్టారు. అందులో జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఫొటో కూడా ఉంది. నాయకులే సొంతంగా ఆలోచన చేశారో లేక ఎవరి ఆదేశాల మేరకు పోలీసుల ఫొటోలు పెట్టారో కానీ.. నేతల కాళ్ల కింద కొందరు పోలీస్‌ అధికారుల ఫొటోలు వచ్చేలా చేశారు. వాటిని ఉరవకొండ అంతా పరిచేశారు. వీటిని లోకల్‌ టీడీపీ నేతలు మీడియా ముందు ప్రశ్నించడంతో రచ్చ స్టార్ట్‌ అయింది.

అసలే ఉరవకొండలో పయ్యావుల, విశ్వేశ్వర్‌రెడ్డి మధ్య తరతరాల వివాదాలు అన్నట్టు ఉంటాయి. దొరికిన అవకాశాన్ని టీడీపీ వాడేయడం మొదలుపెట్టింది. తమకు సహకరించకుండా.. తమ పార్టీ నేతల మీద కేసులు పెడుతున్న పోలీసులను కూడా వైసీపీతో కలిపేసి చాకిరేవు పెట్టింది. వివాదాలు పరిష్కరించే పోలీసులే వివాదాల్లో చిక్కుకున్నారు. పోలీసులు, వైసీపీ నాయకులు కలిసిపోయారని విమర్శలు చేశారు టీడీపీ నేతలు. ఈ విషయంతో తమకు సంబంధం లేదని పోలీసులు మొత్తుకున్నా.. రాజకీయ నాయకులు వారి పని వారు కానిచ్చేశారు. ఈ గొడవ చూశాక.. బహుమతుల ప్రధానోత్సవానికి ఎస్పీ ఫకీరప్ప రాలేదు.

ఈ ఫ్లెక్సీలపై పోలీస్‌ అధికారులు సమాధానం చెప్పాలంటూ పయ్యావుల డిమాండ్‌ చేశారు. రిలయెన్స్‌ కేసుల్లో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే విశ్వతో ఎస్పీ ఎలా వేదిక పంచుకుంటారని ఆయన ప్రశ్నించారు. దీంతో ఫ్లెక్సీల వ్యవహారం పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. అయితే ఎమ్మెల్యే పయ్యావులవి.. బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలని.. ఆయన సోదరుడు హత్య కేసుల్లో ఉన్నారని విశ్వ అటాక్‌ షురూ చేశారు. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేందుకు మీడియా ముందుకొచ్చారు నాయకులు. మొత్తంగా ఈ ఘటనలో పోలీసులు కార్నర్‌ అయ్యారు. విమర్శల హీట్‌ పెరగడంతో.. పోలీసులు విచారణ మొదలుపెట్టారట. మొత్తానికి వైసీపీలో కొందరు అత్యుత్సాహం పెద్ద రచ్చకే దారితీసింది.