అక్కడి అధికారపార్టీలో ముసలం పుట్టింది. ఇద్దరు కీలక ప్రజాప్రతినిధుల ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. నియోజకవర్గంలో పట్టుకోసం ఒకరు.. పట్టుసడలకుండా మరొకరు రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. వారెవరో.. ఏం చేస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం
టికెట్ కోసం ఇప్పటి నుంచే ఎత్తుగడలు!
గద్వాల. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నడిగడ్డగా పిలవబడే ప్రాంతం. అక్కడి రాజకీయం ఓ పట్టాన అంతుబట్టదు. రాష్ట్ర రాజకీయం అంతా ఒకలా ఉంటే గద్వాల పాలిటిక్స్ మరోలా ఉంటాయి. ఏదో ఒక రాజకీయ రగడ కామన్. గతంలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలేవి. ఇప్పుడు ట్రెండ్ మారింది. అధికారపార్టీ నేతలే ఒకరిపై ఒకరు పైచెయ్యి సాధించేందుకు ఓ రేంజ్‌లో పావులు కదుపుతున్నారు. రెండేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో టికెట్ సాధించే లక్ష్యంతో వేస్తున్న ఎత్తుగడలు గద్వాల టీఆర్‌ఎస్‌ను హీటెక్కిస్తున్నాయి.
ఎమ్మెల్యే వర్సెస్ జడీ ఛైర్‌పర్సన్!
ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి.. జడ్పీ ఛైర్‌పర్సన్ సరితా తిరుపతయ్యల మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరాయి. ఇటీవల ఓ సీఐతో జడ్పీ ఛైర్‌పర్సన్ భర్త తిరుపతయ్య మాట్లాడినట్టు చెబుతున్న ఆడియో వైరల్ కావడంతో గొడవలు పీక్‌కు వెళ్లాయట. ఎమ్మెల్యేను ఉద్దేశించి ఆ ఆడియోలో చేసిన కామెంట్స్ టీఆర్‌ఎస్ వర్గపోరును తెలియజేస్తున్నాయి. జడ్పీ ఛైర్‌పర్సన్‌గా తిరుపతయ్య భార్య సరిత ఉన్నప్పటికీ పెత్తనమంతా భర్తదే అన్నది ఓపెన్ టాక్. స్థానికంగా పార్టీ వ్యవహారాల పర్యవేక్షణంతా ఆయనదే. పైగా గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాల్లో పట్టుకోసం జిల్లాస్థాయి అధికారులపై పెత్తనం చేస్తున్నట్టు టీఆర్‌ఎస్‌లో వినిపిస్తున్న మాట. ఈ సందర్భంగానే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డితో తిరుపతయ్య వర్గానికి పడటం లేదట.
తిరుపతయ్య వర్గం ప్రచారంపై ఎమ్మెల్యే గుర్రు!
ఇటీవల కాలంలో తిరుపతయ్య దంపతులు గద్వాల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ సాధించే దిశగా జడ్పీ ఛైర్‌పర్సన్ అండ్ కో ప్రత్యేకంగా ఓ వర్గాన్ని సిద్ధం చేసుకుంటున్నట్టు ఎమ్మెల్యే శిబిరం అనుమానిస్తోంది. ముఖ్యంగా తన వ్యతిరేక శిబిరంతో జట్టు కడుతున్నారని కృష్ణమోహన్ గుర్రుగా ఉన్నారట. ఓ మంత్రి అండ.. పార్టీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయని జడ్పీ ఛైర్‌పర్సన్ దంపతులు చెబుతున్నట్టు ఎమ్మెల్యే దృష్టికి వచ్చిందట. ఇక లాభం లేదని అనుకున్నారో ఏమో.. ఎమ్మెల్యే కృష్ణమోహన్ సైతం తన వర్గంలో సరిత దంపతులపై కౌంటర్ అటాక్ మొదలుపెట్టించారట. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ విమర్శల పరిధి దాటి.. వార్నింగ్‌ల వరకు వెళ్లిందట.
వైరిపక్షాల్లా మారిన అధికాపార్టీ నేతలు!
నిన్న మొన్నటి వరకు కామ్‌గా ఉన్న గద్వాల టీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్‌పర్సన్ వర్గాల మధ్య రాజుకుంటున్న ఆధిపత్య పోరు ఏ మలుపు తీసుకుంటుందో కేడర్‌కు అర్థం కావడం లేదు. ఒకే పార్టీలో కొనసాగుతున్నా.. రెండు వర్గాలు ఒకరినొకరు వైరిపక్షాలుగా చూసుకుంటున్నాయి. ఇప్పటికే గద్వాల పోరును పార్టీ హైకమాండ్ దృష్టికి కొందరు తీసుకెళ్లారట. త్వరలో పార్టీ పెద్దలు జిల్లాకు వస్తుండటంతో వారే పరిష్కారం సూచిస్తారని అనుకుంటున్నారు. అప్పటి వరకు ఈ వర్గపోరు ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి.
