Site icon NTV Telugu

Congress : ఆ పార్టీలో ఎవరు ఏం చెప్పిన తాము చెయ్యాల్సిందే చేస్తారా.?

New Project (66)

New Project (66)

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరిని చేర్చుకోవాలి? ఎవరికి నో చెప్పాలి అనేదానిపై క్లారిటీ ఇచ్చేందుకు కమిటీ వేసింది పార్టీ. సీనియర్ నేత జానారెడ్డి ఆ చేరికల కమిటీకి ఛైర్మన్‌. ఎవరైనా కాంగ్రెస్‌లో చేరతానని ముందుకొస్తే.. కమిటీలో చర్చించి.. స్థానిక నాయకత్వంతో మాట్లాడతారు. ఏ మూహూర్తాన జనారెడ్డి కమిటీని వేశారో కానీ.. కాంగ్రెస్‌లో చేరుతున్న వారి గురించి ఆ కమిటీకి సమచారమే లేదు. చర్చల్లేవ్‌.. చర్చించడాలు లేవు. ప్రస్తుతం ఇదే పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

మంచిర్యాల నుంచి TRS మాజీ ఎమ్మెల్యే ఒదేలు.. ఆయన సతీమణి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ కండువా కప్పేసుకున్నారు. ఈ చేరికపై జానారెడ్డి కమిటీకి సమాచారం లేదు. తాజాగా ఖైరతాబాద్ టీఆర్ఎస్‌ కార్పొరేటర్ విజయారెడ్డి సైతం పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ నెల 23న కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటించేశారు కూడా. దీంతో చేరికల కమిటీలో చర్చ చేయకుండా ఎలా చేర్చుకుంటారనే ప్రశ్న పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఓదేలు ఆయన సతీమణి చేరిక నేరుగా.. ప్రియాంకగాంధీ సమక్షంలో కావడంతో నాయకులు కొంత సైలెంట్‌గా ఉన్నారు. విజయారెడ్డి ఎపిసోడే రచ్చ అవుతోందట.

అధికారపార్టీ నుంచి నేతలు వస్తుంటే.. కమిటీలో చర్చ చేసి.. ఒకే చెప్పే లోపల టీఆర్‌ఎస్‌ నుంచి ఒత్తిళ్లు పెరిగి జాయినింగ్స్‌కు బ్రేకులు పడుతున్నాయనేది రేవంత్‌ వర్గం వాదనగా ఉందట. పైగా చేరికలతో కాంగ్రెస్‌కు బలం చేకూరుతుంది అనుకుంటే ఇబ్బంది ఏంటన్నది ప్రశ్న. అయితే విజయారెడ్డి చేరికను ఆ కోణంలో చూడలేమన్నది గాంధీభవన్‌ వర్గాల వాదన. గ్రేటర్ హైద్రాబాద్‌లో పార్టీ ఉన్నదే అంతంత మాత్రం. ఉన్న దాంట్లో కూడా గ్రూపు తగాదాలే. కొత్తగా వచ్చేవాళ్లతో ఆ అగ్గికి ఆజ్యం పోసినట్టు అవుతోందట.

ఖైరతాబాద్‌ నుంచి 2018 ఎన్నికల్లో ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌ పోటీ చేసి ఓడిపోయారు. నియోజకవర్గం ఇంఛార్జిగా దాసోజు పని చేసుకుంటున్నారు కూడా. అయితే 2018కంటే ముందు ఖైరతాబాద్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు మరో కాంగ్రెస్‌ నేత రోహిన్‌రెడ్డి. 2018 ఎన్నికల్లోనే టికెట్ కోసం రోహిన్‌రెడ్డి ఆందోళనలు చేశారు. ప్రస్తుతం శ్రావణ్‌, రోహిన్‌రెడ్డిల మధ్య సఖ్యత లేదు. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ అయ్యాక రోహిన్‌రెడ్డి యాక్టివ్‌ అయ్యారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ సభ్యత్వం నమోదు కార్యక్రమానికి ఆయన్ను ఇంఛార్జ్‌గా చేశారు. పనిలో పనిగా ఖైరతాబాద్‌లోనూ ఉనికి చాటుకొనే పనిలో పడ్డారు. వీరిద్దరి పంచాయితీ తీర్చేది ఎలా అని చర్చ సాగుతున్న సమయంలోనే పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి ఎంట్రీ మరింత కలకలం రేపుతోంది.

ఖైరతాబాద్‌లో PJR ప్రభావం ఉందనేది కాంగ్రెస్‌ వర్గాల వాదన. కార్పొరేటర్‌గా ఉండటం.. పీజేఆర్‌ కుమార్తె కావడంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ విజయారెడ్డికే అనే ప్రచారం మొదలుపెట్టేశారు. ఆమె కూడా టీఆర్‌ఎస్‌లో ఖైరతాబాద్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డారు. గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఉన్నారు విజయారెడ్డి. అయితే ఖైరతాబాద్‌ టికెట్‌ ఇస్తానని మాటిచ్చే రేవంత్‌ ఆమెను కాంగ్రెస్‌ చేర్చుకుంటున్నారా? అదే నిజమైతే దాసోజు శ్రావణ్‌, రోహిన్‌రెడ్డిల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు ఉన్నాయి. చేరికలపై జానారెడ్డి కమిటీకి ముందుగా చెప్పి ఉంటే ఇలాంటి అంశాలపై దృష్టి పెడతారు కాదా అనేది కొందరి వాదన. ఎంతైనా కాంగ్రెస్‌ కదా.. చెప్పేదొకటి.. చేసేదొకటి అని చెవులు కొరుక్కుంటున్నాయి గాంధీభవన్‌ వర్గాలు.

 

 

Exit mobile version