Site icon NTV Telugu

Etela Rajender Sensational Comments : ఈటెల చెప్పిన ఆ నలుగురు బీజేపీ లో చేరుతారా ? కేసీఆర్ ఓడించాలనుకున్నది ఎవరిని ?

Etela Rajendra

Etela Rajendra

Etela Rajender Sensational Comments  : ఆ నలుగురు ఎవరు..? తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన అంశం ఇదే…! మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కామెంట్స్‌ తర్వాత.. పొలిటికల్‌ సర్కిళ్లలో వారి గురించి ఆరా తీస్తున్నారు. ఆ నలుగురు సైతం బీజేపీకి వస్తారని మరింత హైప్‌ పెంచడంతో.. ఈ ఎపిసోడ్ ఆసక్తిగా మారింది. ఇంతకీ ఎవరా నేతలు? ఏమా కథా?

టీఆర్ఎస్‌ అన్నా.. సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావించినా కస్సుమని లేస్తున్నారు మాజీ మంత్రి.. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. పదునైన విమర్శలు చేస్తున్నారు.. ఆరోపణల తీవ్రత పెంచారు. ఈ క్రమంలో ఈటల ప్రస్తావించిన కొన్ని అంశాలు ప్రస్తుతం చర్చగా మారాయి. 2018 ఎన్నికల్లో తాను టీఆర్ఎస్‌ నుంచి పోటీ చేసినా.. ఓడించడానికి సీఎం కేసీఆర్‌ ప్రయత్నించారని పదే పదే చెబుతూ వస్తున్నారు ఈటల. ఆ విషయంలో ఆయన వాదన ఆయనది. ఇటీవల దానిని రిపీట్ చేస్తూ.. కొత్త అంశాలను ఈటల ప్రస్తావించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తనతోపాటు మరికొందరు టీఆర్‌ఎస్‌ నేతలను సైతం ఓడించడానికి కేసీఆర్‌ ప్రయత్నించారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలే రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఆ కొందరు ఎవరు అనేది ఈటల చెప్పలేదు. కాకపోతే నలుగురు నేతలుగా తేలుస్తూ.. వాళ్ల పేర్లు చెప్పకుండా.. వాళ్ల జిల్లాల పేర్లు చెప్పి హింట్‌ ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్‌, ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన నాయకులుగా తెలిపారు ఈటల. దీంతో ఆ జిల్లాలోని టీఆర్ఎస్‌ నేతలు.. ప్రజాప్రతినిధులు.. ఓడిన నాయకుల జాబితాను దగ్గర పెట్టుకుని ఆరా తీస్తున్నారు రాజకీయాలపై ఆసక్తి ఉన్నవాళ్లు. ఆ నలుగురు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఈ అంశంలో ఎవరి ఊహాగానాలు వారివే. గుట్టు విప్పడానికి ఇది సరైన సమయం కాదని అనుకుంటున్నారో ఏమో.. తెర వెనక ఈటల గట్టి వ్యూహమే రచించినట్టు అనుమానిస్తున్నారట.

తెలంగాణ బీజేపీలో చేరికల కమిటీకి కన్వీనర్‌గా ఉన్నారు ఈటల రాజేందర్‌. టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులతో ఆయన టచ్‌లో ఉన్నారట. బీజేపీలో చేరాలని ఆహ్వానిస్తున్నారు. మాజీ మంత్రి తాజాగా చెప్పిన ఆ నలుగురు టీఆర్ఎస్‌ నేతలు సైతం ఈటలతో నిరంతరం మాట్లాడుతున్నారని.. వారితో ఆయనకు రిలేషన్స్‌ బలంగానే ఉన్నాయని తెలుస్తోంది. ఆ నలుగురు త్వరలో బీజేపీలోకి వస్తారని సంకేతాలు ఇస్తున్నారు ఈటల. విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతుండటంతో బీజేపీలోనూ చాలా మందికి వాళ్లెవరో తెలియదట. ఆ నలుగురు టీఆర్ఎస్‌లో ముఖ్య నేతలా? ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నారా లేరా? వారు బీజేపీలోకి వస్తే జరిగే పరిణామాలేంటి? చేరికల విషయంలో ఈటల సక్సెస్‌ అవుతారా.. లేదా? అని కాషాయ శిబిరంలో ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఒక్క బీజేపీలోనే కాదు.. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ శిబిరాల్లోనూ ఆ నలుగురిపై ఆసక్తికర చర్చ నడుస్తోందట. అధికారపార్టీ ఈటల వ్యాఖ్యలను కొట్టిపారేసినా.. ప్రైవేట్ సంభాషణల్లో మాత్రం గులాబీ నేతలు ఆరా తీస్తున్నారట. మరి.. ఈటల చెప్పినట్టు 2018లో అలా జరిగిందో లేదో కానీ.. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కిన తరుణంలో ఆయన వదలిన బాణాలు మాత్రం పెద్ద అలజడే రేపుతున్నాయి. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.

 

 

Exit mobile version