తెలుగుదేశం పార్టీలో కొత్తరక్తాన్ని నింపి వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తామని చంద్రబాబు, నారా లోకేష్‌లు మహానాడు వేదికగా చెప్పుకొచ్చారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఆ మాటలు ఎంతవరకు వర్తిస్తాయనేది ప్రస్తుతం తమ్ముళ్ల ప్రశ్న. వచ్చే ఎన్నికల్లో ఏలూరు ఎంపీ టికెట్ ఎవరికి ఇస్తారు? మాజీ ఎంపీ మాగంటి బాబు విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల్లో అతికష్టం మీద టికెట్ సంపాదించి గెలిచారు మాగంటి బాబు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. గత ఏడాది కుటుంబంలో వచ్చిన కుదుపులతో డీలా పడ్డారు మాగంటి బాబు. మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తాయన్న తొందరో.. ఆలస్యం చేస్తే ఇంకెవరైనా కర్చీఫ్ వేస్తారనే ఆందోళనో ఏమో.. ప్రత్యక్ష రాజకీయాలపై కొద్దిరోజుల క్రితం ఆయన ద్వారకా తిరుమలలో కీలక ప్రకటన చేశారు. యాక్టివ్ పాలిటిక్స్‌లో కొనసాగుతానన్నది ఆ స్టేట్‌మెంట్ సారాంశం. అప్పటి నుంచి ఏలూరు పార్లమెంట్ పరిధిలోని టీడీపీ శిబిరాల్లో ఒక్కటే చర్చ. బాబుకు మళ్లీ ఎంపీ టికెట్ ఇస్తారా? ఇస్తే పరిస్థితి ఏంటి అని ఆరాలు తీసేవారు ఎక్కువయ్యారు.
2019 ఎన్నికల్లోనే మాగంటి బాబుకు కాకుండా మరోనేతకు ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం సాగింది. చివరి నిమిషంలో ఆయనే పోటీలో నిలిచి ఓడిపోయారు. 2014లో ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటు పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలతో ఆయనకి అస్సలు కుదిరేది కాదు. ఎమ్మెల్యేలతో అంటిముట్టనట్టు ఉండటమే కాకుండా.. ఆయా నియోజకవర్గాల్లో కిందిస్థాయి కేడర్‌లో వర్గవిభేదాలను పెంచి పోషించారనే ఆరోపణలు మాగంటి బాబుపై ఉన్నాయి. పోలవరం, చింతలపూడి, కైకలూరుల్లో మాగంటి బాబు తీరువల్ల పార్టీకి చాలా నష్టం జరిగిందన్నది అక్కడ టీడీపీ నేతలు చెప్పేమాట. అలాంటిది ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటుతానని మాజీ ఎంపీ చెప్పడంతో లోకల్ తెలుగుదేశం నేతల్లో కాక రేపుతోందట.
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాగంటి బాబు ఏమయ్యారు అని ప్రశ్నలు సంధిస్తున్నారు పార్టీ నేతలు. పైగా ఎలక్షన్స్ తర్వాత వైసీపీ నేతలతో చర్చలు జరపడం వెనక ఆంతర్యం ఏంటని నిలదీస్తున్నారట. ఇప్పటి వరకూ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన మాజీ ఎంపీని ఇకపైనా దూరంగానే ఉంచడం మంచిదని అధిష్ఠానానికి సంకేతాలు పంపుతోందట కేడర్. వచ్చే ఎన్నికలను టీడీపీ కీలకంగా భావిస్తోంది. ఇలాంటి సమయంలో వర్గపోరును ప్రోత్సహించేవారిని అక్కున చేర్చుకున్నా.. ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా 2019 ఫలితమే రిపీట్ అవుతుందని ముఖం మీదే చెప్పేస్తున్నారట. టీడీపీలోని ఇతర నాయకుల ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా జాగ్రత్త పడాల్సింది అధిష్ఠానమేనని తేల్చేస్తున్నారట. ఇదే విషయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. చంద్రబాబు నుంచి క్లారిటీ తీసుకునే రంగంలోకి దిగాలని ఏలూరు పార్లమెంట్ పరధిలోని టీడీపీ నేతలు మాగంటి బాబుకు చెప్పకనే చెప్పేశారని చెవులు కొరుక్కుంటున్నారు.
ఇదే సమయంలో మాగంటి బాబు విషయంలో మరో చర్చ జరుగుతోంది. ఆయనకు ఈ దఫా ఎంపీ టికెట్ కాకుండా.. ఏలూరు పార్లమెంట్ పరిధిలోనే ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌కు టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే కొత్తరక్తంతో పార్టీని పరుగులు పెట్టిస్తామని చంద్రబాబు చెప్పడంతో మాగంటి బాబు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఒక ప్రశ్న. మరి.. మాగంటి బాబు రానున్న రోజుల్లో ఏం చేస్తారో చూడాలి.