Site icon NTV Telugu

BJP Goa Politics : కాషాయ శిబిరంలో గోవా మోడల్ ఫ్యామిలీ ప్యాక్ పై చర్చ

Bjp Goa

Bjp Goa

Discussion on Goa model family pack at BJP :

ఫ్యామిలీ ప్యాక్‌. ఇదేదో బిర్యానీ ఆర్డర్‌ కాదు..! తెలంగాణ బీజేపీ నేతల అంతర్గత చర్చల్లో ఇటీవల కాలంలో గట్టిగా వినిపిస్తున్న మాట. అక్కడెక్కడో అమలు చేసిన ఫార్ములాను.. ఇక్కడా ఇంప్లిమెంట్‌ చేస్తారని తెగ చెవులు కొరుక్కుంటున్నారు. బీజేపీలో చేరికలకు.. ఫ్యామిలీ ప్యాక్‌కు ముడి పెడుతున్నారట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.

తెలంగాణలో ఈ దఫా ఎలాగైనా కాషాయ జెండా ఎగరేయాలన్నదే బీజేపీ లక్ష్యం. ఇందుకోసం వేస్తున్న ఎత్తుగడలు అన్నీ ఇన్నీ కావు. అందుబాటులో ఉన్న అస్త్రశస్త్రాలన్నీ ప్రయోగిస్తోంది. అమ్ముల పొదిలోని ఒక్కో బాణాన్ని బయటకు వదులుతున్నారు కమలనాథులు. వీటిల్లో ఎన్ని వర్కవుట్‌ అవుతున్నాయి.. మరెన్ని గురి తప్పుతున్నాయి అనేది పక్కన పెడితే.. బీజేపీ నేతలు తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ కేడర్‌ను ఆలోచనలో పడేస్తున్నాయి. అదా వ్యూహం.. అలా జరిగిందా..? అయితే గెలుస్తామా..? అధికారంలోకి వస్తామా..? అని ముఖం పెద్దది చేసుకుని మరీ అడుగుతున్నారట. ప్రస్తుతం కాషాయ శిబిరంలో బాగా చర్చల్లో ఉన్న అంశం ఫ్యామిలీ ప్యాక్‌. విషయం తెలిసిన వాళ్లంతా తెగ ఆరా తీస్తున్నారట.

గోవా మోడల్‌కు..ఈ ఫ్యామిలీ ప్యాక్‌ దగ్గరగా ఉంటుందని సమాచారం. ఈ మోడల్‌ కోసం బీజేపీలో మొదటి నుంచి ఉన్న కొన్ని సంప్రదాయాలను కూడా పక్కన పెట్టేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో గెలవాలి.. అధికారంలోకి రావాలి. దానికి సంప్రదాయాలు అడ్డుగోడలుగా ఉంటే వాటిని కూలగొడదాం.. లేకపోతే గోడ దూకేద్దాం అన్నట్టుగా ఎత్తుగడలు వేస్తున్నారట. బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణలో పార్టీ పరిస్థితి.. రాజకీయ వాతావరణంపై సర్వే నిర్వహించింది. అక్కడ గమనించిన అంశాల ఆధారంగా ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. గెలిచే అవకాశం ఉన్న నాయకులకు గాలం వేయడం.. వారికే టికెట్‌ వేయడం ఇందులో మొదటిది. ఆ వ్యక్తి ఇంట్లో భార్య లేదా ఇంకెవరైనా కుటుంబసభ్యులు కూడా పోటీ చేసి గెలుస్తారంటే వారికీ బీజేపీ బీఫారం అందజేయడం రెండోది. ఇదే ఫ్యామిలీ ప్యాక్‌. ఆ మధ్య జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అమలు చేశారట. అది వర్కవుట్‌ కావడంతో.. తెలంగాణలోనూ ప్రయోగం చేయడానికి రెడీ అవుతున్నారు కమలనాథులు.

తెలంగాణలో చేరికలకు అడ్డు చెప్పొద్దని ఆ మధ్య కేంద్ర నాయకత్వం రాష్ట్ర నేతలకు స్పష్టంగా చెప్పేసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లా నుంచి కొందరు నాయకులు వచ్చి బీజేపీలో చేరతామంటే బీజేపీలో ఉన్నవాళ్లు అడ్డుకుంటున్నారని ప్రచారం జరిగింది. అలా వచ్చేవారిలో కొందరు కుటుంబ సభ్యులకు కూడా టికెట్‌ అడుగుతున్నారట. వారికి గెలిచే ఛాన్స్‌ ఉంటే మరో మాట మాట్లాడొద్దని చెబుతున్నారట. ఇప్పుడు గోవా మోడల్‌కు గేట్లు ఎత్తడంతో చేరికలు ఊపందుకుంటాయని.. అభ్యర్థులపై ముందుగానే స్పష్టత వస్తుందని లెక్కలేస్తున్నారట. ఒకవేళ టికెట్‌పై ఎవరికైనా సందేహాలుంటే వారిని ఒప్పించాలని.. కండువా కప్పేయాల్సిందేనని కుండబద్దలు కొట్టేస్తున్నారట. గెలుపు గుర్రాలకు టికెట్‌ ఇచ్చే విషయంలో ఎలాంటి మోహమాటాలకు ఆస్కారం లేదన్నది కేంద్ర నాయకత్వం చెప్పేమాట.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో గోవా సీఎంని.. మాజీ సీఎం కుమారుడిని పక్కన పెట్టేసింది. అలాగే అక్కడ గెలిచే అవకాశం ఉన్న నేతల ఇంట్లో రెండు మూడు టికెట్లు ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి. కులం, వర్గం అని లెక్కలేయకుండా గెలుస్తారు అంటే దానిని కొలమానంగా తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారట. మరి.. తెలంగాణలో గోవా మోడల్‌ ఫ్యామిలీ ప్యాక్‌ బీజేపీకి ఎంత వరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

 

 

Exit mobile version