Site icon NTV Telugu

Tadepalli YCP Politics :తాడేపల్లిలో పార్టీ నేతల అవినీతిపై వైసీపీ పెద్దలు ఫోకస్ పెట్టారా..?

Tadepalli

Tadepalli

Tadepalli YCP Politics : ఆ నియోజకవర్గంలో పార్టీ నేతలు చేస్తున్న అవినీతిపై తాడేపల్లిలోని వైసీపీ పెద్దలు ఫోకస్‌ పెట్టారా? నిఘా వర్గాల నుంచి సమాచారం తెప్పించుకున్నారా? త్వరలో యాక్షన్‌ పార్ట్‌ ఉంటుందా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఏమా కథా?

నెల్లూరు జిల్లా కోవూరు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఈ నియోజకవర్గంలో అధికారపార్టీ నేతల మధ్య అస్సలు పడటం లేదు. విభేదాలు రోజు రోజుకూ శ్రుతి మించుతున్నాయి. అవినీతి కట్టలు తెంచుకోవడం.. అక్రమార్జనలో ఒకరిని చూసి మరొకరు ఈర్ష్య పడటం కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. ఎమ్మెల్యే కన్నెర్ర చేసినా పార్టీ నేతలు హద్దుల్లో ఉండటం లేదట. ఈ అంశాలు తాడేపల్లి వరకు వెళ్లడం.. అక్కడ నుంచి ప్రత్యేక ఫోకస్‌ పెట్టడంతో కోవూరు వైసీపీలో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ పెరిగిపోతోంది.

కోవూరులో మట్టి, ఇసుక అక్రమ విక్రయాల ద్వారా పార్టీ నేతలు కొందరు బాగానే వెనకేసుకున్నారు. చూస్తుండగానే కోట్లకు పడగలెత్తిన వారు చాలామంది ఉన్నారు. ఈ అంశాలను తొలుత ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఆయన లైట్‌ తీసుకున్నారట. పైగా కోవూరు, కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం మండలాల బాధ్యతలను ఒక్కో నేతకు అప్పగించారు ప్రసన్న కుమార్‌రెడ్డి. అలా బాధ్యతలు చేపట్టిన నేతలు అవినీతి కార్యకలాపాల్లో చెలరేగినట్టు స్థానిక వైసీపీ వర్గాల్లోనే విమర్శలు ఉన్నాయి. కొడవలూరులో పార్టీ నేత చలపతిరావుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు. ప్రతిపనిలోనూ వాటాలు పెరిగిపోయాయని మండిపడుతున్నారు.

బుచ్చిరెడ్డి పాలెం పార్టీ నేత శ్రీనివాసరెడ్డిపై ఇదే విధంగా ఆరోపణలు ఉన్నాయి. మాట వినని రెవెన్యూ అధికారులనే బదిలీ చేయిస్తున్నారట. ఈ గొడవలు ఇలా ఉండగానే.. ఇందుకూరుపేట మండలంలో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదట్లో ఈ ప్రోగ్రామ్‌పై ఎమ్మెల్యే ఆసక్తి కనబర్చకపోయినా.. తర్వాత కాలు బయటపెట్టారు. ఎప్పటి నుంచో పార్టీలో జరుగుతున్న యవ్వారలపై గుర్రుగా ఉన్న వైసీపీ శ్రేణులు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డిని చూడగానే ఓపెన్‌ అయ్యాయి. రెండు వర్గాలుగా విడిపోయి ఆయన ఎదుట ఘర్షణ పడ్డారు. స్థానిక నేతల మధ్య ఆధిపత్యపోరు తీవ్రతకు ఘర్షణ అద్దం పట్టిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మండలాల్లో జరుగుతున్న అక్రమాలపై కోవూరుకు చెందిన కొందరు నేతలు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశారట. గతంలో సాధారణ జీవితం గడిపిన పలువురు నాయకులు ప్రస్తుతం ఖరీదైన కార్లు.. భవంతులు.. భూములు కొనుగోలు చేసిన విషయాన్ని పార్టీ సీనియర్ల దృష్టికి తీసుకెళ్లారట. దాంతో కోవూరులో జరుగుతున్న అవినీతి. అక్రమాలపై నిఘా విభాగం ద్వారా తాడేపల్లిలోని వైసీపీ పెద్దలు నివేదిక తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఆ నివేదికలో ఏం గుర్తించారు? ఎవరి బండారం బయట పడింది? ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌రెడ్డి వ్యవహార శైలి గురించి ఏం తెలుసుకున్నారు? అని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. పార్టీ ఏం చెబుతుందా అని ఎదురు చూస్తున్నారట. మరి.. కోవూరులో వైసీపీని సెట్‌రైట్‌ చేసేందుకు పార్టీ పెద్దలు ఎలాంటి మంత్రదండం ప్రయోగిస్తారో లేదో చూడాలి.

Exit mobile version