NTV Telugu Site icon

TRS : టీఆర్ఎస్ లో కొందరు నాయకులు ఆ పద్ధతినే ఎంచుకున్నారా.? ఎదో అనుకుంటే ఇంకేదో అవుతుందా.?

Telangana Bhavan

Telangana Bhavan

పదవులు ఇస్తే కొందరు సంతృప్తి చెందుతారు. మరికొందరు ఆ పదవులతో కొత్త ఎత్తులు వేస్తారు. టీఆర్‌ఎస్‌లో కొందరు నాయకులు రెండో పద్ధతిని ఎంచుకున్నారట. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు పక్కలో బల్లెంలా మారినట్టు టాక్‌. ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతోందని తలపట్టుకుంటున్నారట ఎమ్మెల్యేలు.

తెలంగాణ ఏర్పాటయ్యాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్‌… వివిధ కారణాలతో చేరికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి.. ఆ తర్వాత కొత్తగా టీఆర్ఎస్‌లో చేరిన వారికి రాజకీయంగా అవకాశాలు ఇస్తూ వస్తోంది కూడా. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా వివిధ కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి.. వాటికి ఛైర్మన్లు చేసింది. టీఆర్ఎస్‌ ప్రస్తుత.. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నామినేటెడ్‌ పదవుల పంపకం జరిగింది. ఇలా పదవులు పొందినవారిలో కొందరితో ప్రస్తుతం సిట్టింగ్‌లకు టెన్షన్‌ పట్టుకుందట. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీకి వస్తారో అని ఆందోళన చెందుతున్నారట ఎమ్మెల్యేలు.

టీఆర్ఎస్‌లో మొదటి నుంచి ఉన్నవాళ్లు.. తర్వాత గులాబీ కండువా కప్పుకొన్నవాళ్లు చాలా మంది అసెంబ్లీకి పోటీ చేయాలని చూస్తున్నారు. కానీ.. రెండు ఎన్నికల్లో కొందరికే పోటీ చేసే ఛాన్స్‌ దక్కింది. టికెట్‌ ఆశించి భంగపడిన వారికి నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రాధాన్యం ఇచ్చారు. అసంతృప్తితో ఉన్నవారికి పదవులు ఇస్తే శాంతిస్తారని.. ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని లెక్క లేసుకున్నారు. కానీ.. సీన్‌ రివర్స్‌ కావడంతో ఎమ్మెల్యేలు కంగుతిన్న పరిస్థితి ఉంది.

నామినేటెడ్‌ పదవులు పొందిన వాళ్లు టికెట్ రేస్‌ నుంచి తప్పుకొంటారని పార్టీ భావించిందట. అలాగే ఎమ్మెల్యేలు కూడా తమకు పెద్దగా ముప్పు ఉండబోదని లెక్కలేసుకున్నారు. వడపోతల్లో గట్టి అభ్యర్థులే బరిలో ఉంటారని పార్టీ పెద్దలు భావించారట. కానీ.. నామినేటెడ్‌ పదవులు వచ్చాక కొందరు నేతలు గేర్‌ మార్చేశారట. పదవి ఇచ్చారంటే తమను గుర్తించినట్టే కదా అని భావించి.. దూకుడు పెంచితే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్‌ ఇస్తారని అభిప్రాయ పడుతున్నారట. ఈ క్రమంలో ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేస్తున్నారు.

తెలంగాణలో మూడోసారి టీఆర్ఎస్‌ అధికారంలోకి రావాలంటే.. కొత్త వాళ్లకు పార్టీ ఛాన్స్‌ ఇస్తుందనే ఆశతో గేర్‌ మార్చేస్తున్నారట నామినేటెడ్‌ పదవుల్లో ఉన్న నాయకులు. ఇప్పటికే నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహిస్తుండటంతో.. ఆ సర్వేల దృష్టిలో పడేలా.. గ్రాఫ్‌ పెంచుకునేలా ఎమ్మెల్యేలకు పోటీగా కార్యక్రమాలు చేస్తున్నారట. పైగా మూడోసారి అధికారంలోకి రావాలంటే క్షేత్రస్థాయి నుంచే గట్టి ప్రయత్నాలు చేయాలని గులాబీ శిబిరంలో చర్చ జరుగుతోందట. ఆ చర్చకు అనుగుణంగానే ఎమ్మెల్యేలు ఒకవైపు.. నామినేటెడ్‌ పదవుల్లో ఉన్నవాళ్లు మరోవైపు ప్రచార పర్వం ఊదరగొట్టేస్తున్నారు. దీంతో పక్కలో బల్లెంలా తయారైన వారిని ఎలా కట్టడి చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారట ఎమ్మెల్యేలు. మరి.. ఈ సవాల్‌ను అధికారపార్టీ శాసనసభ్యులు ఎలా అధిగమిస్తారో చూడాలి.