Site icon NTV Telugu

హుజురాబాద్ లో కుల సంఘాలకు డిమాండ్ పెరిగిందా…?

హుజురాబాద్‌లో కుల సంఘాలకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిందా? వారు ఏం అడిగితే దానికి ఓకే చెప్పేస్తున్నారా? హామీల వర్షం కురుస్తోందా? ఈ విషయంలో అధికారపార్టీ తీసుకుంటున్న జాగ్రత్తలేంటి? రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చేంటి?

ఒక్కోరోజు నలుగురు లేదా ఐదుగురు మంత్రుల ప్రచారం!

హుజురాబాద్‌ ఉపఎన్నిక తేదీ ప్రకటన ఇప్పట్లో లేకపోయినా.. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవడానికి పార్టీలకు బోల్డంత సమయం చిక్కింది. ఈ టైమ్‌ను అధికారపార్టీ టీఆర్‌ఎస్‌ చక్కగా ఉపయోగించుకుంటోందట. హుజురాబాద్‌ ఉపఎన్నిక తమకు పెద్ద విషయమే కాదని స్టేట్‌మెంట్లు ఇస్తున్నా.. క్షేత్రస్థాయి పరిశీలనల తర్వాత నిత్యం మంత్రుల హడావిడి కొనసాగుతూనే ఉంది. ఒక్కోరోజు నలుగురైదుగురు మంత్రులు ప్రచారానికి వస్తున్నారు. మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ల ఫోకస్‌ అంతా ఉపఎన్నికపై పెట్టి.. అక్కడే బస చేస్తున్నారు.

దళితబంధు ప్రభావం మిగతా కులాలపై పడకుండా జాగ్రత్త!

కొత్త పథకాల ప్రారంభం.. పాత పథకాల పునః ప్రారంభం వరకు అన్నీ తామై కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అధికార పార్టీ నాయకులు. ఇందులో దళితబంధు ఒక ఉదాహరణ. ఈ పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు. అయితే దళితబంధు ప్రభావం మిగతా సామాజిక వర్గాలపై పడిందనే ప్రచారంతో అధికార పార్టీ నేతలు అప్రమత్తం అయ్యారట. ఉపఎన్నికల పరిధిలో ఏ వర్గమూ నొచ్చుకోకుండా.. వారిని సంతృప్తి పరిచే పనిలో పడ్డారట నాయకులు. మిగతా కుల సంఘాలను కూడా మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు నేతలు.

యాదవులకు గొర్రెలు పంపిణీ.. భవనాలు కట్టేందుకు సిద్ధం!

హుజురాబాద్‌లో కుల సంఘాలు అడిగితే.. కాదనకుండా హామీలు కురిపిస్తున్నారట. నియోజకవర్గంలో 2 లక్షల 26 వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 45 వేల మంది దళిత సామాజికవర్గం ఓటర్లు. 21 వేల దళిత కుటుంబాలలో సగం మందికి దళితబంధు అందుతోంది. వారి ఖాతాల్లో నగదు జమ అయింది. ఇది చూసి ఇతర కులాలు దూరం కాకుండా.. ఫోకస్‌ పెట్టారు. యాదవ సామాజికవర్గాలకు గొర్రెలను పంపిణీ చేశారు. యాదవ భవనాలు కట్టేందుకు స్థలంతోపాటు నిధులు కూడా ఇస్తామని చెబుతున్నారట.

కులాలకు గాలాలు వేయడానికి పెద్ద కసరత్తు!

పద్మశాలీ, నాయిబ్రాహ్మణ, రెడ్డి, కాపు, వైశ్య, గౌడ సామాజికవర్గాలకు చెందిన ప్రతినిధులతోనూ మంత్రి హరీష్‌రావు నిత్యం సమావేశాలు నిర్వహించడం పరిపాటిగా మారింది. ఈటల రాజేందర్‌ సామాజికవర్గమైన ముదిరాజ్‌ కులంపైనా ప్రత్యేక దృష్టి పెట్టారట. ప్రభుత్వం తరఫున ఆయా సంఘాలకు హరీష్‌రావు హామీలు ఇస్తున్నట్టు సమాచారం. దీంతో కులాలకు గాలాలు వేయడానికి అధికారపార్టీ పెద్ద కసరత్తే చేస్తోందని చర్చ జరుగుతోంది.

ఓ ప్లాన్‌ ప్రకారం ఓటర్ల ఆకర్షణ!

ఒకవైపు ప్రత్యర్థి పార్టీ బీజేపీని.. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను విమర్శిస్తూనే.. ఓటర్లను ఆకర్షించేందుకు ఓ ప్లాన్‌ ప్రకారం కార్యక్రమాలు చేసుకుని వెళ్తోంది టీఆర్ఎస్‌. పైగా ఇప్పట్లో ఉపఎన్నిక నోటిఫికేషన్‌ రాబోదని తెలియడంతో.. లభించిన ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకుంటోంది అధికార పార్టీ. మరి.. కులాలపై కురిపిస్తున్న హామీల వర్షం ఏ మేరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

Exit mobile version