Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో ఓ మంత్రి- ఎమ్మెల్యే మధ్య మొదలైన కోల్డ్ వార్…చినికి చినికి గాలివానాలా మారుతోందట. కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు జరుగుతున్న ప్రచారం.. హస్తం పార్టీలో కాకపుట్టిస్తోంది. పొలిటికల్ సర్కిల్స్‌లో దీని గురించి రకరకాల డిస్కషన్స్ జరిగిపోతున్నాయి. దేశ్ బచావో.. ఓట్ బచావో నినాదంతో ఢిల్లీలో ఇండియా కూటమి చేపట్టిన ర్యాలీపై జాతీయ స్థాయిలో చర్చ జరగ్గా… ఇప్పుడు ఈ ఇద్దరు నేతల యుద్ధం స్టేట్ లెవల్ డిస్కషన్ అయిపోయింది. ఇండి కూటమి పక్షాలు ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో వెళ్లారు. కార్యక్రమం విజయవంతం అయ్యాక.. ఢిల్లీలోని ఓ హోటల్ లాబీల్లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతరావు ఎదురుపడ్డారట ఆ సమయంలో తీవ్ర స్వరంతో మంత్రి ఎమ్మెల్యే మీద విరుచుకుపడ్డారనే ప్రచారం హస్తం పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.
ఆ సమయంలో రంగారెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారట. సంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో పక్క జిల్లా ఎమ్మెల్యే జోక్యాన్ని మంత్రి సీరియస్‌గా ప్రశ్నించినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. మంత్రిగారూ అంటూ.. పలకరించిన పాపానికి తనపై నోరు పారేసుకున్నారని జుక్కల్ ఎమ్మెల్యే సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మంత్రి మాటలు తనను మనస్దాపానికి గురిచేశాయంటూ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట ఎమ్మెల్యే. పీసీసీ అధ్యక్షుడికి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ వాసి. ఆయన అక్కడే పుట్టి పెరిగారు. పక్కనే ఉన్న జుక్కల్‌లో పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఐతే సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడి నియామకంలో ఆయన జోక్యం చేసుకుని.. తాను అనుకున్న వ్యక్తికి డీసీసీ పీఠం ఇప్పించుకోగలిగారన్న ప్రచారం ఉంది. అదే సమయంలో తన ఇలాఖాలో పక్క జిల్లా ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడాన్ని మంత్రి దామోదర జీర్ణించుకోలేకపోతున్నారట. వాస్తవానికి సంగారెడ్డి డీసీసీ అధ్యక్షునిగా ఉజ్వల్ రెడ్డికి అవకాశం ఇవ్వాలంటూ మంత్రి దామోదర పట్టుబట్టారు. కానీ నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సోదరుడు…శేఖర్ రెడ్డికి దక్కేలా.. జుక్కల్ ఎమ్మెల్యే పావులు కదిపారని మంత్రి రగిలిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు.
ఉజ్వల్ రెడ్డికి డీసీసీ పీఠం దక్కకపోవడానికి.. లక్ష్మీకాంతరావు ఢిల్లీ లాబీయింగే కారణం అంటూ మంత్రి అనుచరులు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ విషయంలో సీరియస్‌గా ఉన్న దామోదర సమయం కోసం వేచి ఉన్నారట. ఇక ఢిల్లీలో ఎమ్మెల్యే మంత్రిని కలిసిన సందర్భంగా.. మొత్తం వెళ్ళగక్కినట్టు చెబుతున్నాయి హస్తం వర్గాలు. మంత్రి మాటలతో మనస్తాపానికి గురైన ఎమ్మెల్యే కాంతారావు పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారట. అలాగే…. తాజాగా క్రమశిక్షణ కమిటీకి సైతం కంప్లయింట్ ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలిసింది. అటు ఢిల్లీ పెద్దలకు సైతం ఫిర్యాదు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే, మంత్రి మధ్య కొంత కాలం నుంచి కోల్డ్ వార్ నడుస్తుండగా.. ఈ ఇష్యూ మరింత మంట పెట్టిందంటున్నారు. ఈ అంశంపై ఢిల్లీ పెద్దలు, పీసీసీ చీఫ్ ఎలా స్పందిస్తారోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.

