Site icon NTV Telugu

Credit Fight:క్రెడిట్ గోల …ఎవరి గొడవ వారిదే

మొత్తానికి ఏపీలో పీఆర్సీ ఎపిసోడ్ కథ సుఖాంతమైంది. కొన్ని సంఘాలు ఇంకా అసంతృప్తిలో ఉండి ఆందోళనలు కొనసాగిస్తున్నా.. JACలు తమ డిమాండ్స్‌లో ఎంతో కొంత మెరుగ్గా సాధించుకోగలిగాయి. దీంతో ఆ క్రెడిట్‌ నాదంటే నాదనే గేమ్‌ మొదలైంది. మేమే సెగ రాజేశాం అంటే.. కాదు మేమే అని పోటీపడుతున్నాయి ఉద్యోగ సంఘాలు.

ఉద్యోగ సంఘాల నేతల క్రెడిట్‌ ఫైట్‌
ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది నెలలపాటు సాగిన పీఆర్సీ ఎపిసోడ్‌కు ఎట్టకేలకు ఎండ్‌కార్డ్‌ పడింది. ఫిట్‌మెంట్‌ 23 శాతం కంటే ఒక్క అడుగు ముందుకు వెళ్లకపోయినా HRA, అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ శ్లాబుల్లో సవరణలు చేసింది ప్రభుత్వం. HRA శ్లాబుల్లో గత పీఆర్సీ కంటే మెరుగ్గా 20 వేలు ఉన్న గరిష్ట పరిమితిని ఇప్పుడు 25 వేలు చేసింది. ఐఆర్‌ రికవరీలోనూ ఊరట వచ్చింది. ఐదేళ్లకే పీఆర్సీ డిమాండ్‌కు ప్రభుత్వం సరే అనక తప్పలేదు. మట్టి ఖర్చుల పేరుతో ఇచ్చే ప్రయోజనం కూడా 25 వేలకు కొనసాగేలా ఖరారు చేసుకోగలిగారు. సీసీఏ క్యాన్సిల్‌ ప్రతిపాదనను రద్దు చేయించుకోగలిగారు. మొత్తం మీద చలో విజయవాడ ఎఫెక్ట్‌ తర్వాత ప్రభుత్వం ఆగమేఘాలపై ఉద్యోగుల డిమాండ్స్‌ పరిష్కారం కోసం సీరియస్‌గా కసరత్తు చేయటం.. దానికంటే ముందు మంత్రుల కమిటీ ఏర్పాటు.. ఇవన్నీ ఉద్యోగ సంఘాల ఆందోళనల బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన పరిణామాలే. ప్రభుత్వమే నాలుగడుగులు వెనక్కి వేసి మరీ.. సమ్మెకు వెళ్లటానికి సిద్ధపడిన ఉద్యోగ సంఘాలతో కార్యాచరణను విరమించేలా చేయగలిగింది. ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం దొరకటంతో ఇప్పుడు నాయకులు క్రెడిట్‌ తమ ఖాతాల్లో వేసుకోవటానికి పోటీ పడుతున్నారట.

తామే ముందు ఉన్నామంటోన్న ఓ జేఏసీ నేత
మొదట జనవరిలో పీఆర్సీ ఫిట్‌మెంట్‌ ప్రకటన రోజున సీఎం జగన్‌తో జరిగిన సమావేశానికి దూరంగా ఉన్న ఓ జేఏసీ నేత రివర్స్‌ పీఆర్సీని రివర్స్‌ చేసిన ఘనత తమదే అని చెప్పుకొన్నారట. ఫిట్‌మెంట్‌ 23 శాతంగా ప్రకటించిన రోజే దానిని వ్యతిరేకిస్తున్నట్టుగా ప్రకటన విడుదల చేశారు. ఫిట్‌మెంట్‌ ప్రకటన తర్వాత రాని సమస్య HRA, సీసీఏ రద్దు, ఐఆర్‌ రికవరీ వంటి అంశాలు జోడించి హఠాత్తుగా రాత్రికి రాత్రి జీవోలు జారీ చేయడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో నిప్పు రాజుకుంది. అప్పటి వరకు వేర్వేరుగా ఉన్న నాలుగు JACలు ఒకే తాటిపైకి వచ్చి సమ్మె నోటీసు ఇచ్చాయి. దీంతో ఆ రోజు 23 శాతం ఫిట్‌మెంట్‌ను ధైర్యంగా వ్యతిరేకించడంతోపాటు.. మిగిలిన మూడు జేఏసీలు మూసేసిన పీఆర్సీ ఎపిసోడ్‌ను మళ్లీ రీఓపెన్‌ చేయించిన ఘనత తమదే అని.. అందరి కంటే తామే ముందు ఉన్నాం అని ఓ JAC నేత చెప్పుకొంటున్నారట.

ఉద్యోగ సంఘాల్లో కదలిక మా పోరాటం ఫలితమే: ఉపాధ్యాయ సంఘాలు
అసలు మేమే లేకపోతే ఉద్యోగ సంఘాలు రోడ్డు మీదకు వచ్చేవా అని మరో ఉపాధ్యాయ సంఘం కాలర్‌ ఎగరేస్తోందట. HRA శ్లాబుల్లో కోత సెగ ఎక్కువ తగిలేదే మున్సిపాలిటీలు, చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఉండే ఉపాధ్యాయులకు. అందుకే జీవోలు జారీ అయిన వెంటనే ఉపాధ్యాయ జేఏసీ కలెక్టరేట్‌ ముట్టడికి పిలునిచ్చింది. అన్ని జిల్లాల్లో టీచర్లు భారీగా తరలివచ్చారు. ఈ పాయింట్‌ను ఏపీటీఎఫ్‌ వంటి ఉపాధ్యాయ సంఘాలు ఘనంగానే చెబుతున్నాయట. తమ నేతృత్వంలోనే ముందు నుంచీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయని.. ఫ్యాప్టో చేసిన ఆందోళనవల్లే ఉద్యోగ సంఘాలు కూడా జీవోలకు వ్యతిరేకంగా మాట్లాడక తప్పలేదు అని క్రెడిట్‌ తమ ఖాతాలో వేసుకుంటున్నాయట.

ఇంత చేసి మీరు సాధించిందేమిటి అని ఉపాధ్యాయ సంఘాలు.. ఉద్యోగ JACలపై, వాటి నేతలపై రివర్స్‌ అటాకింగ్‌ మొదలు పెట్టాయి. ఆ నలుగురు ప్రభుత్వంతో లాలూచీ పడ్డారని ఒకరు, జేఏసీ మరోసారి మోసం చేసిందని ఇంకొకరు విమర్శలు మొదలుపెట్టారు. ఇంత హడావిడి చేస్తున్న ఏపీటీఎఫ్‌, ఎస్టీయూ వంటి ఉపాధ్యాయ సంఘాలు ఏపీ జేఏసీ నుంచి బయటకు రాకుండా కత్తులు నూరడం ఈ ఎపిసోడ్‌లో కొసమెరుపు. ఇదేం ద్వంద్వ వైఖరి అని ఉద్యోగ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట.

Exit mobile version