తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయా? బీజేపీ నాయకులను అమిత్ షా అలర్ట్ చేశారంటే ఏదో ఇండికేషన్ ఉండే ఉంటుందా? టీఆర్ఎస్ కూడా ఎమ్మెల్యేలను గ్రౌండ్‌లోనే ఉండాలని చెప్పిందా? మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి..!?
ముందస్తు వేడి మధ్య కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?
2018 ముందస్తు ఎన్నికల్లో తేలిపోయిన కాంగ్రెస్ వ్యూహం!
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై వాడీ వేడి చర్చ మొదలైంది. ఈ దిశగా రాష్ట్ర బీజేపీ నేతలను అమిత్ షా అప్రమత్తం చేయడంతో ఏం జరుగుతుందా అని అంతా ఆరా తీస్తున్నారు. కేంద్ర హోం మంత్రి ప్రకటన అంటే.. దానికో లెక్క ఉంటుందని అనుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ చేరికలు.. ఎత్తుగడలు అమలు చేసే పనిలో ఉంది. అధికార trs సైతం రాజకీయ వేడి రగిలిస్తోంది. ఈ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? అమిత్ షా బీజేపీ నేతలను అలర్ట్ చేయడానికంటే ముందే.. పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వారంలోనే తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారు అని కామెంట్స్ చేశారు రేవంత్‌రెడ్డి. మరి ఆ దిశగా రేవంత్ పార్టీని సిద్ధం చేశారా..? అడుగులు పడుతున్నాయా? 2018లో కూడా అప్పటి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి కూడా ముందస్తు ఎన్నికలపై ముందే హింట్ ఇచ్చారు. కానీ ఫలితాలు చూశాక.. ఎంత వరకు వర్కవుట్ చేశారో పార్టీ శ్రేణులకు అర్థమైంది.
ఇంకా ఒక మాట మీద లేదని పార్టీ నేతలు..!
పార్టీ మారిన 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికీ ఓ నాయకుడిని తయారు చేసుకునే పరిస్థితి కాంగ్రెస్‌లో లేదు. భూపాలపల్లిలో తప్ప.. మిగిలిన నియోజకవర్గాల్లో ఆ స్థాయి నాయకులే లేరు. పార్టీ అక్కడ బలంగా ఉన్నా.. నాయకుడు లేక కేడర్ నీరు గారి పోతుంది. ఇంకా పార్టీలో నాయకులంతా ఏకతాటి మీదకు వచ్చిన దాఖలాలు లేవు. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కొంప ముంచింది కూడా ఇదే. సీనియర్ నాయకులే ఓడిపోయారు. అధికార trs మీద వ్యతిరేకత ఉందని నేతలు చెప్పడం తప్పితే.. కార్యాచరణ లేదు.
అందరినీ పరుగులు పెట్టించే పని మొదలుకాలేదా?
పీసీసీ చీఫ్‌గా రేవంత్ బాధ్యతలు చేపట్టిన మొదట్లో వరస సభలతో దూకుడు పెంచారు. ఇటీవల ధాన్యం సేకరణ విషయంలో బీజేపీ.. trs మధ్య రాజకీయం హీటెక్కింది. కాంగ్రెస్ కూడా రైతుల బాట పట్టే ప్రయత్నం చేసింది. కానీ ఈ అంశంపై రాష్ట్ర నాయకత్వం అంతగా ఫోకస్ పెట్టినట్టు కనిపించలేదు. పార్లమెంట్‌లో తెలంగాణ రైతుల కోసం ఆందోళన చేస్తామని చెప్పిన ఎంపీలు మాటలకే పరిమితం అయ్యారు. పీసీసీకి కొత్త చీఫ్ వచ్చారన్న జోష్ ఉంది కానీ పార్టీ పదవుల భర్తీ.. అందరినీ పరుగులు పెట్టించే పని ఇంకా మొదలుపెట్టలేదు. మార్చి వరకు పార్టీ చీఫ్ వేచి చూసే పనిలో ఉన్నట్టు కనిపిస్తుంది. డీసీసీలు ఉన్నారు తప్పితే యాక్టివ్‌గా లేరన్నది నిజం. పార్టీ బలంగా ఉన్న జిల్లాల్లో నాయకుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇవన్నీ సెట్ చేసుకుని ఎన్నికలకు సిద్ధం అవుతారా?
పొత్తులు ఎవరితో.. కొట్లాడేది ఎవరితో తేల్చరు..!
ఎన్నికలు దగ్గర పడితే కానీ కాంగ్రెస్ అలెర్ట్ అవ్వడం లేదు. అభ్యర్థుల ఎంపిక కూడా ఆఖరి నిమిషం వరకు తేల్చరు. పొత్తులు ఎవరితో.. కొట్లాడేది ఎవరితో అనే క్లారిటీ రాకముందే ఎన్నికలు అయిపోతాయి.. ఫలితాలు వచ్చేస్తున్నాయి. 2018లో జరిగింది ఇదే. మరి.. ఇప్పుడేం చేస్తారు? పార్టీ దూకుడు పెరుగుతుందా లేక వందేళ్ల పార్టీ మాకేం అని ఊరుకుంటారో చూడాలి.
