Site icon NTV Telugu

TCongress : ముందస్తు ఎన్నికలపై కాంగ్రెస్ లెక్కలేంటి.? అందుకే తొందరపడుతున్నారా..?

Tcongress

Tcongress

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కాంగ్రెస్ నేతల లెక్కలు వేరే ఉన్నాయా..? అందుకే తొందర పడుతున్నారా..? ఆరు నెలల ముందే అభ్యర్ధుల ప్రకటన నుంచి.. డిసెంబర్‌లోనే టికెట్ల ఫైనల్ అని చెబుతోందా? ఇంతకీ ఇది సాధ్యమయ్యే పనేనా..? సమయం లేదు మిత్రమా అని ఎవరు ఎవరిని అప్రమత్తం చేస్తున్నారు?

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రకటనపై తెలంగాణా కాంగ్రెస్‌ తొందర పడుతోందా? లేక వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని చూస్తోందా? ఒకవైపు బీజేపీ.. ఇంకోవైపు అధికార టీఆర్ఎస్‌ ఆకర్షణ వల విసరడానికి కాచుకుని కూర్చుంటే.. అంత తొందరగా అభ్యర్థుల ప్రకటన సాధ్యమా అనే చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో ఉంది. ఎవరి ఆలోచన.. అంచనాలు ఎలా ఉన్నా.. ఆరు నెలల ముందే కాంగ్రెస్‌ క్యాండిడేట్స్‌ను ప్రకటించేయాలనే డిమాండ్‌ గట్టిగానే వినిపిస్తోంది. ఇలా ప్రకటించడం వల్ల కాంగ్రెస్‌కు ఏ మేరకు లాభం? ఏ మేరకు నష్టం అనే దానికంటే.. అసలు ఇది సాధ్యమయ్యే పనేనా అని కొందరి అనుమానం.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని రాజకీయంగా దెబ్బతీయడానికి టీఆర్ఎస్‌, బీజేపీలు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. పార్టీలో బలంగా ఉన్న నాయకులను ఆకర్షించే వ్యూహాలు పదునెక్కుతున్నాయి. అందుకే ఆరు నెలల ముందు అభ్యర్థుల ప్రకటన అంటే.. అది పెద్ద సాహసంగా.. పార్టీకి ప్రమాదకరంగా భావిస్తున్నారు కొందరు. ఒకవేళ ముందే క్యాండిడేట్‌ను నిర్ణయిస్తే.. వారు ఎన్నికల వరకు ఉంటారా? చివరిలో హ్యాండిస్తే పరిస్థితి ఏంటి? టీఆర్ఎస్‌, బీజేపీల ఒత్తిడిని తట్టుకుని ఎంత వరకు వారిని కాయగలం? ఇలా అనేక ప్రశ్నలు గాంధీభవన్‌ చర్చల్లో నలుగుతున్నాయి.

వాస్తవానికి కాంగ్రెస్‌లో టికెట్స్ కేటాయింపు.. నామినేషన్ల దాఖలు చేసే చివరి నిమిషం వరకూ నాన్చుతారు. ఇతర పార్టీల నుండి బలమైన నాయకులు వస్తారనే సంకేతాలు ఉంటే.. ఆఖరి వరకు సస్పెన్స్‌లో పెడతారు. 2018లో మిర్యాలగూడ నుంచి బీసీ ఉద్యమ నేత ఆర్‌ కృష్ణయ్య కాంగ్రెస్‌ నుంచి పోటీ చేశారు. నామినేషన్‌ దాఖలు చేయడానికి ఆఖరి రోజు అనగా.. కాంగ్రెస్‌లో సభ్యత్వం కూడా లేని కృష్ణయ్యను అభ్యర్థిగా ప్రకటించారు. ఆ ఉదాహరణతో ఇప్పుడు ఏ జిల్లా నాయకుడు.. ఇంకో జిల్లాలో వేలు పెట్టే పరిస్థితి లేదు. అలా అని ఎలాంటి గొడవలు లేవంటే అతిశయోక్తే అవుతుంది. పార్టీలోని ముఖ్య నాయకుల మధ్యే గొడవలు ఉన్నాయి.

కాంగ్రెస్‌లో కీలక నాయకుడిగా ఉన్న ఒకరు.. నల్లగొండతోపాటు పాలమూరు జిల్లాలోనూ తన వారికి సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. పైగా కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపిక అంతా AICC పరిధిలోనే జరుగుతుంది. దానికి ఒక స్క్రీనింగ్‌ కమిటీ కూడా ఉంటుంది. అందువల్ల ముందుగా అభ్యర్థుల ప్రకటన అయ్యే పనేనా అని కొందరు పెదవి విరిస్తున్నారట. ఒకవేళ ఆరు నెలల ముందే అభ్యర్థిని ప్రకటిస్తే.. అదే నియోజకవర్గంలో ఎదుట పార్టీ నుంచి బలమైన నేత వస్తానంటే ఏం చేస్తారు అనే ప్రశ్న ఉంది. అలాగే ప్రకటించిన అభ్యర్థులు చేయి దాటి పోరనే గ్యారెంటీ కూడా లేదంటున్నారు. అదే జరిగితే పార్టీకి ఎన్నికల్లో అంతకంటే పెద్ద డ్యామేజీ ఇంకొకటి ఉండబోదు. ముందస్తుగా అభ్యర్థు ప్రకటన మంచిదే అయినా.. కాంగ్రెస్‌లో అది ఎంత వరకు రాజకీయంగా వర్కవుట్ అవుతుందనేది పెద్ద ప్రశ్న. మరి.. సమయం లేదు మిత్రమా అని తొందర పడుతున్న నేతలకు హైకమాండ్‌ ఊరట నిస్తుందో.. ఉస్సూరు మనిపిస్తుందో చూడాలి.

 

 

Exit mobile version