ఒక ఆలయం. ఇద్దరు ఈవోలు. పోస్ట్ ఒకటే అయినా.. ఇద్దరు అధికారుల మధ్య కుర్చీలాట రసవత్తరంగా మారింది. ఎవరి మాట వినాలో సిబ్బందికి తెలియదు. వినకపోతే ఏమౌతుందో తెలియంది కాదు. ఆధిపత్యం కోసం ఇద్దరు ఈవోలు వేస్తున్న ఎత్తుగడలతో ఆ ఆలయం ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చింది.
జోనల్ విధానంలో బదిలీపై ఈవోగా వచ్చిన రవికుమార్
మెదక్ జిల్లాలోప్రసిద్ధ ఆలయం ఏడుపాయల. తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు వస్తారు. ఈ ఆలయంలో ఉన్న ఈవో పోస్ట్ ఒక్కటే అయినా.. ఆ హోదాలో విధులు వెలగబెడుతోంది మాత్రం ఇద్దరు అధికారులు. ఒకరు వచ్చినప్పుడు మరొకరు రాకుండా ఇద్దరు.. అదే సీట్లో కూర్చొని వెళ్లిపోతున్నారు. ఛాన్స్ దొరికితే అక్కడే పాతుపోవాలన్నది వాళ్ల ఆలోచన. రెండేళ్ల క్రితం ఇంచార్జి ఈవోగా సారా శ్రీనివాస్ బదిలీ పై ఇక్కడికి వచ్చారు.. పర్మినెంట్ ఈవో రాకపోవడంతో ఆయనే చక్రం తిప్పుతున్నారు. కొబ్బరికాయలు, వడి బియ్యం విషయంలో గడువు ముగిశాక టెండర్లు కొనసాగించారని హైకోర్ట్‌లో పిటిషన్లు పడ్డాయి. తాజాగా రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రకారం జోనల్ బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. మెదక్ జిల్లాను రాజన్న సిరిసిల్ల జోన్‌లో విలీనం చేశారు. ఆ ప్రక్రియలో భాగంగా యాదాద్రి జిల్లాలో పనిచేస్తున్న రవికుమార్ ఏడుపాయలకు బదిలీపై వచ్చారు. ఇక్కడే గొడవ రాజుకుంటోంది.
ఈవోగా బాధ్యతలు చేపట్టేసిన రవికుమార్
రవికుమార్‌కు బాధ్యతలు అప్పగించడానికి పాత ఈవో శ్రీనివాస్ ఇష్టపడటం లేదట. ఫోన్ చేసిన స్పందించడం లేదట. దీంతో విసుగుచెందిన రవికుమార్.. నేరుగా వచ్చి బాధ్యతలు చేపట్టి ఈవో కుర్చీలో కూర్చుని వెళ్లిపోయారు. మరుసటి రోజు వచ్చిన పాత ఈవో శ్రీనివాస్ తాను ఇంకా బాధ్యతలు అప్పగించ లేదని, అప్పటి వరకు ఆలయ ఈవో తానేని ఉద్యోగులకు హుకుం జారీ చేశారట.
కొత్త ఈవోకు ఉన్నతాధికారులు – పాత ఈవోకు ఎమ్మెల్యే సపోర్ట్
తాజా బదిలీలలో సారా శ్రీనివాస్‌ను శివ్వంపేట మండలం చాకలిమెట్లలోని హనుమాన్ ఆలయానికి బదిలీ చేశారు. అక్కడికి వెళ్లి ఛార్జ్ తీసుకున్నప్పటికీ ఏడుపాయల నుంచి కదలడం లేదట. దీంతో కరవమంటే కప్పకి.. వదలమంటే పాముకి కోపం అన్నట్టు సిబ్బంది పరిస్థితి తయారైందట. కొత్త ఈవో రవి కుమార్‌కి దేవాదాయశాఖలో ఉన్నతాధికారులు సపోర్ట్ ఉందట. పాత ఈవోకి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆశీసులు ఉన్నాయట. గతంలోనే బదిలీ కావాల్సి ఉన్నా.. ఆమె ఆశీసులతోనే పెత్తనం చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తిరిగి తానే ఈవోగా వస్తానని ఉద్యోగులుకి చెప్తున్నారట శ్రీనివాస్. కొత్త ఈవో చార్జీ తీసుకున్నాక ఉన్నతాధికారులతో టచ్‌లో ఉంటూ కుర్చీ కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటున్నారట. వచ్చినంత వేగంగానే కొత్త ఈవో వెళ్లిపోతారన్నది పాతయాన వాదన. దీంతో ఈవోల పోరు చూశాక..ఆఫీస్‌కు రావాలంటేనే సిబ్బంది హడలిపోతున్నారట.
మొత్తానికి ఇద్దరు ఈవోల మధ్య ఈ వివాదం ముదురుతోంది. కోరి కొరివితో తల గోక్కోవడం ఎందుకని సిబ్బంది లైట్ తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులూ పట్టించుకోవడం లేదు. మరి.. ఈ కుర్చీలాటకు ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందో చూడాలి.