గెలుపు పక్కా అనుకుంటున్న టీఆర్‌ఎస్ శ్రేణులు.. హుజురాబాద్‌లో ఏ విషయంలో ఆశగా ఎదురు చూస్తున్నాయి? గులాబీ దళపతి లాస్ట్ పంచ్‌పై వేసుకుంటున్న లెక్కలేంటి? కేడర్‌లో ఉత్సాహం తీసుకొచ్చిన ప్రకటన ఏంటి?
ఉపఎన్నికపై ప్రభావం చూపేలా కేసీఆర్ బహిరంగ సభ..!
గతంలో జరిగిన ఉపఎన్నికలకు భిన్నంగా హుజురాబాద్‌లో ప్రచారం నిర్వహిస్తోంది టీఆర్ఎస్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్ నాయకులు విస్తృతంగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. బైఎలక్షన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు అధికారపార్టీ. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ ఖారారు కావడంతో ఆ సభపై గులాబీ శ్రేణులు గంపెడాశలు పెట్టుకున్నాయట. ఈసీ ఆంక్షల వల్ల ఆ భారీ బహిరంగసభ హుజురాబాద్ బయట నిర్వహించి.. ఆ ప్రభావం ఉపఎన్నికపై పడేలా ప్లాన్ వేస్తున్నట్టు సమాచారం.
కేసీఆర్ సభపై పార్టీ శ్రేణుల్లో అంచనాలు పెరుగుతున్నాయా?
గతంలో హుజూర్‌నగర్‌లో ఉపఎన్నిక ప్రచారసభ ఖరారైనా.. వర్షం కారణంగా సీఎం కేసీఆర్ వెళ్లలేదు. అయినప్పటికీ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలో టీఆర్‌ఎస్ పాగా వేసింది. దుబ్బాక ఉపఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండి.. మెదక్ జిల్లా నేతలకే అక్కడి బాధ్యతలు అప్పగించారు. అక్కడ ప్రతికూల ఫలితం వచ్చింది. నాగార్జునసాగర్ బైఎలక్షన్‌కు వచ్చేసరికి వ్యూహం మార్చేశారు. నాగార్జున సాగర్‌లో ఉపఎన్నిక ప్రకటన కంటే ముందు ఒకసారి.. తర్వాత మరోసారి అక్కడి వెళ్లారు గులాబీ బాస్. కేసీఆర్ వెళ్లడం వల్ల నాగార్జునసాగర్‌లో పార్టీకి ఎంతో అనుకూల వాతావరణం వచ్చిందన్నది టీఆర్‌ఎస్ వర్గాల వాదన. అందుకే ఇప్పుడు హుజురాబాద్ ఉపఎన్నిక బ్యాక్‌డ్రాప్‌లో నిర్వహించే కేసీఆర్ సభపై పార్టీ శ్రేణుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.
ఈ నెల 26 లేదా 27న సభకు ప్లాన్..!
ఈటల రాజేందర్ రాజీనామాతో వచ్చిన ఈ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలని పార్టీ నేతలకు స్పష్టంగా చెప్పేశారు సీఎం కేసీఆర్. ఈటల రాజీనామా చేసిన మర్నాడే గులాబీ నాయకులు అక్కడ వాలిపోయారు. కీలకమైన దళితబంధు పథకాన్ని సైతం హుజురాబాద్‌లోనే ప్రారంభించారు ముఖ్యమంత్రి. బహిరంగసభను అట్టహాసంగా నిర్వహించారు కూడా. ఈ నెల 26 లేదా 27న ఏదో ఒకరోజు కేసీఆర్ సభ ఉంటుంది. అది ఎక్కడ అనేది క్లారిటీ లేదు. కాకపోతే సభ ఉద్దేశం ఉపఎన్నికే కావడంతో.. అది పార్టీకి ఇంకా ప్లస్ అవుతుందని లెక్కలేస్తున్నారట. మరి.. ఆ ప్లేస్ ఎక్కడ ఫిక్స్ చేస్తారో చూడాలి.
