పఠాన్‌చెరు కోడిపందాల కేసు తర్వాత టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రియాక్షన్ ఇది. తొలుత కోడిపందాలు జరిగిన ప్రదేశంలోనే లేనని చెప్పిన ఆయన.. పోలీసులు వీడియోలు రిలీజ్ చేశాక టోన్ మార్చేశారు. కోడిపందాలకు.. తనకు ఉన్న అవినాభావ సంబంధాన్ని స్వయంగా వెల్లడించారు. అక్కడితో ఆగితే బాగోదని అనుకున్నారో ఏమో.. తన వీక్ నెస్‌ను అడ్డంగా పెట్టుకుని తనపై స్కెచ్ వేశారని చింతమనేని చెప్పడంతో చర్చ దానిపైకి మళ్లింది. పైగా కోడి పందాల వద్ద పోలీసులే తనకు సమాచారం ఇచ్చి అక్కడి నుంచి తప్పించారని కొత్త అంశాన్ని బయటపెట్టారు. దీంతో చింతమనేనిని కోడి పందాల కేసులో ఇరికించింది ఎవరు? పోలీసులు ఎలా తప్పించారు అనే ప్రశ్నలు చర్చగా మారాయి.
వాస్తవానికి చింతమనేని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. టీడీపీ పవర్‌లో ఉండగా.. దెందులూరు పరిధిలో ఓ రేంజ్‌లో కోడిపందాలు నిర్వహించేవారు. ఈ అలవాటు ముందు నుంచీ ఉన్నా.. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన విన్యాసాలు మరింత పాపులారీటిని తీసుకొచ్చాయి. కానీ.. 2019 ఎన్నికల తర్వాత పరిస్థితి మారిపోయింది. ఈ మూడేళ్ల కాలంలో 60కిపైగా కేసులు నమోదయ్యాయి. అనేకసార్లు జైలుకెళ్లారు. బెయిల్‌పై బయటకొచ్చారు. ఈ కేసులు చాలవన్నట్టు ఇప్పుడు తెలంగాణలోనూ కొత్తగా కోడిపందాల కేసు. అందులో ఆయనే Aవన్. కోడి పందాల కోసం కర్ణాటకు వెళ్లి.. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నట్టు చింతమనేని చెబుతున్నారు. కోడిపందాలు జరుగుతుండగా.. పోలీసులు వచ్చి వెళ్లిపోవాలని చెప్పారని.. ఆ తర్వాత అక్కడ కేసులో ఇరికించే కుట్ర చేశారని తెలిపారు చింతమనేని.
ఇంత జరిగినా.. కోడిపందాలతో ఇమేజ్ డ్యామేజ్ అవుతుందేమోనని ఎవరు చెప్పినా.. చింతమనేని అంగీకరించడం లేదు. చిన్నప్పటి నుంచి తనకు కోడిపందాలు వ్యసనంగా వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అది తెలుసంటూనే.. తనదైన శైలిలో ముక్తాయింపు ఇస్తున్నారు. కోడిపందాలపై పెట్టే కేసులు పెద్దవి కావని.. ఈజీగా బయటపడొచ్చనేది ఆయన అభిప్రాయం కావొచ్చు. అందుకే తెగించేశారని అనేవాళ్లూ ఉన్నారు. తనకేదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆ మధ్య కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు చింతమనేని. తనపై నమోదవుతున్న కేసులను తిప్పికొట్టేందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఒకవైపు తన భద్రతకు ముప్పు ఉందని చెబుతూనే.. ఈ విధంగా కోడిపందాల కోసం రాష్ట్రాలకు రాష్ట్రాలు వెళ్లడం.. అక్కడ నుంచి తప్పించుకురావడం ఎందుకని ప్రశ్నించేవాళ్లూ ఉన్నారు.
పఠాన్‌చెరు పరిధిలోని నమోదైన కేసు విషయంలో అసలేం జరిగిందో కానీ.. చింతమనేని ప్రస్తావించిన అంశాలు రాజకీయంగా చర్చగా మారాయి. చింతమనేని కావాలని అన్నారో లేక నిజంగానే అలా జరిగిందో కానీ.. జూదం కేసులో ట్విస్ట్ ఇచ్చారు. మరి.. లోగుట్టు ఏంటో.. ఏం జరిగిందో.. బయటకొస్తుందో లేదో చూడాలి.