NTV Telugu Site icon

Off The Record: క్రమశిక్షణా సంఘం నేతకే అసమ్మతి సెగ

Chinna1

Chinna1

టీ కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌కే అసమ్మతి సెగ ఓ రేంజ్‌లో తగిలింది. పాతికేళ్లు ఏకచత్రాధిపత్యంగా సాగిన ఆయన నాయకత్వం ఇక మాకొద్దంటూ గళం విప్పతున్నారు అసంతృప్త నేతలు. ఏకంగా సమావేశాలు పెట్టి తీర్మానాలు చేయడం కాంగ్రెస్‌ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

చిన్నారెడ్డికి వ్యతిరేకంగా పార్టీ నేతల గళం
మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు చిన్నారెడ్డికి పెద్ద కష్టమే వచ్చింది. తెలంగాణలో గాడి తప్పిన కాంగ్రెస్‌ను దారిలో పెట్టే క్రమశిక్షణ కమిటీకి ఆయన ఛైర్మన్‌. కానీ.. సొంత నియోజకవర్గం వనపర్తి కాంగ్రెస్‌లో చిన్నారెడ్డికే అసమ్మతి ఓ రేంజ్‌లో ఉంది. చిన్నారెడ్డి హఠావో.. కాంగ్రెస్‌ బచావో అంటూ సమావేశాలు పెడుతున్నారు.. తీర్మానాలు చేసేస్తున్నారు. దాదాపు పాతికేళ్లుగా వనపర్తి కాంగ్రెస్‌లో చిన్నారెడ్డి తప్ప మరో పేరు పార్టీ నుంచి వినిపించలేదు. అంతా ఆయనే. తొలిసారి చిన్నారెడ్డికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు స్థానిక కాంగ్రెస్‌ నాయకులు.

చిన్నారెడ్డిపై పార్టీ నేతల అసంతృప్తి
వనపర్తి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు చిన్నారెడ్డి. ఓసారి మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. స్థానిక కార్యకర్తలు.. ద్వితీయ శ్రేణి నాయకుల ఆగ్రహమే చిన్నారెడ్డి ఓటమికి కారణమని విశ్లేషకులు లెక్కలు తీశారు. దాంతో తాను రాజకీయాల్లో ఉండలేనని.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేనని అసహనం వ్యక్తం చేశారు మాజీ మంత్రి. అప్పటి నుంచి వనపర్తిలో కర్చీఫ్‌ వేసేందుకు కాంగ్రెస్‌ నేతలు పోటీపడుతున్నారు. చిన్నారెడ్డికి.. పార్టీ నేతలకు మధ్య గ్యాప్‌ రావడంతో కొత్తవాళ్లకే ఛాన్స్‌ ఇవ్వడం బెటరనే వాయిస్‌ వినిపిస్తున్నారు కొందరు నాయకులు.

షాద్‌నగర్‌లో అసమ్మతి నేతల భేటీ
మళ్లీ వచ్చే ఎన్నికల్లో చిన్నారెడ్డి పోటీ చేస్తారని అనుమానం కలిగిందో ఏమో.. ఆయనకు వ్యతిరేకంగా ఒక్కటయ్యారు వనపర్తి కాంగ్రెస్‌లోని అసమ్మతి నాయకులు. ఇటీవల ప్రకటించిన పీసీసీ, డీసీసీ పదవులు సైతం వారి ఆగ్రహాన్ని రెట్టింపు చేశాయి. మాజీ మంత్రిపై విమర్శలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు లోకల్‌ కాంగ్రెస్‌ లీడర్స్‌. నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ కేడర్‌ చాలా మంది టీఆర్ఎస్‌లో చేరడానికి చిన్నారెడ్డి వైఖరే కారణమని ఆరోపిస్తున్నవాళ్లూ ఉన్నారు. తాజాగా వనపర్తి డీసీసీగా శ్రీరంగాపురం జడ్పీటీసీ రాజేంద్రప్రసాద్‌ను నియమించారు. పార్టీలో కొత్తగా చేరిన అభిలాష్‌రావును పీసీసీ ప్రధాన కార్యదర్శిగా తీసుకున్నారు. ఈ రెండు పదవులపై స్థానిక నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారట. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారిని కాదని.. ఈ నియామకాలేంటని ప్రశ్నిస్తూ.. షాద్‌నగర్‌లో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు అసమ్మతి నేతలు. ఇకపై వనపర్తి కాంగ్రెస్‌ రాజకీయాల్లో చిన్నారెడ్డి అక్కర్లేదని తీర్మానమే చేసేశారు.

అసమ్మతి నేతల భేటీపై చిన్నారెడ్డి ఆరా
వనపర్తిలో చిన్నారెడ్డి అధ్యక్షతన హాత్ మిలావో.. హాత్‌ జోడో అభియాన్‌ సమావేశం జరుగుతున్న సమయంలోనే షాద్‌నగర్‌ భేటీ ఏర్పాటు చేయడం మరింత కాక రేపింది. అసమ్మతి నేతలకు డీసీసీ మాజీ అధ్యక్షుడు శంకర ప్రసాద్‌ నేతృత్వం వహించగా.. వివిధ మండలాల నుంచి నేతలు హాజరయ్యారు. అసమ్మతి నేతల భేటీపై చిన్నారెడ్డి వర్గం ఆరా తీస్తోందట. వారి వెనుక ఎవరు ఉన్నారు? ఇదంతా చేస్తోంది ఎవరు? అని కూపీ లాగుతున్నారట. మొత్తానికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌పైనే తిరుగుబాటు బావుటా ఎగరేశారు పార్టీ నేతలు.