Site icon NTV Telugu

టీడీపీలో ఇంఛార్జుల నియామకంపై ప్రకంపనలు..!

ఇంఛార్జ్‌ల విషయంలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీకి ప్లస్సా.. మైనస్సా? పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? పొరపాట్లకు ఎక్కడ ఆస్కారం ఇస్తున్నారు? తమ్ముళ్ల పడుతున్న ఇబ్బందులేంటి?

క్షేత్రస్థాయి నుంచి సరైన ఫీడ్‌ బ్యాక్‌ లేదా?

ఏపీలోని 175 అసెంబ్లీ సెగ్మెంట్లకుగానూ.. సుమారు 40 నుంచి 50 నియోజకవర్గాల్లో టీడీపీకి ఇంఛార్జులు లేరు. వీలైనంత త్వరగా అక్కడ ఇంఛార్జులను నియమించే పనిలో స్పీడ్‌ పెంచారు చంద్రబాబు. కొన్ని నియోజకవర్గాల విషయంలో ఇబ్బందులు లేకపోయినా.. మరికొన్ని చోట్ల మాత్రం పార్టీలో రచ్చ రచ్చ అవుతోంది. క్షేత్రస్థాయి నుంచి సరైన ఫీడ్‌బ్యాక్‌ లేదా.. లేక కొందరు నాయకుల తీరువల్ల శ్రేణులు రోడ్డెక్కుతున్నారో కానీ.. అంతా గందరగోళంగా ఉంది.

బుద్ధా వర్గానికి చెక్‌ పెట్టారా? లేక ఎంపీగా ఉన్న నాని స్థాయిని తగ్గించారా అని చర్చ..!
బెజవాడ వెస్ట్‌ పరిణామాలపై పార్టీలో ఆందోళన..!

విజయవాడ పశ్చిమపై చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పార్టీలో భిన్నాభిప్రాయాలకు దారితీసింది. బెజవాడ వెస్ట్‌లో ఎంపీ కేశినేని నానికి.. బుద్దావెంకన్న-నాగుల్‌ మీరాలకు మధ్య వర్గపోరు నడుస్తోంది. దీంతో పార్టీతో సంబంధం లేకుండా స్థానిక నాయకులే పోటాపోటీగా కమిటీలు వేసుకుంటున్నారు. వీలైనంత త్వరలో క్లారిటీ ఇవ్వాలని కేశినేని నానికి పశ్చిమ నియోజకవర్గం కో-ఆర్డినేటర్‌గా ప్రకటించారు. ఇది ఓ విధంగా చూస్తే బుద్దా వెంకన్న వర్గానికి చెక్‌ చెప్పినట్టుగా కనిపిస్తోందట. మరో విధంగా చూస్తే ఎంపీగా ఉన్న నానిని ఓ అసెంబ్లీ సెగ్మెంట్‌ స్థాయికి తెచ్చేశారనే భావన పార్టీలో ఉందట. సహజంగా ఇలాంటి వివాదాలు ఉన్నచోట.. టు మెన్ కమిటీనో.. త్రీ మెన్‌ కమిటీనో వేసి.. సమన్వయం చేసుకోవాల్సిందిగా సూచిస్తారు. ఆ విధంగా కాకుండా.. పశ్చిమ నియోజకవర్గాన్ని కేశినేని నానికి అప్పజెప్పేసింది టీడీపీ. దీంతో పశ్చిమ సెగ్మెంట్లో కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌కు సమన్వకర్త బాధ్యతలు అప్పగించినా పరిస్థితి మరోలా ఉండేదని కొందరి అభిప్రాయం. ఇప్పుడు బెజవాడ వెస్ట్‌లో పరిణామాలు ఏ విధమైన టర్న్‌ తీసుకుంటాయో కేడర్‌కు అర్థం కావడం లేదట.

పాతవాళ్లే తమకు ఇంఛార్జ్‌ పదవి కావాలని డిమాండ్‌..!

రాష్ట్రంలోని మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. వాటిని ఎలా డీల్‌ చేయాలో పార్టీ నేతలకు బోధ పడటం లేదట. పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు, నరసాపురంలలో మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్లు ఇంఛార్జ్‌లుగా బాధ్యతలు తీసుకోవడానికి గతంలో నిరాకరించారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లోనూ కామ్‌గానే ఉండిపోయారు. తీరా కొత్త ఇంఛార్జులను ప్రకటించే సరికి కుదరదంటే కుదరదని మాజీ ఎమ్మెల్యేలు తెరమీదకు వస్తున్నారు. పాతవాళ్లే తమకు ఇంఛార్జ్‌ పదవి కావాలని పట్టుపట్టే పరిస్థితి ఉంది.

రాయలసీమలో పార్టీని వీడి వెళ్లినవాళ్లు టీడీపీలోకి తిరిగి వస్తామంటున్నారా?

రాయలసీమలోని దాదాపు నాలుగైదు నియోజకవర్గాల్లో రాబోయే నేతల గురించి సీట్లను రిజర్వ్‌ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. 2019 ఎన్నికల తర్వాత పార్టీని వీడి వెళ్లినవారిలో కొంతమంది తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సిగ్నల్స్‌ ఇస్తున్నారట. దీంతో వారికోసం వెయిట్‌ చేస్తూ.. ఉన్న నేతలకు ఓకే చెప్పలేక చంద్రబాబు తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ అధినేత తీసుకునే నిర్ణయాలు టీడీపీ ప్లస్‌ అవుతాయో.. మైనస్‌గా మారతాయో చూడాలి.

Exit mobile version