NTV Telugu Site icon

ChandraBabu Comments at Chittoor : చంద్రబాబు వ్యాఖ్యలతో ఆ ఇద్దరు మంత్రులు డిఫెన్స్‌లో పడ్డారా?

Chandra Babu

Chandra Babu

ChandraBabu Comments at Chittoor : టీడీపీ అధినేత వ్యాఖ్యలతో ఆ ఇద్దరు మంత్రులు డిఫెన్స్‌లో పడ్డారా? ఎలా స్పందించాలో తెలియక సైలెంట్‌గా ఉంటున్నారా.. లేక వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారా? పాచిక పారిందని తెలుగు తమ్ముళ్లు ఆ కామెంట్స్‌ను జనాల్లోకి బలంగా తీసుకెళ్తున్నారా? ఇంతకీ రాజకీయ ప్రత్యర్థులను ఇరుకున పెట్టేలా చంద్రబాబు చేసిన ఆ వ్యాఖ్యలు ఏంటి? ఎవరా మంత్రులు? ఏమా కథా? లెట్స్‌ వాచ్‌..!

ఈ మధ్య కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఆ సందర్భంగా తిరుపతి, అన్నమయ్య జిల్లాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానికంగా రాజకీయ వేడి రగిలించాయి. అవి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజాలకు తగలడంతో ఆ శిబిరాల్లో కలవరం మొదలైందట. జిల్లాల విభజన తర్వాత కొన్ని ప్రాంతాల విషయంలో ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. నగరిని తిరుపతి జిల్లాలో కలపాలని.. పుంగనూరును అన్నమయ్య జిల్లాల్లో కలపాలనే డిమాండ్‌ ఉంది. ఈ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలుగా ఉన్న ఆర్కే రోజా.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను ఈ విషయంలో కలిసి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. మంత్రుల నుంచి చూద్దాం.. చేద్దాం అనే మాటలే తప్ప స్పష్టమైన హామీ లేదనే అసంతృప్తి స్థానికుల్లో ఉంది. సరిగ్గా ఇదే అంశాన్ని తన పర్యటనలో పొలిటికల్‌ అస్త్రంగా మార్చుకున్నారు చంద్రబాబు. టీడీపీ అధికారంలోకి వస్తే నగరి నియోజకవర్గాన్ని పూర్తిగా తిరుపతి జిల్లాలో.. పుంగూనురు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో కలుపుతానని టీడీపీ అధినేత హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోవడంతో మంత్రులు శిబిరాలు ఇరకాటంలో పడ్డాయట.

నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో నగరి, నిండ్ర, విజయపురంలు చిత్తూరు జిల్లాలో.. పుత్తూరు, వడమాలపేట మండలాలు తిరుపతి జిల్లాలోకి వెళ్లాయి. ఆ మూడు మండలాల జనం కూడా తమను తిరుపతి జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. పుత్తూరు, వడమాలపేటలు తిరుపతికి దగ్గరగా ఉండటంతో వాటిని ఆ జిల్లాలో కలపడానికి రోజా అభ్యంతరం చెప్పలేదని ప్రచారం జరుగుతోంది. కానీ.. మిగతా మూడు మండలాల ప్రజలు రివర్స్‌ కావడంతో అధికారపార్టీ వర్గాలకు మింగుడు పడని పరిస్థితి ఉందట. ఇదే అంశంపై పలుమార్లు మంత్రి రోజాను కలిసి విన్నవించారు కూడా. నగరిలో పర్యటించిన చంద్రబాబు ఈ అంశాన్ని రాజకీయంగా వాడేసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే నగరి నియోజకవర్గాన్ని మొత్తానికి మొత్తంగా తిరుపతి జిల్లాలో కలుపుతామనే హామీ ఇచ్చారు చంద్రబాబు. దీనికి సానుకూల స్పందన వచ్చిందనే అభిప్రాయంలో పార్టీ వర్గాలు ఉన్నాయి. చంద్రబాబు వెళ్లిన తర్వాత కూడా నగరి టీడీపీ ఇంఛార్జ్‌ గాలి భాను ప్రకాష్‌ సైతం ఇదే నినాదంతో నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు.

పుంగనూరులోనూ ఇదే తరహా బాణం వేశారు చంద్రబాబు. ఇక్కడ టీడీపీ అధినేతకు రాజకీయ ప్రత్యర్థి అయిన మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఉన్నారు. పుంగనూరు ప్రజల కోరిక మేరకు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో కలుపుతామని చంద్రబాబు చెప్పడంతో.. పెద్దిరెడ్డి టీమ్ అలర్ట్‌ అయిందట. ఇప్పటికైతే ఎలాంటి స్పందన లేకపోయినా.. వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్టు భావిస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. పుంగనూరు అజెండా లక్ష్యంగా టీడీపీ ఇంఛార్జ్‌ చల్లా బాబు సైతం ప్రచారం స్పీడ్‌ పెంచారు. మొత్తానికి నగరి, పుంగనూరు విషయంలో వేసిన పాచిక పొలిటికల్‌గా వర్కవుట్‌ అయ్యిందనే లెక్కల్లో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. దీనికి విరుగుడు వేసే పనిలో వైసీపీ శిబిరం ఉంది. ప్రస్తుతానికి మౌనంగానే ఉన్నా.. సరైన సమాధానంతో ముందుకొస్తారనే చర్చ జరుగుతోంది. మరి.. నగరి, పుంగనూరు విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.